ఆరు అంగాలు


Fri,November 4, 2016 01:08 AM

బ్రహ్మతత్త్వాన్ని గుర్తించుటకు, బ్రహ్మప్రాప్తికి, ముఖ్యం గా ఆరు అంగాలు గల ఉపాసనను ఉపనిషత్తు విధిస్తున్నది. సుబాలోపనిషత్తులోని తృతీయఖండం బ్రహ్మ స్వరూపాన్ని నిరూపణం చేయునట్టిది. ఈ ఘట్టంలోనే బ్రహ్మతత్త్వాన్ని సత్యం చేత, దానం చేత, తపస్సు చేత, బ్రహ్మచర్యం చేత, ఫలాభిసంధిరహితమైన ఆహార నియమం చేత లేక యజ్ఞా ది కర్మల చేత, వైరాగ్యం చేత (ఈ ఆరు అంగాలతో) సాధించాలి ఏతద్వై సత్యేన దానేన తపసా అనాశకేన బ్రహ్మ చర్యే ణ నిర్వేదనేన అనాశకేన షడంగేనైవ సాధయేత్ అని చెప్పబడినది.


1)సత్యం: ప్రాణులకు మేలు కలిగించే మాటనే సత్యమంటారు. మేలు చేకూర్చునట్టి, ప్రాణులకు ప్రీతి కలిగించునట్టి, హితవంతమైనట్టి సత్యవాక్కులను మితంగా మాట్లాడేవాడు బ్రహ్మను పొందుతాడు.
2)దానం: యాచకుల అవసరాలు తీరటానికి, లోక కల్యాణం కోసం యజ్ఞయాగాదులు నిర్వహించే, ఆధ్యాత్మిక, ధార్మిక భావనలను, శాస్త్ర మర్యాదలను, సంప్రదాయ విషయాలను ఆవిష్కరించే గ్రంథాల ను ముద్రించే సాధు సజ్జనుల సత్సంకల్పాలను కార్య రూపంలోకి తీసుకరావటానికి దాన ధర్మాలను చేయాలి. వాటివల్ల చిత్తం ప్రసన్నమవుతుంది. ఇవి పరమాత్మను పొందేందుకు ఎంతగానో ఉపకరిస్తాయి.

3)తపస్సు: తపస్సు అంటే తత్త్వపర్యాలోచనము. ఇది అంతఃకరణ పరిశుద్ధికి ఎంతగానో ఉపకరిస్తుం ది. యజ్ఞ-దాన-తపములు మనస్సులోని మాలిన్యాన్ని తొలిగించి పవిత్రతను కలిగించేవి యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణామ్ అని భగవద్గీత మనకు ఉద్బోధిస్తున్నది.
4) ఆహార నియమాన్ని పాటించడం వల్ల భగవత్ ప్రీతి కోసం చేసే యజ్ఞ యాగాది కర్మల వల్ల బ్రహ్మప్రాప్తికి మార్గం సుగమమవుతుంది.
5) బ్రహ్మచర్యం: ఇంద్రియాలు భోగానుభవం కోసం కాకుండా తత్త్వ దర్శనానికి అనుకూలంగా ఉండేట్లుగా ప్రవర్తించడాన్నే బ్రహ్మచర్యం అంటారు. వేదాధ్యయనాదులు కూడా బ్రహ్మచర్యంలోనే అంతర్భవిస్తాయి.
6) వైరాగ్యం: లౌకిక విషయాల పట్ల ఏర్పడే వైరాగ్యం బ్రహ్మప్రాప్తికి ఎంతగానో ఉపకరిస్తుంది.

సుబాలోపనిషత్తు ఈ ఆరు అంగాలతోకూడిన ఉపాసనను బ్రహ్మప్రాప్తికి ఉపాయంగా పేర్కొంటున్నది. భారతీయ వాఙ్మయానికి శిఖరాయమాణంగా ఉండే ఉపనిషత్తులను అధ్యయనం చేయాలనే తపన ఏర్పడి దానిని సాకారం చేసుకునే దిశగా ప్రయత్నాన్ని ప్రారంభించినప్పుడే మానవ జన్మకు సార్థకత లభించినట్లు అనే సత్యాన్ని గ్రహిద్దాం. ఉపనిషద్వాఙ్మయాన్ని క్షుణ్ణంగా గురువు వద్ద అధ్యయనం చేయటానికి ఉపక్రమిద్దాం.
- సముద్రాల శఠగోపాచార్యులు

3847
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles