పూల అలుగు


Sat,October 5, 2019 12:56 AM

తంగేడుకొమ్మల్ల పసిడినవ్వులు పూసే
గునుగు తోటలల్ల వెండివెన్నెల కాసే
నాగేటి సాల్లల్ల జొన్న కంకులు పోసే
పెత్తరామాసకై ఎదురుచూపులు చూసే
పొడిసేటి పొద్దోలె మందారపూసింది
నందివర్దనం నవ్వుతూ పిలిచింది
కట్లాచ్చ తీగేమో బంధమే అల్లింది
తెల్లని తామర తలుక్కునా మెరిసింది
ప్రేమతో తెచ్చిరి పుట్లకొద్ది పూలు
ఎగిలివారంగనే మా అన్నతమ్ముళ్లు
సినుకుసినుకు కురువ ఎన్నీయలో
చెరువు అలుగుపారే మల్లీయలో
వాగుల్ల వంకల్ల ఎన్నియలో
వయ్యారి పరుగులు మల్లీయలో
పచ్చపచ్చని పల్లె ఎన్నీయలో
ప్రేమతో పిలిచింది మల్లీయలో
మా అక్కచెల్లెలు ఎన్నీయలో
మా ఇండ్లకొచ్చిరి మల్లీయలో
తాంబలమంచున తంగేడు నవ్వింది
గునుగు చేలల్ల రమ్మని పిలిచింది
కలువపూలకు ముచ్చట్లు చెప్పింది
గోరంటపూలను మద్దాడి మురిసింది
తీరొక్కపువ్వులు నీకు కోటొక్క చీరెలు
గుమ్మాడి గౌరమ్మ మము దీవించె తల్లులు
గడపల్లు దాటేటి బతుకమ్మ తల్లులు
అందాల పూలకు అభిషేక పూజలు
ఊరువాడలల్ల డప్పుల్ల మోతలు
అక్కాచెల్లెండ్ల ఉయ్యాల పాటలు
అన్నాతమ్ముళ్ల కోలాటం ఆటలు
ఘనమైన జాతర తొమ్మిది రోజులు
సందేల పొద్దుకు బతుకమ్మ వీడ్కోలు
మల్లొచ్చె ఏటికి రమ్మంటు మొక్కులు
గంగమ్మ ఒడిలోకి బతుకమ్మ అడుగులు
దీపాల మిలమిలలు మెరిసేటి తారలు
తీరొక్క రుచుల ఆ సద్దుల ముద్దలు
పంచుతూ మురిసిరి మా కన్నతల్లులు
- పల్లెర్ల నిరంజన్‌రెడ్డి, 94407 48140

88
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles