శుష్కమవుతున్న ఒక నినాదం


Thu,September 19, 2019 12:46 AM

బడుగుల ‘రాజ్యాధికార’ నినాదం ఆ వర్గాలకు ఉత్తేజకరమైనదనటంలో సందేహం లేదు. కానీ అది క్రమంగా శుష్కమైనదిగా మారుతున్నది.అందుకు కారణం యథాతథంగా ఆ నినాదానికి విలువ తగ్గటం కాదు. ఆ వర్గాల నాయకత్వాలకు అవగాహన, దార్శనికత, కార్య ప్రణాళికారచన,కార్యాచరణ, చిత్తశుద్ధి, ఐక్యత అనే ఆరు అంశాల్లో గల లోపాల వల్ల ఆ నినాదం శుష్కమైనదిగా మారుతున్నది. తాము అధికారానికి వచ్చినసందర్భాల్లో సైతం ఇవే లోపాలు కన్పిస్తున్నాయి. వీటిని సరిదిద్దుకుంటూ పోతే తప్ప ఈ వర్గాలు తమ నినాదాన్ని ఎప్పటికీ సాకారం చేసుకోలేవు.


బడుగుల పార్టీల పేరిట అధికారానికి వచ్చిన నాయకుల్లో విధానాల రీత్యా, పరిపాలన రీత్యా, నైతిక విలువల రీత్యా ఇతర పార్టీల కన్న భిన్నంగా వ్యవహరిస్తున్నవారు ఎవరైనా ఉన్నారా? ఈ వర్గాల కోసం రాజ్యాధికారం అనడమంటే వారి కోసం ప్రత్యామ్నాయ విధానాలను, పరిపాలనను, నైతిక విలువలను అనుసరించటం కూడా అవుతుంది. అపుడది ప్రత్యామ్నాయ వ్యవస్థ అవుతుంది. మెరుగైన కొత్త నమూనా అవుతుంది. ఈ వర్గాలకు నిజమైన అర్థంలో మార్పు సిద్ధిస్తుంది.


బడుగులకు ‘రాజ్యాధికారం’ (స్టేట్‌ పవర్‌) అంటే ఏమి టి, ‘రాజకీయాధికారం’ (పొలిటికల్‌ పవర్‌) అంటే ఏమిటి అనే మీమాంస ఒకటి ఉన్నది గాని దానిని ప్రస్తుతానికి పక్కన ఉంచుదాం. ఈ వర్గాలు ఈ తేడా గురిం చి తెలిసోతెలియకనో జనరల్‌గా ఇస్తున్న నినాదం ‘రాజ్యాధికారం’ అయినందున, ఈ రెండు పదాలకు స్థూలంగా వర్తించే విధంగా ఈ వ్యాసంలో ‘రాజ్యాధికారం’ అనే పదాన్నే ఉపయోగిద్దాం. దానినట్లుంచితే, ప్రత్యేకంగా బడుగులకు అధికారం అనే మాట స్వాతంత్రోద్యమ కాలం నుంచి ఉన్నదే. బడుగుల సమస్యలన్నింటికి అంతిమ పరిష్కారం వారు అధికారాన్ని సాధించటమేనని అంబేద్కర్‌ అప్పుడే అన్నారు. ఆయన తర్వాత ఆ నినాదం కొంతకాలం వెనుకకుపోయింది. అటువంటి స్థాయి, లక్ష్యం గల నాయకులు లేకపోవటం, బడుగుల నాయకులు కాంగ్రెస్‌ తదితర మధ్యేమార్గ జాతీయపార్టీలలో, వివిధ ప్రాంతీయ పార్టీలలో అవకాశాలను వెతుక్కోవటం అందుకు కారణం. కొంతకాలం గడిచినాక తమిళనాడు, బీహార్‌, యూపీ వంటి రాష్ర్టాలలో స్వయంగా తామే బడుగులకు ప్రాతినిధ్యం వహిస్తూ కొన్ని పార్టీలు ముందుకువచ్చాయి. ఇక్కడ ‘బడుగులు’ అన్నమాట ప్రధానంగా బీసీలకు వర్తించగా ఎస్సీలు ఆ పరిధిలోకి రాలేదన్నది గుర్తించాలి. బీసీలు, ఎస్సీలూ ఎస్టీలకు మధ్య ఉండిన దూరా లు, బీసీలలో పెరిగిపోయిన స్వీయ ఆకాంక్షలు, వారు ఆ విధంగా సంఘటితం కావటం అందుకు కారణాలు. దానితో ఎస్సీలు, ఎస్టీలు గతంలో వలెనే మరికొంతకాలం పాటు కాంగ్రెస్‌ వంటి పార్టీల వెంట కొనసాగా రు. క్రమంగా ఎస్సీలు బీఎస్పీ వంటి సొంత పార్టీని సృష్టించుకున్నారు. ఎస్టీలకు బీసీ పార్టీలలో గాని, ఎస్సీ పార్టీలలో గాని తగిన సంఘీభావం, ఆదరణ లేనందున ఇప్పటికీ ఇతర పార్టీల వెంటనే ఉండిపోయారు. సొంతపార్టీలు పెట్టుకున్న ఒకటి రెండు రాష్ర్టాలలో తప్ప.

ఈ విధంగా, అంబేద్కర్‌ తొలి నినాదం ఆయన తర్వాత కాలంలో పైన పేర్కొన్న ఆరు విధాలైన లోపాల వల్ల, గజిబిజిగా మారి బలహీనపడింది. ఒకవైపు రాజ్యాధికార నినాదం ఇస్తూనే బీసీ, ఎస్సీ, ఎస్టీలది ఎవరిదారి వారిది అయింది. తర్వాత దశాబ్దాలలో కొన్ని రాష్ర్టాల్లో బీసీ పార్టీ లు, యూపీలో ఎస్సీ పార్టీ అధికారానికి వచ్చి ఉండవచ్చుగాక. కాని ‘బడుగులు’ అన్నపుడు ఆ నిర్వచనంలోకి ఈ మూడు విధాలైన సామాజికవర్గాలు వస్తాయి. ఈ నిర్వచనాన్ని కొంత విస్తరింపజేస్తే మైనార్టీలకు కూడా. కానీ, ఈ విస్తృత అవగాహన, దార్శనికత ఎవరికీ లేకపోయా యి. ఒకరిద్దరికి ఉండినా అది నామమాత్రంగా మిగిలింది తప్ప నిరంతరం కాలేదు. బలంగా ఆచరణలోకి రాలేదు. వారందరికి కలిపి ఉమ్మడి వేదిక ఏర్పడలేదు. అందుకు కారణం ఆయా సామాజికవర్గాల శ్రేణులు కూడా కావచ్చు. ఉదాహరణకు ఒక బీసీ పార్టీ ఏర్పడితే అది కేవలం బీసీల అధికారం కోసమే అనే నమ్మకం ఆ బీసీ నాయకులకు, సదరు కులాలకు చెందిన శ్రేణులకు ఏర్పడిపోయింది. అదే నమ్మకం బీఎస్పీ వంటి ఎస్సీల పార్టీలోనూ కన్పించింది.

ఆ విధంగా, భూ ఫలకాలకు చీలికలు (ఫాల్ట్‌ లైన్స్‌) ఉన్నట్లు, ‘బడుగు వర్గాలు’ అనే విస్తృత సామాజిక ఫలకానికి కూడా కులాలవారీ చీలికలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో గమనార్హమైన ఇతర చీలికలు కూడా కొన్ని కనిపించాయి. కనీసం బీసీలు అందరికీ కలిపి ఒక పార్టీ అన్నది అయినా లేకపోయింది. ఏ బీసీ కులం నాయకుడు అధ్యక్షుడు అయితే ఆ పార్టీ ఆ కులానికి సొంతం అన్నట్లుగా మారింది పరిస్థితి. ఆ కులం వారు ఇతర బీసీ కులాలను ఉపయోగించుకోవటం మొదలైంది. దానితో, తాము ఉపేక్షకు గురవుతున్నట్లు భావించిన ఇతర బీసీ కులాలు తిరిగి సొంత పార్టీలు పెట్టుకున్నాయి. లేదా ‘బడుగు’ అనే నినాదంతో గాని, ‘రాజ్యాధికార’ నినాదంతో గాని సంబంధం లేని మధ్యేమార్గ పార్టీలు, మితవాద పార్టీల వెంట చేరాయి. బడుగుల పార్టీలు అని చెప్పే పార్టీల నాయకులు ఏ కులానికి చెందిన వారైతే ఆ కులం వారి పట్ల ఆదరణ చూపారు. ఇతర బడుగులను ‘మనమంతా బడుగులం, బీసీలం’, ‘మనకు రాజ్యాధికా రం’, ‘మన ఆత్మగౌరవం’ వంటి ఆకర్షణీయమైన నినాదాలతో భ్రమింపజేసి ఓటు బ్యాంకులుగా ఉపయోగించుకున్నారు. బీసీలలో మరింత వెనుకబడిన ఎంబీసీ కులాలవారు ఈ భ్రమలు పోయిన రోజున సొంత పార్టీలు పెట్టుకున్నారు. అది భ్రమలపై లేదా కపటపు నినాదాలపై తిరుగుబాటు వంటిది. సరిగా ఇదే ఎస్సీల పార్టీ అయిన బీఎస్పీలోనూ జరిగింది. ముఖ్యంగా కాన్షీరాం అనంతరం. తాము ఇతర ఎస్సీల కన్న వెనుకబడ్డామని భావించే, అంతకన్న ముఖ్యంగా ఎస్సీ కులాలు తమను ఉపేక్షిస్తున్నాయని నిరసించే ఎస్సీ కులాల వారు సొంత పార్టీలు పెట్టుకున్నా రు. మధ్యేమార్గ పార్టీల వెంట, మితవాద పార్టీల వెంట, లేదా బీసీ పార్టీ ల వెంట చేరారు.

ఈ విధంగా, బడుగుల సామాజిక ఫలకంలో సహజరీతిలో, సాంప్రదాయిక కులవ్యవస్థలో ఉంటూ వచ్చిన ఫాల్ట్‌ లైన్స్‌ ఉమ్మడి చైతన్యంతో క్రమంగా సమసిపోవటానికి బదులు పెచ్చరిల్లాయి. అట్లా పెచ్చరిల్లచేయటంలో మధ్యేమార్గ పార్టీలు, మితవాద పార్టీలు తమ వ్యూహాలను తాము అమలుపరిచి ఉండవచ్చు. వారి ప్రయోజనాల కోసం వారట్లా చేయటం సహజం. కానీ, స్వయంగా ఈ సామాజికవర్గాలు, వాటి నాయకత్వాల అవగాహన, దార్శనికత, కార్యాచరణ ఏమిటన్నది ప్రధానమైన ప్రశ్న. ‘బడుగులకు రాజ్యాధికారం’ అన్న నినాదం ఎక్కడ మిగిలిపోయింది? బడుగులవి కాని పార్టీలతో చేతులు కలిపి అయినా సరే తమ సాటి బడుగు పార్టీలను ఓడించి సీట్లు, అధికారం సంపాదించుకోవాలనే స్థాయికి పతనమైనపుడు, ఈ నినాదం ఒక అపహాస్యంగా మారలేదా? ఈ నినాదానికి ఒక పెద్ద గ్రహణం బీసీలు, ఎస్సీల మధ్య గల తీవ్రమైన వైరభావం. సామాజికంగా గతం నుంచి గల ఈ వైరుధ్యం ఆధునిక పార్లమెంటరీ రాజకీయాల్లోకి ప్రవేశించి, బడుగులకు రాజ్యాధికారమన్న మౌలిక లక్ష్యాన్నే తీవ్రమైన భంగపాటుకు గురిచేస్తూ వస్తున్నది. ఇతరవర్గాలు విభజించి పాలించటమనే నీతిని విజయవంతంగా అమలుపరుస్తుండగా, స్వయంగా ఈ వర్గాలు కూడా మమ్మల్ని మేము విభజించుకుంటాం, మీరు మమ్ములను పాలించండనే నీతిని అనుసరించారు.
ashok
ఈ విధంగా ఈ వర్గాల నాయకత్వాలకు అవగాహన, దార్శనికత, కార్యప్రణాళికారచన, కార్యాచరణ, చిత్తశుద్ధి, ఐక్యత అనే ఆరు అంశాలలోనూ లోపాలు, వైఫల్యాలున్నాయి. అటువంటపుడు ఎంత ఉత్తేజకర నినాదమైనా శుష్కమైనదిగా మారకతప్పదు. అదే జరుగుతున్నది. ఇక్క డ గమనించవలసింది మరొకటి ఉన్నది. ఈ నాయకత్వాలు ఇస్తున్న రాజ్యాధికార నినాదానికి సాధారణ బడుగు ప్రజల్లో వ్యాప్తి మాత్రం పెరుగుతున్నది. ఆ వర్గాలకు ఆ నినాదం పట్ల ఆకర్షణ, స్ఫూర్తి పెరుగుతున్నా యి. అదే సమయంలో, తమ నాయకుల వైఫల్యాలను, లోపాలను తగినంతకాలం గమనించిన మీదట వారి పట్ల అసహనం ఏర్పడుతున్నది. నిరాశ, నిస్పృహలు చోటుచేసుకుంటున్నాయి. నాయకుల వెంట ఆశ్రితులుగా ఉండి చిట్టిపొట్టి ప్రయోజనాలు పొందే కొద్ది మందిని మినహాయిస్తే, బడుగు బలహీన వర్గాల జన సామాన్యానికి మాత్రం పరిస్థితి వేరుగా ఉన్నది.

ఆ పరిధిలో అదొక అంతర్గతమైన ఫాల్ట్‌ లైన్‌గా మారిం ది. కనుకనే ఆ జన సామాన్యం తరుచుగా ‘బడుగు పార్టీలను’ వాటి నాయకత్వాలను తిరస్కరించి ఇతర పార్టీలకు ఓటు వేస్తున్నారు.మరొక కీలకమైన విషయాన్ని గమనించండి. బడుగుల పార్టీల పేరిట అధికారానికి వచ్చిన నాయకుల్లో విధానాల రీత్యా, పరిపాలన రీత్యా, నైతిక విలువల రీత్యా ఇతర పార్టీల కన్న భిన్నంగా వ్యవహరిస్తున్నవారు ఎవరైనా ఉన్నారా? ఈ వర్గాల కోసం రాజ్యాధికారం అనడమంటే వారి కోసం ప్రత్యామ్నాయ విధానాలను, పరిపాలనను, నైతిక విలువలను అనుసరించటం కూడా అవుతుంది. అపుడది ప్రత్యామ్నాయ వ్యవస్థ అవుతుంది. మెరుగైన కొత్త నమూనా అవుతుంది. ఈ వర్గాలకు నిజమై న అర్థంలో మార్పు సిద్ధిస్తుంది. అంతే తప్ప ‘తెల్లవాడుపోయి నల్లవాడు రావటం’ అన్న సామెత ప్రకారం ఇతరవర్గాల రాజ్యానికి బదులు బీసీ దొరల రాజ్యం, ఎస్సీ దొరల రాజ్యం రావటమే నిజమైన అర్థంలో బడుగులకు రాజ్యాధికారం కాబోదు. అది బడుగు కులాల దొరల రాజకీయాధికారం అవుతుంది. అదే వాస్తవంగా జరుగుతున్నది. వీరి విధానాలు, పాలనలు, నైతికతలు అన్నీ మధ్యేమార్గ పార్టీలకు, మితవాద పార్టీలకు కార్బన్‌ కాపీ వలె మాత్రమే ఉన్నాయి.

దేశం మొత్తాన్ని ఒకసారి తేరిపారజూసినా, ఇటీవలి దశాబ్దాల పరిణామాలను సమీక్షించినా, బడుగులకు రాజ్యాధికార నినాదాన్ని సాకారం చేయగల నాయకత్వాలు ఏవీ కన్పించవు. ఈ నినాదం శుష్కమైనదిగా మారుతున్నదని భావించటానికి వెనుక పైన చర్చించిన పరిస్థితులన్నీ ఉన్నాయి. ఇంతకుముందు ప్రస్తావించినట్లు, ఈ వర్గాల నాయకులకు, జనసామాన్యానికి మధ్య ఒక పెద్ద విశ్వాసపులోటు ఉంది. నాయకులకు లేని చైతన్యం, చిత్తశుద్ధి జనసామాన్యానికి ఉంది. వారి నుంచి కొత్త నాయకత్వాలు క్షేత్రస్థాయిలో ఆవిర్భవిస్తే తప్ప భవిష్యత్తు గురించి ఆశించగలది పెద్దగా ఉండదు.

437
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles