చినుకు కథ

Mon,August 19, 2019 01:18 AM

SEED
ఆకాశం మబ్బుల చీర కట్టుకుంది
భూమికి మొదటి ముద్దు ఇవ్వాలని..
అంతలోనే గాలి విసురుగా వచ్చి
మబ్బుకి రూపం లేకుండా చేసింది
ఒక్కో బిందువు ఆవిరితో
తనను తను మళ్ళీ నిర్మించుకుంటోంది ఆకాశం!
భూమిని తడపాలని తపన ఆకాశానికి
చినుకులను కానుకిచ్చి మచ్చిక చేసుకోవాలని ఆరాటం !
భూమి ఏమి తక్కువ తినలేదు..
ఆకుపచ్చ సిగ్గులను వాగ్దానం చేస్తుంది
రైతులు గింజలు తీసుకుని బయల్దేరారు
భూమికి రంగులద్దడానికి !
ఇంతకంటే అద్భుత దృశ్యం ఏముంటుంది లోకంలో?
తనలో ఆవిరిగా లేస్తున్న విరహాన్ని లేఖ రాసింది భూమి!
ఆకాశం చదివి నవ్వుకుని..
మబ్బులతో ఉపశమింప చేసింది..!
వాన చినుకులతో నిమిరి ఓదార్చింది!
ఆకాశం, భూమి అలా తరతరాలుగా
ప్రేమించుకుంటూనే ఉన్నయ్.. ఉంటయ్..
ఇన్ని కోట్లమందికి జీవం పోస్తున్న ఆ ప్రేమ
ఎంత అద్భుతమైంది కదా!
విత్తనం కఠినంగా ఉంది
బయట పొడిగా ఉంది
అందరికీ ఆకలిగా ఉంది
ఆకాశానికి కోపమొచ్చి విత్తనాన్ని మార్చాలని
అదేపనిగా వర్షించింది..
విత్తనం పొరలు పొరలుగా మెత్తబడి..
సిగ్గుపడి భూమిలో తల పెట్టుకుంది
అప్పుడు భూమి..
భయపడవద్దని మొలకెత్తమని
తలెత్తుకు బతకమనీ
తనలాగా అందరికీ సాయపడమనీ చెప్పింది..!
అంతే...
ఈ ప్రపంచానికి ఆకుపచ్చగా సలాం చేసింది విత్తనం!
వాన ఎంత గొప్పది..
చీకటైనా, వెలుతురైనా
గుడ్డిగా భూమిని ప్రేమించేస్తుంది!
నల్ల తెల్ల చామన...
ప్రతీ ఛాయను హత్తుకుంటుంది!
నేలైనా, నీరైనా..
నగరమైనా, పైల్లెనా..
అడవైనా, మైదానమైనా
వాన కురుస్తూనే ఉంటుంది..
సమానత్వాన్ని చాటుతూనే ఉంటుంది..!
ఎంత అద్భుతమైన సందేశం!
వానొస్తుంటే అందరూ
వేడిగా బజ్జీలు, ఐస్ క్రీమ్ తినాలనో..
కాఫీలు, సూప్ లు తాగాలనో..
తడవాలనో పలవరిస్తుంటరు..
నాకేమో
ఊర్లో రైతు కలలోకి తొంగి చూడాలనిపిస్తుంది
అక్కడ ప్రవహించే జలధారలను తడమాలనిపిస్తుంది
అక్కడే కదా..
కోట్లమంది ఆకలికి సమాధానం దొరుకుతుంది!
- డాక్టర్ షాజహానా

92
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles