లక్ష్యాలను నెరవేర్చని కేంద్రీకరణ


Fri,September 20, 2019 12:45 AM

డాక్టర్ కస్తూరి రంగన్ నేతృత్వంలో జాతీయ విద్యావిధా నం- 2019 ముసాయిదా రూపొందించబడింది. ఆ సిఫార్సులను నిశితంగా చూస్తే విద్యా సంక్షోభానికి సంబంధించిన సమస్యలను సరిగా గుర్తించలేదని తెలుస్తున్నది. ఈ ముసాయిదా ప్రకటిస్తున్న విజన్ సాకారమవడానికి ఈ ప్రతిపాదనలు పరివర్తన పాత్రను పోషించలేవు. ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందరికీ అందించడం ద్వారా, ఈక్విటేబుల్‌గా ఉండే, శక్తివంతమైన జ్ఞాన సమాజంగా దేశాన్ని సుస్థిరంగా మార్చడానికి తోడ్పడే ఇండియా సెంటర్డ్ విద్యను ముసాయిదా విజన్ స్వప్నిస్తున్నది. ముసాయిదా చేసిన చర్చను అనుసరించి ఇండియా సెంట ర్డ్ విద్య అంటే, మనకందించబడిన వారసత్వ జ్ఞానంతో, మన సాంస్కృ తిక విలువలతో, ఇక్కడి స్థానిక సమస్యలకు అనుగుణంగా, నవకల్పనల తో కూడిన విద్యను 21వ శతాబ్ద అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడంగా అర్థం చేసుకోవచ్చు. అయితే మన సాంస్కృతిక వారసత్వం, దాని ద్వారా పొందిన విలువలు, సమాజంలోని అన్నిరకాల అసమానతలను అంగీకరించే కండిషనింగ్‌ను ఏర్పరిచాయి. ముసాయిదా ఈ ముఖ్యమైన విషయాన్ని చర్చించకుండానే, మన సాంస్కృతిక వారసత్వం ఇచ్చిన జ్ఞానమంతా సరైనదనే అభిప్రాయాన్ని కలుగజేసింది. ఈ విలువల కండి షనింగ్‌ను ఎలా అధిగమించాలనే చర్చ లేకుండానే అసమానతలను రూపుమాపాలనే ఆదర్శాన్ని ప్రకటించింది. ఉన్నత విద్యకు సంబంధించి ముసాయిదాను పరిశీలించినపుడు, 2035 కల్లా 50 శాతం జీఈఆర్ (గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియో) సాధిస్తే సామాజికంగా వెనుకబడినవర్గాలకు ఉన్నత విద్య చేరువవుతుందని చెబుతున్నది. కాని ప్రస్తుతం ఉన్నత విద్యలో, ఈ వర్గాల భాగస్వామ్యాన్ని తెలిపే వివరాలు ముసాయిదాలో లేవు.


ఉన్నత విద్యాసంస్థలు భావాల, భావ సంఘర్షణల నిలయాలు. వాటిలో ఏకరూపకతతో గాక వైవిధ్యంతో జరిగే సత్యాన్వేషణే శ్రేష్టతను కలిగిస్తుందని కొఠారి కమిషన్ చెప్పింది. కాని ఈ ముసాయిదా విద్యా నిర్ణయాల కేంద్రీకరణను, విద్యాసంస్థల కేంద్రీకరణను, విద్యా పాలన కేంద్రీకరణను, పాఠ్యప్రణాళిక కేంద్రీకరణను, పరీక్షల కేంద్రీకరణను.. ఇలా అన్నిరకాల కేంద్రీకరణలను ప్రతిపాదించింది. ఉన్నత విద్యా సంస్థల మౌలిక లక్ష్యాన్ని, వాటికి మూలాధారమైన ప్రజాస్వామ్య సంస్కృతిని ఎదగనీయని ఆచరణను ప్రతిపాదిస్తున్నది.


ఈ వర్గాల శాతం ఎంత పెరుగుతుంది అన్నదానిపై అంచనాలు లేవు. స్పెషల్ ఎడ్యుకేషన్ జోన్స్ ఏర్పాటు, స్కాలర్షిప్‌ల గురించి చర్చించిన ముసాయిదా రిజర్వేషన్ల గురించి మాట్లాడలేదు. స్పెషల్ ఎడ్యుకేషన్ జోన్స్, స్కాలర్షిప్‌ల, బ్యాంక్ లోన్ల ద్వారానే ఈక్విటీ సాధించబడుతుందన్నట్లుగా చెప్పుకొచ్చింది. ఇప్పుడున్న 25 శాతం నుంచి 50 శాతాన్ని సాధించాలంటే ప్రస్తుత మౌలిక వనరులను రెట్టింపు చేయాలి. వీటి గురించి ముసాయిదాలో స్పష్టత లేదు. ప్రైవేట్‌రంగంలోనే ఈ పెరుగుదలను ఆశిస్తున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే పాఠశాల విద్యలో 50శాతం, ఉన్నత విద్యలో 80 శాతానికి పైగా, ఉపాధ్యాయ విద్యలో అయితే 95 శాతానికిపైగా ప్రైవేటు సంస్థలున్నాయి. వీటిలో అత్యధిక శాతం జ్ఞాన సృష్టికి అడ్డంకులను ఎక్కువ చేసేవే. ఇంత ప్రధాన మైన ఈ సమస్యను పరిష్కరించే ప్రతిపాదనలను దాటవేస్తూ, విద్యా ప్రైవేటీకరణను అంగీకరిస్తున్నది. ప్రైవేటు విద్యాసంస్థలకు సహకరించే మార్పులను కూడా సూచిస్తున్నది. ఇదంతా వ్యాపార దృష్టి లేని ప్రైవేట్ యాజమాన్యాలను ప్రోత్సహించడానికని చెబుతున్నది. పైపైన మాత్రం విద్య వ్యాపారీకరణను విమర్శిస్తున్నది. విద్య పబ్లిక్ గూడ్‌గా ఉండాలని హితవు పలుకుతున్నది. నాణ్యమైన విద్యను పెంపొందించుకోవాలంటే విద్యాసంస్థలకు, టీచర్లకు పూర్తి స్వయంప్రతిపత్తి ఉండాలి. దీన్ని అంగీకరిస్తూనే, పూర్తిస్థాయి అధికార కేంద్రీకరణకు మార్గాలను ఈ ముసాయిదా ఏర్పరుస్తున్నది. యూజీ సీ స్థాయిని తగ్గిస్తూ హయ్యర్ ఎడ్యుకేషన్ గ్రాంట్స్ కౌన్సిల్‌గా మార్చాల ని అంటున్నది. ఉన్నతవిద్యకు సంబంధించిన విద్యా ప్రణాళికను రూపొందించే బాధ్యతలను జీఈసీ(జనరల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్)కు కట్టబెడుతున్నది. నియంత్రణకు ఒక సూపర్ రెగ్యులేటరీ సంస,్థ నేషనల్ హైయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అథారిటీ స్థాపనను సూచిస్తున్నది. వీటన్నింటిపైన నియంత్రణను కలిగే రాష్ట్రీయ శిక్షా ఆయోగ్ ప్రధాని ఛైర్మన్‌గా ఏర్పాటు కాబోతున్నది.

దేశ విద్యా చరిత్రలోనే విద్యారంగానికి సంబంధించిన శిఖరాగ్ర సంస్థలకు ప్రధాని చైర్మన్‌గా ఉన్న దాఖలాలు లేవు. అధికార కేంద్రీకరణ విధాన నిర్ణయాల నాణ్యతను తగ్గిస్తుంది. తద్వారా విద్యావ్యవస్థ నాణ్యత కుంటు పడుతుందనే విషయాన్ని ముసాయిదా విస్మరించింది. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి, ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకం. అనేక వైవిధ్యాలతో సంస్కృతులతో ఉన్న దేశంలో ఒకే పరీక్ష అసమానతలను పెంచుతుందే కాని తగ్గించదు. ఈ విషయాన్ని మరిచి నేషనల్ టెస్టిం గ్ ఏజెన్సీనిప్రతిపాదిస్తున్నది. కేంద్రీకతమైన పరీక్షలు కొన్ని నిర్దిష్ట ప్రాం తాల వారికి, కొద్ది శిష్టవర్గాలకు అనుకూలంగా ఉండే అవకాశాలుంటా యి. దేశవ్యాప్త పరీక్షల వలన కోచింగ్ సెంటర్లు బాగా పెరుగుతాయి. దీని వల్ల పోటీ విపరీతంగా పెరిగి ఇప్పటికే తీవ్రఒత్తిడికి లోనవుతున్న పిల్లలపై ఇంకా ఒత్తిడి తీవ్రత పెరుగుతుంది. టీచర్లకు స్వయంప్రతిపత్తిని కల్పిం చి అస్థిరత, అభద్రత ఉండే కాంట్రాక్ట్ టీచర్ వ్యవస్థను రద్దు పరుచాలని చెబుతూనే కొత్తగా చేరే టీచింగ్ ఫాకల్టీకి ఐదేండ్ల ప్రొబేషన్‌ను నిర్ధారిస్తున్నది. వీరి పనితీరును ఏటా అధికారులు, తోటి టీచర్లు, విద్యార్థులు, పేరెంట్స్ సర్టిఫై చేయాలని చెబుతున్నది. ఈ పరిస్థితుల్లో ప్రతిభ, ఆసక్తి ఉన్న వారు ఈ వృత్తిలోకి రావడానికి ఇష్టపడరు. లిబరల్ విద్యను ప్రోత్సహించాలనే ప్రతిపాదనలు, పరిశోధనల పెంపున కు ఉద్దేశించబడిన నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ పెడగాజి, అసెస్మెంట్ విధానాల మెరుగు ప్రతిపాదనలు, అక్రెడిటేషన్ సంస్థల ప్రైవేటీకరణ లాంటి అంశాలు ప్రైవేటీకరణ కొనసాగినంత కాలం సరైన ఫలితాలనివ్వలేవు. ఇది దేశంలో జరిగిన విద్యా ప్రైవేటీకరణ అనుభవాల ద్వారా తెలుసుకోవచ్చు.
edama-srinivas-reddy
విద్యావ్యవస్థకు కావలసిన భౌతిక, బౌద్ధిక వనరులను సమకూర్చడాన్ని ప్రాధాన్యంగా భావించే ఇన్‌పుట్ అప్రోచ్ నుంచి పిల్లల సాధనను కొలవడమే ప్రాధాన్యంగా భావించే అవుట్ కం అప్రోచ్‌కు విధాన నిర్ణయాల మార్పును ముసాయిదా సూచిస్తున్నది. సమూహంలో స్థానాన్ని కొలిచే నార్మ్ రెఫరెన్సు ఎవాల్యుయేషన్ సాపేక్షంగా తక్కువ ఒత్తిడిని కలిగించే విధానం. నిర్ధారిత ప్రమాణాలను వ్యక్తిలో కొలిచే విధానం, క్రైటేరియా రెఫెరెన్స్ ఎవాల్యుయేషన్. ఇది సాపేక్షంగా ఎక్కువ ఒత్తిడిని కలిగించే విధా నం. ఉన్నత విద్యాసంస్థలు భావాల, భావ సంఘర్షణల నిలయాలు. వాటిలో ఏకరూపకతతో గాక వైవిధ్యంతో జరిగే సత్యాన్వేషణే శ్రేష్టతను కలిగిస్తుందని కొఠారి కమిషన్ చెప్పింది. కాని ఈ ముసాయిదా విద్యా నిర్ణయాల కేంద్రీకరణను, విద్యాసంస్థల కేంద్రీకరణను, విద్యా పాలన కేంద్రీకరణను, పాఠ్యప్రణాళిక కేంద్రీకరణను, పరీక్షల కేంద్రీకరణను.. ఇలా అన్నిరకాల కేంద్రీకరణలను ప్రతిపాదించింది. ఉన్నత విద్యా సంస్థల మౌలిక లక్ష్యాన్ని, వాటికి మూలాధారమైన ప్రజాస్వామ్య సంస్కృతిని ఎదగనీయని ఆచరణను ప్రతిపాదిస్తున్నది.

(వ్యాసకర్త: సొసైటీ ఫర్ ఛేంజ్ ఇన్ ఎడ్యుకేషన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)

327
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles