ఆర్థిక మందగమనం


Sat,August 17, 2019 12:18 AM

దేశీయరంగంలోనే కాదు, అంతర్జాతీయంగా కూడా అనిశ్చిత పరిస్థితులు ఉన్నాయనేది మోదీ ప్రభుత్వం గమనంలోకి తీసుకోవాలె. ప్రపంచవ్యాప్తంగా 2020 నాటికి పలు దేశాలు మాంద్యంలోకి జారిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. బ్రిటిష్ ఆర్థిక వ్యవస్థ కుంచించుకుపోతున్నది. ఇటలీలో ఉత్పత్తి తగ్గింది, నిరుద్యోగం పెరిగింది. భారీ రుణం, రాజకీయ అనిశ్చితి మూలంగా ఆర్థిక పరిస్థితి మరింత దిగజారే సూచనలు కనిపిస్తున్నాయి.

దేశ ఆర్థిక పరిస్థితి దిగజారుతుండటంతో పారిశ్రామికవర్గాలలో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ శుక్రవారం ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో చర్చించారు. సీతారామన్ ఇప్పటికే వివిధరంగాల ప్రతినిధులతో సమావేశమై ఈ విషమ పరిస్థితిని అధిగమించే మార్గాలపై సంప్రదింపులు జరిపారు. ఆర్థికరంగంలో ఊపు తేవడానికి ఉద్దీపన పథకాన్ని అమలుచేస్తారనే ఆశాభావం పారిశ్రామికవర్గాలలో వ్యక్తమవుతున్నది. పారిశ్రామిక సంస్థలకు పన్నులు తగ్గించడం, ప్రోత్సహకాలు అందించడం, వ్యయం తగ్గడంతోపాటు, సులభ వాణిజ్య విధానాలు అవలంబించాలని కేంద్రం భావిస్తున్నది. అనేక వస్తువులపై పరోక్ష పన్నులు తగ్గించడం ద్వారా వినియోగం పెంచాలనే ఆలోచిస్తున్నది. వాహనరంగాల వారు జీఎస్టీ తగ్గించాలని కోరారు. వాహన, రియల్‌ఎస్టేట్ రంగాలు మొదలుకొని సాధారణ వినియోగ వస్తువుల వరకు అమ్మకాలు భారీగా తగ్గిపోయాయి, నిరుద్యోగం పెరిగిపోయింది. మోదీ మొదటి విడత పాలన ప్రారంభం అయినప్పటి నుంచి పలురంగాలలో అనిశ్చితి నెలకొన్నది. కానీ కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం కాలేదు. మోదీ ప్రభుత్వం తీసుకున్న రెండు ప్రధాన నిర్ణయాలు దేశ ఆర్థికవ్యవస్థను దెబ్బతీశాయి. మొదటి పెద్ద నోట్ల రద్దు అయితే రెండవది జీఎస్టీ. పెద్దనోట్ల రద్దు వల్ల ప్రధాని చెప్పిన సత్ఫలితాలు ఏవీ రాలేదు. కానీ ప్రతి రంగం దిగజారిపోయింది. బ్యాంకింగ్ రంగంతో నిమిత్తంలేని గ్రామీణ ఆర్థికవ్యవస్థ మరింతగా ఛిన్నాభిన్నమైంది. ఇప్పటికే సంక్షోభంలో ఉన్న వ్యవసాయంరంగం కోలుకోలేనంత దెబ్బతిన్నది. చిన్న మధ్యతరహా పరిశ్రమల రంగాలు, చిల్లర వ్యాపారాలు కుదేలయ్యాయి. ఈ ప్రభావం మిగతా అన్నిరంగాలపై పడ్డది.

మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ఫలితంగా, 2018 నుంచే స్థూల, సూక్ష్మ ఆర్థిక సూచికలు మందగమనాన్ని సూచించాయి. ఆర్థిక సంక్షోభం ముంగిటిలో ఉన్నామనేది ఇప్పుడు స్పష్టంగా తెలిసిపోతున్నది. ఆర్థికవేత్తలు చెబుతున్న ప్రకారం- నేటి ఆర్థిక వ్యవస్థలకు ప్రధాన చోదకశక్తులు పబ్లిక్, ప్రైవేట్ పెట్టుబడులు, ఎగుమతులు, వినియోగదారుల కొనుగోళ్ళు. ఈ నాలుగు రంగాలు ఆశాజనకంగా లేవు. ప్రత్యక్షం గా, పరోక్షంగా ప్రభుత్వ విధానాల ప్రభావం వల్ల ప్రైవేటు పెట్టుబడులు తగ్గిపోయాయి. 2014లో యూపీఏ ప్రభుత్వం ఏర్పడిన తరువాత రెండేండ్లకు 2006- 07 నుంచి 2010- 11 నాటి వరకు సగటున 25 లక్షల కోట్ల మేర ప్రైవేటు పెట్టుబడులు వస్తే, మోదీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత 2018-19 నాటికి 9.5 లక్షలకు దిగజారాయి. 2004 నుంచి ఏనాడు ఇంత కనిష్ఠ స్థాయిలో కొత్త పెట్టుబడులు లేవు. మొత్తం పెట్టుబడుల్లో మూడింట రెండు వంతులు ఉన్న ప్రైవే టు పెట్టుబడులు 47 శాతానికి పడిపోయాయి. అత్యంత ఎక్కువగా విదేశీ పర్యటనలు చేసిన ప్రధాని మోదీ హయాంలో ఎగుమతులు భారీగా తగ్గిపోయాయి. 2013-14లో 314.88 బిలియన్ డాలర్ల ఎగుమతులు ఉంటే, ఆ తరువాత తగ్గిపోవడమే తప్ప మించిపోయింది లేదు. కొంతకాలం ప్రభుత్వ పెట్టుబడులు ఆర్థికవ్యవస్థను నడిపించాయి. జీఎస్టీ వసూళ్ళు ఆశించినస్థాయిలో లేకపోవడంతో పాటు, లోటును తగ్గించడం, ఇతర కారణాల వల్ల ప్రభుత్వం వ్యయం తగ్గిపోయింది. మూలిగే నక్కమీద తాటిపండు పడ్డట్టు వినియోగదారుల కొనుగోళ్ళు తగ్గిపోయాయి. వినియోగదారులు వస్తువులు కొనకుంటే చాలు, ప్రపంచమంతా మహామాంద్యంలో కూరుకుపోక తప్పదు. ఇప్పుడు జరుగుతున్నది అదే. ఈ పరిస్థితుల్లో ఏదో ఉద్దీపనలు కాదు, భారీగా విధానపరమైన మార్పులు అవసరం.

దేశీయరంగంలోనే కాదు, అంతర్జాతీయంగా కూడా అనిశ్చిత పరిస్థితులు ఉన్నాయనేది మోదీ ప్రభుత్వం గమనంలోకి తీసుకోవాలె. ప్రపంచవ్యాప్తంగా 2020 నాటికి పలు దేశాలు మాంద్యంలోకి జారిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. బ్రిటిష్ ఆర్థిక వ్యవస్థ కుంచించుకుపోతున్నది. ఇటలీలో ఉత్పత్తి తగ్గింది, నిరుద్యోగం పెరిగింది. భారీ రుణం, రాజకీయ అనిశ్చితి మూలంగా ఆర్థిక పరిస్థితి మరింత దిగజారే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రపంచంలోని నాలుగవ పెద్ద ఆర్థికవ్యవస్థ అయిన జర్మనీ కూడా మాంద్యం అంచున ఉన్నది. లాటిన్ అమెరికాలో అతిపెద్ద ఆర్థికవ్యవస్థ అయిన బ్రెజిల్‌లో ఉత్పత్తి తగ్గింది, నిరుద్యోగం పెరిగింది. మెక్సికో ఆర్థికవ్యవస్థ బలహీనంగా ఉన్నది. వాణిజ్య కేంద్రాలుగా భాసిల్లిన హాంకాంగ్, సింగపూర్ ఆర్థిక వ్యవస్థలు లుకలుకలాడుతున్నాయి. చైనా ఆర్థిక వ్యవస్థ కూడా మందగమనంలోనే ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తిరంగం సంక్షోభంలో ఉన్నది, సేవల రంగం కూడా దిగజారింది. అమెరికా, చైనా వాణిజ్య- సాంకేతిక యుద్ధం ముగిసే సూచనలు కనిపించడం లేదు. యూరప్‌లో ఆర్థిక, రాజకీయ, విధానపరమైన సమస్యలు తలెత్తున్నాయి. భారత్ వర్ధమాన దేశమే కాదనీ, ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనల కింద రాయితీలు పొందడమేమిటని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటున్నారు. తాము డబ్ల్యుటివో నుంచి బయటపడతామని కూడా బెదిరిస్తున్నారు. ఈ క్రమంలో ప్రపంచీకరణకు విరుద్ధ పరిణామాలు చోటు చేసుకోవచ్చు. భారత్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తమ దేశీయంగా ఆర్థిక విధానాలను, అంతర్జాతీయ సంబంధాలను పునర్నిర్మించుకోవాలె.

307
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles