ఉద్వేగాలకు లొంగని సాహసి


Wed,September 18, 2019 01:12 AM

justice-ram-jethmalani
ఎంత గొప్ప వ్యక్తిత్వమున్నా.. ఎంత దృఢమైన సంక ల్పం.. స్థితప్రజ్ఞత కలిగిన వ్యక్తి అయినా ఏదోఒక సందర్భంలో భావోద్వేగాలకు లొంగిపోతాడు. ఎం త స్థిరచిత్తుడైనా ప్రజా బాహుళ్యం నుంచి వెల్లువెత్తే భావావేశాలకు ఎదురొడ్డే సాహసం చేయడానికి ఏదో ఒక సందర్భంలోనైనా వెనుకాడుతాడు. అయితే కొంతమంది అసాధారణ వ్యక్తిత్వాలు మాత్రం వీటన్నింటికీ అతీతం. అందుకే వారు లక్షల్లో ఒకరిగా, తాము నమ్ముకున్న వృత్తిలో ఓ లెజండ్‌గా, భావితరాలకు నిత్య స్ఫూర్తిని వెదజల్లే మహోన్నత వ్యక్తులుగా మిగిలిపోతారు. అలాంటి కోవకు చెందిన వ్యక్తే మాజీ కేంద్రమంత్రి, ప్రముఖ న్యాయకోవిదుడు, న్యాయవాద వృత్తికే తలమానికం అని చెప్పుకోదగ్గ ప్రముఖ న్యాయవాది దివంగత రాంజెఠ్మలానీ. న్యాయవాద వృత్తి, న్యాయవిధులతో కొద్దిగా సంబంధం ఉన్న వ్యక్తులకైనా ఆయన గురించి పరిచయం లేకుండా ఉండదంటే అతిశయోక్తి కాదేమో. మొత్తం భారతదేశంలోని న్యాయసమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తూ ఇటీవల దివికేగిన ఆయనను స్మరించుకోని న్యాయవాది ఉండడు. న్యాయవాద వృత్తి చేపట్టే యువ న్యాయవాదులెవరైనా.. తాము రాంజెఠ్మలానీ అంతటివాళ్లం కావాలని కోరుకుంటారు. ఏదో ఒక సందర్భంలో ఆయనను గుర్తుచేసుకుంటారు. అంతలా ఆయన న్యాయవాద వృత్తిపైన చెరగని ముద్రను వేశారు. న్యాయవాది అంటే ఇలా ఉండాలిరా.. అనుకునేవిధం గా ఈ వృత్తిలో ఆయన చేసిన సాహసాలు అన్నీ ఇన్నీ కావు.


ఎమర్జెన్సీ సమయంలో మేరునగ పర్వతం అంత శక్తిశాలి అయిన ఇందిరాగాంధీని ఆయన ఢీకొనే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో పౌరహక్కుల కోసం ఆయన చేసిన పోరాటం అనన్య సామా న్యం. ఇందిరాగాంధీ హత్యకుగురైన సందర్భంగా ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఆగ్రహజ్వలాలకు ఎదురొడ్డి నిందితుల తరఫున వకాల్తా పుచ్చుకోవాలని, తద్వారా తమ ప్రాణాలకే అపాయం తెచ్చుకోవాలని ఎవరూ అనుకోరు. కానీ రాంజెఠ్మలానీలోని సాహసి మాత్రం ఇందిరాగాంధీ హత్యకేసులో నిందితుల తరఫున వాదించేందుకు సై అన్నాడు. అంతటితో ఆగని ఆయన రాజీవ్‌గాంధీ హత్య కేసు లో నిందితుల తరఫున కూడా వకాల్తా పుచ్చుకున్నారు. నమ్ముకున్న వృత్తిని ఎక్కడా పొల్లు పోకుండా చివరికంటా కొనసాగించిన ధీరోదాత్తుడు రాంజెఠ్మలానీ. ఉత్కృష్ఠమైన వ్యక్తిత్వం, అచంచలమైన దీక్షా దక్షతలు ఆయనను ఉన్నత శిఖరాలు అధిరోహించేలా చేశాయి. హక్కులను కాలరాసే చట్టాలకు ఎదురొడ్డి నిలిచిన ధీశాలి. తన వాదనా పటిమతో కొన్ని చట్టాలను రద్దుచేయించడమే కాదు చట్ట విరుద్ధమైన నిబంధనలను తోసిరాజని 17వ ఏటనే లా డిగ్రీని పూర్తిచేసి, 18వ ఏండ్లకే న్యాయవాద వృత్తి ని చేపట్టిన ఘనాపాటి. పాఠశాలస్థాయి నుంచే చదువుల్లో ఆయన చూపి న అసమాన ప్రతిభా పాటవాలు చిన్న వయస్సులోనే పై తరగతులకు ఎగబాకేలా చేశాయి. ఆయన మొట్టమొదట చేపట్టిన కేసును పరిశీలిస్తే ఎంతటివారైనా సంభ్రమాశ్చర్యాలకు గురికావాల్సిందే. 21 ఏండ్లు నిండనిదే న్యాయవాదిగా వృత్తి చేపట్టడానికి వీలుకాదని అధికారులు ఆయన దరఖాస్తును తిరస్కరించారు.

దానిని సింధ్ హైకోర్టు (ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంది)లో ఆయన సవాల్ చేశారు. ఎవరి సహాయం లేకుండానే ఓ ఇంగ్లిష్ జడ్జి ఎదుట ఆయన తన వాదనను వినిపించారంటే ఆయన ఎంతటి సాహసోపేతమైన వ్యక్తో అర్థం చేసుకోవచ్చు. తాను లా కాలేజీలో చేరిన తర్వాత 21 ఏండ్ల నిబంధన అమల్లోకి వచ్చిందని, మరో నాలుగేండ్లపాటు ఖాళీ ఉండాలనే విషయం ముందే తెలిస్తే తన తండ్రి కాలేజీకి పంపేవారే కాదని వాదించారు. ఈ వాదనకు మంత్రముగ్ధుడైన అప్పటి సింధ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ సర్ గాడ్ఫ్రే డేవిడ్.. బార్ కౌన్సి ల్ నిబంధనలను మార్చి సడలింపు లభించేలా చేశారు. దీంతో రాంజెఠ్మలానీ 18 ఏండ్లకే న్యాయవాద వృత్తిని చేపట్టేందుకు మార్గం సుగమమైంది. దేశ విభజన నేపథ్యం లో ఆస్తులన్నీ వదులుకొని భారత్‌కు తరలివచ్చిన ఆయన తన ప్రాక్టీస్‌ను బాంబేకు మార్చారు. ఆయన చేపట్టిన కేసులు కొంత విస్తుగొలేపే విధంగా ఉంటాయి. మాఫియా, స్మగ్లర్లు, అక్రమ వ్యాపారాలు చేసే వ్యక్తులు ఆయన క్లయింట్లు. పాకిస్థాన్ నుంచి వచ్చిన శరణార్థులకు వ్యతిరేకంగా అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ముంబై రెఫ్యూజీస్ చట్టానికి వ్యతిరేకంగా పోరాడిన రాంజెఠ్మలానీ ఆ కేసులో ఘనవిజయం సాధించారు. నానావతి కేసుతో వెలుగులోకి..: రాంజెఠ్మలానీకి మొట్టమొదట బాగా ప్రచారం తెల్చిపెట్టిన కేసు.. ఇప్పటికీ లా విద్యార్థులకు ఉదహరణగా చెప్పే నానావతి కేసు. ఈ కేసు అప్పట్లోనే మీడియా దృష్టిని విపరీతంగా ఆకర్షించింది. నావల్ కమాండర్ అయిన కేఎం నానావతి తన భార్య ప్రియు డు ప్రేమ్ అహుజాను హత్యచేశాడనేది అభియోగం. ప్రేమ్ అహుజా సోదరి తరఫు రాంజెఠ్మలానీ వాదించారు. ఇందులో మొదట నానావతి నిర్దోషిగా తేలినా తర్వాత హైకోర్టు నానావతిని దోషిగా తేల్చింది.

ఎమర్జెన్సీ సమయంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) చైర్మన్‌గా ఉన్న రాంజెఠ్మలానీ.. ఎమర్జెన్సీ విధించిన అప్పటి ప్రధాని ఇందిరాగాంధీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడేవారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఎంతోమంది గొప్పగొప్ప నాయకులకు ఆయన నైతిక ైస్థెర్యం అందించా రు. జైళ్లలో ఉన్న అనేకమంది నాయకుల తరఫున ఆయన కేసులు వాదించారు. ఎమర్జెన్సీ సమయంలో అత్యంత ప్రాధాన్యం సంతరించుకు న్న ఏడీఎం జబల్‌పూర్ వర్సెస్ ఎస్‌ఎస్ శుక్లా అండ్ అదర్స్ కేసులో ఆయన వాదనలు వినిపించారు. ఈ కేసులో సుప్రీంకోర్టు వివాదాస్పద తీర్పు వెలువరించినా రాంజెఠ్మలానీ పోరాట స్ఫూర్తికి మన్ననలు లభించాయి. మరోవైపు ఇందిరాగాంధీ హత్య కేసులో నిందితులు బల్బీర్‌సింగ్, కేహర్‌సింగ్ తరఫున వాదనలు వినిపించారు. ఈ కేసులో బల్బీర్‌సింగ్ నిర్దోషిగా బయటపడ్డారు. అయితే ఇందిరాగాంధీ హత్య కేసులో నిందితుల తరఫున వాదించడంపై రాంజెఠ్మలానీ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనా వెరవకుండా ముందుకువెళ్లిన ఆయన.. ఒక న్యాయవాదిగా నా విధిని నేను నిర్వర్తించాను అని తన వృత్తి నిబద్ధతను, ధైర్యసాహసాలను ప్రదర్శించారు. రాజీవ్‌గాంధీ హత్య కేసులో ఆయన నిందితుల తరఫున హాజరయ్యారు. మరణశిక్ష అమలులో తీవ్ర జాప్యం జరిగిందన్న రాంజెఠ్మలానీ వాదనతో ఏకీభవించిన కోర్టు వారి మరణదండనను జీవితఖైదుగా మార్చింది. వీటితోపాటు దేశాన్ని కుదిపేసిన స్టాక్‌మార్కెట్ కుంభకోణం, పార్లమెంట్ అటాక్ కేసు, జయలలిత అక్రమాస్తుల కేసు, జెస్సికాలాల్ హత్య కేసు, కనిమొళి తరఫున 2జీ స్పెక్ట్రం కేసు, బ్లాక్‌మనీ వంటి హైప్రొఫైల్ కేసులను ఆయన వాదించారు.
vikram-balasani
వీటితోపాటు జైన్ హవాలా కేసులో ఎల్‌కే అద్వానీ తరఫున, సొహ్రబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసులో అమిత్‌షా తరఫున, దాణా కుంభకోణంలో లాలూప్రసాద్ యాదవ్ తరఫున, లైంగిక వేధింపుల కేసులో ఆసారాంబాపూ తరఫున, అరుణ్‌జైట్లీ దాఖలు చేసిన పరువునష్టం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తరఫున, అక్రమాస్తుల కేసులో జగన్ తరఫున, అక్రమ మైనింగ్ కేసులో యడియూరప్ప తరఫున, రాంలీలా గ్రౌండ్ కేసులో బాబా రాందేవ్ తరఫున, సహారా కేసులో సుబ్రతరాయ్ తరఫున వాదనలు వినిపించారు. ఒకానొక సమయంలో అండర్‌వరల్డ్ డాన్ హాజీ మస్తాన్ కూడా రాంజెఠ్మలానీ క్లయింట్‌గా ఉండేవాడు. క్రిమినల్ లా లో మేరుగనగధీరుడు అనిపించుకోదగ్గ స్థాయిలో ఆయన విజయాల శాతం ఉండేది. దేశంలో అత్యంత ఎక్కువ ఫీజు తీసుకున్న న్యాయవాదిగా కూడా ఆయన రికార్డు నెలకొల్పారు. పలుమార్లు లోక్‌సభకు, రాజ్యసభకు ఎన్నికైన ఆయన అటల్ బిహారీ వాజపేయి హయాంలో కేంద్రమంత్రి అయ్యారు. భౌతికంగా ఆయన దూరమైనా.. వృత్తిపరంగా ఆయన సృష్టించిన సంచలనాలు న్యాయవాది వృత్తి గొప్పదనాన్ని నిత్యం చాటుతూనే ఉంటాయి. చివరగా ఆయన జీవితమే ఓ సాహసం.. ఆయన గమనమే ఓ సంచలనం అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదోమో!

(ఇటీవల మరణించిన కేంద్ర మాజీ మంత్రి రాంజెఠ్మలానీకి నివాళిగా..)

393
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles