బంజారాల సంస్కృతికి ప్రతీక

Mon,August 19, 2019 11:56 PM

Teej-festival
దేశంలో బంజారా గొడుగు కింద దాదాపు 10 కోట్ల జనాభా ఉన్నది. వివిధ పేర్లతో పిలవబడుతూ అన్నిరాష్ర్టాలలో ఉన్నారు. లంబాడీలు, సుగాలీలు, చరన్ బంజారా, వనజర, బాజీగర్ బంజర, లబాన్ బంజారా మొదలగునవి. వీరి కులవృత్తులమీద ఆధారపడి 12 ఉప కులాలు ఉన్నాయి. వీరు కొన్ని ప్రత్యేకమైన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ప్రత్యేక వస్త్ర ధారణను కలిగి ఉన్నారు. దేశ, విదేశాలు, ఏ రాష్ట్రంలో ఉన్నా లిపిలేని బంజారా భాష (గోర్ బోలి)నే మాట్లాడుతారు. వీరు ప్రకృతిని, వారి సంఘ సంస్కర్తలను, పూర్వీకులను దేవతలుగా కొనియాడుతారు. వీరు సంచార జీవులు. కాబట్టి అతి తక్కువ పండుగలు జరుపుకుంటారు. ఇందులో తీజ్ పండగ ముఖ్యమైనది. బంజారాలు స్థిర నివాసాలు ఏర్పర్చుకున్నాక తండాల్లో తీజ్ పండుగ నిర్వహించుకుంటారు. కానీ బతుకు దెరువు కోసం పట్టణాలకు వలస వచ్చినవారు, ఉద్యోగరీత్యా వచ్చిన వారు, వారి సంస్కృతికి ప్రతీకైన తీజ్ పండుగను మరిచిపోకుండా జరుపుకోవడం అభినందనీయం. బంజారాలు గతంలో సంచారజీవులుగా కొనసాగారు. కాబట్టి తీజ్ పండగను అందరూ ఒకేరోజు జరుపుకోవడానికి వీలుపడేది కాదు. సమాజంలో మారుతున్న పరిణామాలకు అనుగుణంగా తీజ్ పండుగను బతుకమ్మ పండగ వలె ప్రభుత్వం గుర్తిస్తే ఒకేరోజు జరుపుకునే అవకాశం లభిస్తుంది. అంతరించిపోతున్న ఈ పండగ విశిష్టతను పునరుద్ధరించడమే కాకుండా, ప్రాముఖ్యం పెరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శమవుతుంది. లంబాడీలకు లిపి లేని కారణంగా వారికుండే ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్రను, దేశ స్వాతంత్య్రం కోసం బంజారాల త్యాగాలు, మౌఖికంగా అనేకతరాల నుంచి సంక్రమించే క్రమంలో ప్రాంతాలవారీగా కొన్ని వ్యత్యాసాలు ఉండే అవకాశం ఉన్నది. కాబట్టి రాబోయే తరాలకు బంజారాజాతి చరిత్రను అందిచాలంటే గోర్ బోలి భాషను 8వ షెడ్యుల్‌లో చేర్పించాలని, తీజ్ పండగను అధికారికంగా ప్రకటించాలని గిరిజన బతుకుల్లో మార్పుతెస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని యావత్ లంబాడీ జాతి కోరుతున్నది.

బంజారాలు ఎక్కడున్నా ఏ ప్రాంతంలో ఉన్న ప్రతి బంజారా వంశీయుడు తీజ్ పండుగను విధిగా జరుపుకోవడం ఆ జాతికే గర్వకార ణం. ఈ పండుగ జాతి సంస్కృతి, సంప్రదాయం, విశిష్టతను చాటిచెప్పే ఏకైక ఉత్సవం. మనకు జన్మనిచ్చిన పూర్వీకులను, మన దేవతలను కొనియాడుతూ, స్మరిస్తూ వారి ఆశీస్సులు పొందే అవకాశం ఈ పండగ ఇస్తుంది.


తీజ్ పండగ నిర్వహించడానికి ఆ తండాలో ఉండే యుక్తవయస్సు కలిగి న పెండ్లి చేసుకోబోయే యువతులు తండా నాయకుని తీజ్ పండగ నిర్వహించాలని వేడుకుంటారు. నాయకుడు తండా ఆర్థిక పరిస్థితులను దృష్టి లో పెట్టుకుని నిర్వహించడానికి ఆజ్ఞాపిస్తారు. తీజ్ పండుగ జరుపుకోవడానికి అనుమతి లభించిన తరువాత శ్రావణమాసంలోని మంగళవారం రోజు సప్త మాతల్లో ఒకరైన సీత్ల భవానిని పూజించడానికి వన భోజనానికి ఊరి బైటికి వెళ్తారు. ఈ సందర్భంలో పశుపక్ష్యాదులకు వ్యాధులు సోకకూడదని సీత్ల భవాని ముందు నుంచి పశువుల మందను దాటిస్తూ దేవతకు సమర్పించిన నైవేద్యాన్ని పశువులపైకి చల్లుతారు. ఈ దృశ్యం చూడ ముచ్చటగా ఉంటుంది. అదేరోజు మంగళవారం సాయంత్రం తండా నాయకుని ఇంటి ముందు తీజ్‌కు సంబంధించిన గోధుమలను ఒక బిందలో పోసి నానబెట్టి ఉట్టితో ఒక కొయ్యకు వేలాడదీస్తారు. మరుసటిరోజు బుధవారం సాయంత్రం వెదురుతో తయారుచేయించిన బుట్టలలో కొంత ఎరువు వేసి గోధుమలను చల్లుతారు. గోధుమలతో కూడిన ప్రతి ఒక్క బుట్టకు ఒక ప్రత్యేకత ఉన్నది. ఆ తండాలో ఉన్న ఆడపిల్లలకు వారి బంధువుల ఆడపిల్లల సంఖ్యను బట్టి ఎంతమంది ఉంటే అన్ని బుట్టలు మాత్రమే కడుతారు. వీటితో పాటు వారి కుల దేవతలైన శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్, దండి మేరమా యాడి పేర్ల మీద టేకాకులతో తయారుచేసిన రెండు డొప్పలలో కూడా గోధుమలను పెంచుతారు. ఈ బుట్టలన్నింటిని తండా నాయకుని ఇంటిముందు పందిరి వేసి వేలాడదీస్తారు. ఆ రోజు నుంచి ప్రతిరోజు మూడుసార్లు వరస కలిగిన పూజారులు అయిన ఇద్దరు ఆడపిల్లలతో పాటు ఇతర అమ్మాయిలు డప్పు వాయిద్యాల సహాయంతో దగ్గరలో ఉన్న చెరువు/బావి నుంచి తెచ్చిన నీళ్ళను గోధుమలు కలిగిన బుట్టలకు పోస్తారు. డమోళి కార్యక్రమం నిమజ్జనానికి ముందురోజు సాయంత్రం జరుగుతుం ది. ప్రతి ఇంటి నుంచి బియ్యపు పిండితో చేసిన రొట్టెలు, బెల్లం, నెయ్యితో (చూర్మో, మోయి, లప్సి) తయారుచేసిన తీపి పదార్థాలు ఒక వెడ్ల్పైన పాత్ర (కాకోటిలో) పెట్టుకుని తలపైన ప్రత్యేకంగా అలంకరించబడిన చుట్టబట్ట(పులెరోగాల) పై పెట్టుకుని ప్రత్యేకంగా అలంకరించిన (అద్దలు, గవ్వలు, పూసలతో తయారుచేసిన ) వస్త్రంకాకొటిపై కప్పుకుని తీజ్ ఉన్న ప్రదేశానికి వస్తారు.
professor-Seetharam-Nayak
తీపి పదార్థాలను అందరికి పంచుతారు. డమోళి రోజు పుట్ట మట్టిని ఆటపాటలతో తీసుకు వచ్చి వరుసలు కలిసే రెండు ఇండ్లలో ఆడ, మగ గన్ గోర్‌లను తయారుచేస్తారు. తీజ్‌పై ఎలాంటి ఇతరశక్తుల ప్రభావం ఉండకూడదని ఆటపాటలతో గన్ గోర్‌లను ఊరేగించి వాటిని రూపుమాపుతారు. ఫలితంగా ఏ శక్తి ప్రభావం తండా వాసులపై ఉండకూడదని అర్థం. వీరిని వారి పూర్వీకులుగా భావిస్తారు. తొమ్మిదవరోజు గురువారం శ్రీ సేవాలాల్ మహరాజ్‌కు హోమం పెట్టి, దండిమేర యాడికి బలి పూజ చేస్తారు. ఆ రోజంతా వచ్చిన బంధువులతో (పామణ్) కలిసి సాంస్కృతిక కార్యక్రమాలైన (నాచేరో, దండామారేతో) ఘనంగా నిర్వహిస్తారు. పూజారులైన బంజారా యువతులు తొమ్మిది రోజులు ఈ కార్యక్రమంలో నిష్టతో పాల్గొని, సేవలు అందిస్తూ ఎనలేని ఆనందాన్ని పాలుపంచుకుంటారు. వివాహానంతరం ఈ అవకాశం రాదని దు:ఖాన్ని వెల్లిబుచ్చుతారు. అదేరోజు సాయంత్రం గోధుమ నారుతో కూడిన తీజ్ బుట్టలను ఎవరివి వారు తీసుకును నిమజ్జనానికి ఆడుతూ పాడుతూ బయలుదేరుతారు. చెరువులో నిమజ్జనం చేసిన తరువాత వారి ఆడపడచుల కాళ్ళు (పిడియా) పైన ఉంచి కడిగి దండం పెడతారు. వారితో తీసుకువెళ్ళిన సద్ది రొట్టెలను తిని తిరిగి వారి వారి ఇళ్ళకు చేరుకుంటారు. బంజారాలు ఎక్కడున్నా ఏ ప్రాంతంలో ఉన్న ప్రతి బంజారా వంశీయుడు తీజ్ పండుగను విధిగా జరుపుకోవడం ఆ జాతికే గర్వకార ణం. ఈ పండుగ జాతి సంస్కృతి, సంప్రదాయం, విశిష్టతను చాటిచెప్పే ఏకైక ఉత్సవం. మనకు జన్మనిచ్చిన పూర్వీకులను, మన దేవతలను కొనియాడుతూ, స్మరిస్తూ వారి ఆశీస్సులు పొందే అవకాశం ఈ పండగ ఇస్తుం ది. మనం ఏ జాతి నుంచి ఉద్భవించామో ఆ జాతికి రుణపడి ఉండాలి. ఆ జాతి ప్రయోజనాలతో పాటు సంస్కృతి సంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత విజ్ఞానవంతులైన మనపై ఉన్నది. మన సంస్కృతిని సజీవంగా ఉంచి జాతి ఔనత్యాన్ని కాపాడాలి.
(వ్యాసకర్త: మాజీ లోక్‌సభ సభ్యులు, మహబూబాబాద్)

230
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles