తెలుగునాట గాంధీజీ


Thu,October 3, 2019 02:35 AM

1942లో క్విట్‌ ఇండియా ఉద్యమంలో ప్రజలను భాగస్వామ్యం చేయడం కోసం గాంధీజీ దేశవ్యాప్తంగా పర్యటించారు. ఆ పర్యటనలో భాగంగా మహాత్ముడు తెలుగు రాష్ర్టాల్లోని అనేక ప్రాంతాల్లో ఆగారు. రైల్వేస్టేషన్‌లోనే కొద్దిసేపు ఆగి అక్కడి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించేవారు. ఇందులో భాగంగా కాజీపేట, వరంగల్‌ స్టేషన్లలో కాసేపు ఆగినప్పుడు వేలమందిఆ మహాత్ముడిని చూసేందుకు గంటలకొద్దీ వేచిచూశారంటే ఆయన ప్రభావం ఆనాటి నిజాం రాజ్యంలో కూడా ఎంత మేరకు ఉన్నదో అర్థం చేసుకోవచ్చు.


ప్రపంచానికి సత్యాహింసలను ప్రబోధించిన తత్త్వవేత్త జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంత్యుత్సవ సంవత్సరంలో మనం భాగస్వాములం కావటం అదృష్టమే. విశ్వమంతటా మానవసంబంధాలను, అంతర్జాతీయ సహకారాన్ని వ్యాపింపచేసేందుకు సార్వకాలీనమైన సూత్రాలను ప్రవచించిన యోధుడు. తెలుగువారితో మహాత్మాగాంధీకి ఉన్న అనుబంధం అనిర్వచనీయమైనది. మహాత్ముని ప్రభావంతో ఎందరో తెలుగు ప్రముఖులు సర్వస్వం అర్పించి స్వాతంత్రోద్యమంలో పాలుపంచుకున్నారు. తమ జీవితాలను అంకితం చేసిన నిస్వార్థ సేవాపరాయణులెందరో ఉన్నారు. 1910-1946 మధ్య కాలంలో గాంధీజీ తెలుగురాష్ర్టాల్లో పలుమార్లు పర్యటించారు. నిజాం రాజరికం కొనసాగుతున్న సమయంలో కూడా గాంధీజీ హైదరాబాద్‌కు వచ్చి హరిజనోద్ధరణ ఉద్యమంలో పాల్గొన్నారు. దళితులపై జరుగుతున్న వివక్షపై జరుగుతున్న పోరాటానికి బాసటగా నిలిచేందుకు 1927 ఏప్రిల్‌ 7న హైదరాబాద్‌లో జరిగిన భారీ బహిరంగసభకు గాంధీ వచ్చారు. నగ రం నడిబొడ్డున గల వివేకవర్ధిని హైస్కూల్లో జరిగిన సభకు హాజరయ్యా రు. గాంధీజీ కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన చిన్నవేదికపై కూర్చొని ఆయన సందేశం ఇచ్చారు. ఆ వేదిక ఇప్పటికీ వివేకవర్ధిని హైస్కూల్లో భద్రంగా ఉన్నది. విద్యాలయానికి వచ్చినపుడు సందర్శకుల పుస్తకంలో సందేశం రాశారు. గాంధీజీ హిందీలో రాసిన ఆ సందేశాన్ని పెద్దగా ఫోటో ప్రేమ్‌ చేయించి గ్యాలరీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.

గాంధీజీకి ఆనాటి హైదరాబాద్‌ ప్రభుత్వ కార్యనిర్వాహక శాఖాధ్యక్షుడు సర్‌ అక్బర్‌ హైదరీతో సన్నిహిత అనుబంధం ఉండేది. తామిద్దరి మధ్య ఉన్న అనుబంధం గురించి హైదరీ మరణానంతరం గాంధీజీ తన ‘హరిజన్‌' పత్రికలో ఇలా అన్నారు. ‘సర్‌ అక్బర్‌ హైదరీలో చాలా సుగుణాలున్నాయి. అట్లా ఉండటం చాలా దుర్లభం. ఆయన గొప్ప పండితుడు, తత్వశాస్త్రవేత్త, సంస్కరణవాది, భక్తిపరుడైన మహనీయుడు. రెండో రౌండ్‌ టేబుల్‌ మహాసభ నుంచి తిరిగి వచ్చేటప్పుడు మేమిద్దరం కలిసి ఒకే నౌక లో ప్రయాణం చేశాం. నేను రోజూచేసే ప్రార్థనకు ఆయన హాజరవుతుండేవారు. గీతా శ్లోకాలలోను, మేము చేసే భజన కీర్తనల్లోను ఆయనకు ఆసక్తి కలిగింది. వాటినన్నిటినీ మహాదేవ్‌ దేశాయి చేత ఆయన అనువా దం చేయించుకున్నాడు. దేశంలో మతసామరస్యం కోసం మేమిద్దరం కల సి విస్తృతంగా పర్యటన చేయాలనుకున్నాం. ఆయన నా చేత ఆ మేరకు వాగ్దానం చేయించుకున్నారు కూడా. కానీ దేవుడు అన్యధా తలచాడు’ అని గాంధీజీ రాశారు.

హైదరాబాద్‌కు గాంధీ వచ్చినప్పుడు ఆయనకు కులీనుడైన ధన్రాజ్‌ గిర్‌ రోల్స్‌ రాయిస్‌ కారును ఏర్పాటు చేశారట. ఈ ధన్‌ రాజ్‌ గిర్‌ జీ ప్రఖ్యాత కవి గుంటూరు శేషేంద్రశర్మ సతీమణి ఇందిరాదేవి తండ్రి.1919లో రౌలత్‌ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమం ఉవ్వెత్తున సాగిన సందర్భంగా గాంధీజీ విజయవాడకు వచ్చి అక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. 1921లో బెజవాడలో అఖిలభారత కాంగ్రెస్‌ జాతీయ మహాసభలు జరిగాయి. ఆ సభల్లో మహాత్మాగాంధీ త్రివర్ణ పతాక రూపకర్త పింగళి వెంకయ్యను కాషాయం, ఆకుపచ్చ రంగులు, రాట్నంతో కూడిన పతాకాన్ని తయారుచేసి తీసుకురమ్మని చెప్పారట. ఆయన కేవలం మూడు గంటల్లో పతాకాన్ని రూపొందించి గాంధీజీకి అందించారట. దీనిగురించి 1921 ఏప్రిల్‌ 13న యంగ్‌ ఇండియా పత్రికలో గాంధీ ప్రత్యేకంగా ప్రస్తావించా రు.1929లో ఆంధ్రదేశ పర్యటన చేసినప్పుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య అంతా తానే అయి నిలిచారట. ఆ తర్వాత ఉప్పుసత్యాగ్రహంలో భాగంగా గుజరాత్‌లోని సబర్మతి ఆశ్రమం నుంచి అనుచరులతో వచ్చిన గాంధీజీ 1930 ఏప్రిల్‌ 15న మచిలీపట్నం కోనేరుసెంటర్‌లో బహిరంగసభ నిర్వహించారు. ఈ సభలో చిన్నచిన్న ఉప్పు పొట్లాలు అమ్మగా, జనం ఎగబడి కొనుగోలుచేశారు. దీంతో బందరులో ఉప్పు సత్యాగ్రహ ఉద్య మం ప్రారంభించాలని నిర్ణయించారు. డాక్టర్‌ పట్టాభి సీతారామయ్య, ముట్నూరి కృష్ణారావు, అయ్యదేవర కాళేశ్వరరావు తదితరులు సముద్రపు ఒడ్డు నుంచి ఉప్పు తెచ్చి కోనేరుసెంటర్‌లో ప్రదర్శించారు. అనంతరం ఇక్కడ ఉప్పుసత్యాగ్రహ శిబిరాన్ని కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ప్రారంభించారు. గాంధీజీ స్ఫూర్తితోనే బందరులో ఖద్దరు ఉద్యమానికి గొట్టిపాటి బ్రహ్మయ్య, దుగ్గిరాల రాఘవచంద్రయ్య వంటి మహానుభావులు ఎంతగానో కృషి చేశారు.
Santosh-Kumar
1942లో క్విట్‌ ఇండియా ఉద్యమంలో ప్రజలను భాగస్వామ్యం చేయడం కోసం గాంధీజీ దేశవ్యాప్తంగా పర్యటించారు. ఆ పర్యటనలో భాగంగా మహాత్ముడు తెలుగు రాష్ర్టాల్లోని అనేక ప్రాంతాల్లో ఆగారు. రైల్వేస్టేషన్‌లోనే కొద్దిసేపు ఆగి అక్కడి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించేవారు. ఇందులో భాగంగా కాజీపేట, వరంగల్‌ స్టేషన్లలో కాసేపు ఆగినప్పుడు వేలమంది ఆ మహాత్ముడిని చూసేందుకు గంటలకొద్దీ వేచిచూశారంటే ఆయన ప్రభావం ఆనాటి నిజాం రాజ్యంలో కూడా ఎంత మేరకు ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. ప్రజాకవి కాళోజీనారాయణరావు, కాళోజీ రామేశ్వరరావు, భూపతి కృష్ణమూర్తి, ఎంఎస్‌ రాజలింగం, హయగ్రీవాచారి, ఎంఎస్‌ ఆచార్య.. ఇలా ఎందరో జాతీయోద్యమ నాయకులు గాంధీ బాటలో నడిచారు. ఆరోజు వరంగల్‌ వీధుల్లో గాంధీజీ తిరిగినప్పుడు ఆయన వెంట వాహనంలో కాళోజీ ప్రభృతులు ఉన్న చిత్రం ఇప్పటికీ మనం చూడవచ్చు. 1946, ఫిబ్రవరి 3, 4 తేదీలలో మద్రాస్‌లో నిర్వహించిన దక్షిణ భారత హింది భాషా ప్రచార కార్యక్రమం నుంచి తిరిగి వస్తున్న గాంధీజీ, ఖమ్మం టౌన్‌ కాంగ్రెస్‌ శాఖ కోరిక మేరకు మార్గమధ్యంలో ఫిబ్రవరి 5వ తేదీన రైలు ఆగినప్పుడు అక్కడ రైలు దిగి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇలా అనేక సందర్భాల్లో తెలుగునేలపై ఆయన ప్రసంగాల ప్రభావం ఎనలేనిది. గాంధీజీ మాటతో యావత్‌ తెలుగుజాతి ఆయన మాటలో నడిచింది. జాతీయోద్యమంలో సంపూర్ణంగా భాగస్వామి అయింది.

293
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles