నా పుస్తకాలకు వంశీనే ప్రేరణ

Thu,October 3, 2019 12:12 AM

‘1950-70 మధ్యకాలంలో తెలుగునాట వెండితెర నవలలు ఓ వెలుగు వెలిగాయి. వాటిలో ముళ్ళపూడి వెంకటరమణ రాసిన పుస్తకాలు నాకు ఇష్టం. నేను నాలుగు వెండితెర నవలలు రాశాను. అందులో ‘తాయారమ్మ బంగారయ్య’ మినహా మిగిలినవి ప్రచురితమయ్యాయి’ అని అన్నారు సీనియర్‌ దర్శకుడు వంశీ. సీనియర్‌ సినీ పాత్రికేయులు పులగం చిన్నారాయణ, వడ్డి ఓం ప్రకాశ్‌ నారాయణ రాసిన ‘వెండి చందమామలు’ పుస్తకాన్ని బుధవారం హైదరాబాద్‌లో వంశీ ఆవిష్కరించారు. దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారి రవిప్రసాద్‌ పాడి తొలికాపీని అందుకున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు వంశీ మాట్లాడుతూ ‘తెలుగులో ఉన్న అనేక వెండితెర నవలల మీద ఇలాంటి పరిశోధనాత్మక రచన ఇంతవరకు రాలేదు. ఎవరూ రాయలేదు. ఈ పుస్తకం పాఠకాదరణను చూరగొనాలని ఆశిస్తున్నాను’ అని అన్నారు. పులగం చిన్నారాయణ మాట్లాడుతూ ‘ఇంతకుముందు నేను రాసిన పుస్తకాలకు, ఈ పుస్తకానికి ప్రేరణ వంశీగారే. వెండితెర నవలలపై పుస్తకం రాయమని నాకు, మిత్రుడు ఓం ప్రకాశ్‌కు ఆయనే సలహా ఇచ్చారు. నేను తొలి నంది అవార్డును అందుకున్న ‘ఆనాటి ఆనవాళు’్ల పుస్తకానికి పేరును వంశీనే సూచించారు’ అని చెప్పారు. ఈ పుస్తకంలో వెండితెర నవలల గురించి రాయడమే కాకుండా స్వర్గీయ ముళ్ళపూడి వెంకటరమణ, నవోదయ రామ్మోహనరావు, శ్రీరమణ, సింగీతం శ్రీనివాసరావు లాంటి పెద్దల అభిప్రాయాల్ని పొందుపరిచామని, పరిశోధన గ్రంథాన్ని తలపించే ఈ రచన అందరి మన్ననల్ని పొందుతుందనే నమ్మకం ఉందని వడ్డి ఓం ప్రకాశ్‌ నారాయణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ పాత్రికేయులు రెంటాల జయదేవ పాల్గొన్నారు.

294

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles