మైనర్ డ్రైవర్లు!

Wed,August 21, 2019 09:42 AM

కాలేజీ విద్యార్థులు బైకులు, కార్లపై మితిమీరిన వేగంతో దూసుకుపోవడం వల్ల జరుగుతున్న ప్రమాదాల పట్ల ఎంతోకాలంగా ఆందోళన చెందుతున్నాం. కానీ కాలేజీ విద్యార్థులే కాదు, మైనారిటీ తీరని పిల్లలు కూడా వాహనాలు నడుపుతూ ప్రమాదాలు సృష్టిస్తున్నారు. హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లిలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదం ఇద్దరి ప్రాణాలు బలిగొని అంతులేని విషాదాన్ని మిగిలించింది. పదో తరగతి చదువుతున్న పదహారేండ్ల బాలుడు స్నేహితులను ఎక్కించుకొని అతివేగంగా రాంగ్‌రూట్‌లో దూసుకుపోయి, ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను, మరో రెండు ద్విచక్రవాహనాలను ఢీకొట్టాడు. ఆటోలో ఒక మహిళ తన తల్లి, ఇద్దరు కవల పిల్లలతోపాటు ప్రయాణిస్తున్నది. కారు ఢీకొనడంతో ఆ మహిళ గాయాలపాలై విషమ పరిస్థితిలో ఉండగా ఆమె తల్లి ప్రాణాలు కోల్పోయింది.14 నెలల వయసున్న ఇద్దరు కవల పిల్లల్లో ఒక బాలుడు మరణించాడు. ఆటోడ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరు ద్విచక్ర వాహనదారులకు కూడా గాయాలు కాగా, వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇలా నగరంలో రోజూ ఏదో ఒకచోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతి నెల 25 నుంచి 30 మంది దాకా దుర్మరణం పాలవుతున్నారు. ఈ ఏడాది అక్టోబర్ వరకే నగరంలో 250 మంది రోడ్డుప్రమాదాల్లో చనిపోయారు. రోడ్డు ప్రమాదాలకు అనేకానేక కారణాలుంటే, అందులో కొన్ని ప్రమాదాలకు మైనర్లు కారణం కావటం తీవ్ర విషయం. ఈ ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 40 శాతం వాటికి మైనర్లే కారకులని తేలింది. 2017లో 1761 ప్రమాదాలకు మైనర్లు కారణమైతే, 2018లో 1931, 2019లో ఇప్పటిదాకా 2832 ప్రమాదాలకు మైనర్లే కారకులు కావటం గమనార్హం. తల్లిదండ్రుల అతి గారాబం, పిల్లల నిర్లక్ష్యం ఇతరుల ప్రాణాలు తోడేసిదిగా మారటమే పెద్ద విషాదం.

పిల్లలు తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నా లేకున్నా వాహనాలు తీసుకుని మిత్రులతో పాటు తిరుగుతున్నారు. వీరికి రోడ్డు నిబంధనలు తెలువవు. వాహనాన్ని నడిపేంత పరిణతి ఉండదు. లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపడం నేరమనే స్పృహ కూడా ఉండటం లేదు. వాహనాలు నడుపుతూ పట్టుబడిన పిల్లలను తల్లిదండ్రులు వెనుకేసుకురావడం సాధారణం. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులకు తెలువకుండా పిల్లలు వాహనాలను నడుపవచ్చు. తమ వాహనాలను పిల్లలకు అందకుండా జాగ్రత్తపడవలసిన బాధ్యత తల్లిదండ్రులదే.


ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో మన దేశమే అగ్రస్థానంలో ఉన్నది. దీనికి అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడుపటం, ట్రాఫి క్ నిబంధనలు పాటించటంలో అలసత్వం, వాటిపై అవగాహన లోపం ప్రధాన కారణాలని తెలుస్తున్నది. రహదారులను శాస్త్రీయపద్ధతిలో నిర్మించకపోవటం, జాతీయ రహదారుల్లో కూడా అతి దగ్గరి మూల మలుపులు ఉండటం కూడా ప్రమాదాలకు హేతువులుగా ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. 2017లో దేశ వ్యాప్తంగా 4,61,000 ప్రమాదాలు జరుగగా లక్షా 49 వేల మంది దుర్మరణం పాలయ్యారు. గతేడాది 4,65,000 ప్రమాదాలు జరుగగా లక్షా 48 వేల మంది చనిపోయారు. ఈ మధ్య కాలంలో ద్విచక్రవాహనాల ప్రమాదాలు పెరిగిపోయి యువత మరణాలు లెక్కకు మిక్కిలి జరుగుతున్నాయి. దీనికి అతివేగం, మద్యం తాగి నడుపటమే ప్రధాన కారణమని తేలింది. ఇలా రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న వారిలో ఎక్కువగా 16 నుంచి 30 ఏండ్ల లోపు వారే ఉంటున్నారు. ఈ ప్రమాదాలను అరికట్టేందుకే ఇటీవల పార్లమెంటు సమావేశాల్లో మోటారు వాహనాల చట్టం (సవరణ) బిల్లును ఆమోదించారు. ఈ చట్టంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించటం, మద్యం తాగి వాహనాలు నడుపటం వంటి నేరాలకు జరిమానాలు పెంచటమే కాదు, తీవ్ర నేర విషయం గా పరిగణించి శిక్షా కాలాన్ని కూడా పెంచారు. మైనర్లు, లైసెన్స్ లేకుండా నడిపిన వారికి జరిమానాతో పాటు శిక్ష వేసేవిధంగా చట్టాలకు పదునుపెట్టారు. మైనర్లకు వాహనాలు అందకుండా చూడటం తల్లిదండ్రుల బాధ్యత. కొందరు తల్లిదండ్రులే పిల్లలకు పనులు చెబుతూ వాహనాలు తీసుకుపొమ్మని పురమాయిస్తున్నారు.

ఇదే అలవాటుగా పిల్లలు తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నా లేకున్నా వాహనాలు తీసుకుని మిత్రులతో పాటు తిరుగుతున్నారు. వీరికి రోడ్డు నిబంధనలు తెలువవు. వాహనాన్ని నడిపేంత పరిణతి ఉండదు. లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపడం నేరమనే స్పృహ కూడా ఉండటం లేదు. వాహనాలు నడుపుతూ పట్టుబడిన పిల్లలను తల్లిదండ్రులు వెనుకేసుకురావడం సాధారణం. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులకు తెలువకుండా పిల్లలు వాహనాలను నడుపవచ్చు. తమ వాహనాలను పిల్లలకు అందకుండా జాగ్రత్తపడవలసిన బాధ్యత తల్లిదండ్రులదే. అందుకే పోలీసులు మైనర్లతోపాటు వాహన యజమానులైన పెద్దలపైనా కేసులు నమోదు చేస్తున్నారు. కొందరు సంపన్నులు జరిమానా విధింపులకు భయపడటం లేదు. జరిమానాలు స్వల్పంగా ఉన్నందున వాటిని చెల్లిస్తూ అదే తప్పు మళ్ళా చేస్తున్నారు. అందువల్ల రెండవసారి నేరం చేసిన వారికి కఠినశిక్షలు వేయాలని పోలీసులు అంటున్నారు. జరిమానాను కూడా భారీగా వడ్డించినప్పుడే తల్లిదండ్రులు జాగ్రత్తపడుతారని వారు సూచిస్తున్నారు. ఈ క్రమంలో మన రాష్ట్రంలో, ముఖ్యంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసులు విప్లవాత్మక మార్పులతో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించటంతో పాటు ప్రమాదాల నివారణకు పెద్దపీట వేస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై దృష్టిసారించి వాహనదారులకు జరిమానాలు, శిక్షలు విధిస్తున్నారు. రహదారి నిబంధనలు, కుటుంబ బాధ్యతలు గుర్తెరిగి వ్యహరించినప్పుడే రోడ్లపై రక్తం మరకలు అంటవు. రోడ్డు ప్రమాదాల నివారణ అనేది పోలీసుల బాధ్యతగానే భావిస్తే ఆశించిన ఫలితాలు ఉండవు. ప్రమాదాల్లేని సురక్షిత ప్రయాణం తమ బాధ్యతగా ప్రజలు కూడా గుర్తించాలె.

484
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles