తెగేదాకా లాగొద్దు


Thu,October 10, 2019 12:43 AM

ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు ప్రజా మద్దతు లేదు. పండుగల సమయాల్లో తమను తీవ్రంగా ఇబ్బందుల పాలుచేసిన కార్మిక సంఘాల పట్ల ప్రయాణికులు ఆగ్రహంగా ఉన్నారు. వంద రూపాయలతో చెయ్యాల్సిన ప్రయాణం సమ్మె మూలంగా మూడు వందలు పెట్టి చేయాల్సివచ్చిందని రగిలిపోతున్నారు. ప్రజా మద్దతులేని ఏ సమ్మె కూడా విజయం సాధించదు. తమ సమస్యలను సరైన సమయంలో యాజమాన్యంతో, ప్రభుత్వంతో కూర్చొని చర్చించుకోవాలి తప్ప ప్రజలనుఇబ్బందులకు గురిచేస్తే ఆర్టీసీ పట్ల ప్రజలకు విశ్వాసం సడలుతుంది.


అన్నం పెట్టే చేతిని నరికేసుకోవడంలో ఆర్టీసీ సిద్ధహస్తురాలు. ఆర్టీసీ అనేది ప్రజా రవాణా సంస్థ. లాభాపేక్ష లేకుండా ప్రజలను గమ్యానికి చేర్చడం ఆర్టీసీ ప్రథమ కర్తవ్యం. ఏ ముహూర్తంలో ఆర్టీసీని ప్రారంభించారో కానీ, ఆ సంస్థ ఎప్పుడూ నష్టాల్లోనే మునిగితేలుతున్నది. ప్రైవేట్‌ రవాణాతో పోలిస్తే ఆర్టీసీ ఛార్జీలు తక్కువ. భద్రత ఎక్కువ. బస్సులకు సారథులైన కండక్టర్లు, డ్రైవర్లు సంస్థకు ఆదాయం తెచ్చిపెట్టే ప్రధాన వనరులు. వీరి నిజాయితీ, చిత్తశుద్ధి మీద ఆర్టీసీకి లాభాలు వస్తుంటాయి. బస్సులను సమయానికి నడుప డం, ప్రయాణికులు ఎక్కడ ఆపమంటే అక్కడ బస్సును ఆపడం, క్షేమం గా గమ్యానికి చేర్చడం ఈ ఉద్యోగుల విధి. ప్రైవేట్‌ రవాణా సంస్థల వారు ఎక్కడ ఎవరు చేతులు ఎత్తినా బస్సులను ఆపుతారు. కానీ, ఆర్టీసీలో ఆ లక్షణం కనిపించదు. నిర్ణీత ప్రదేశాల్లో మాత్రమే ఆపుతారు. ప్రయాణీకు ల పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తారు. వారిలో వినయవిధేయతలు, తమను పోషించేప్రయాణికుల పట్ల గౌరవం కనిపించదు. అందరూ అలాగే ఉం డరనుకోండి అది వేరే విషయం.
ఆర్టీసీకి పండుగల సమయంలో ఆదాయం అధికంగా వస్తుంది. ముఖ్యంగా సంక్రాతి, దసరా పండుగలకు సెలవులు ఎక్కువగా ఉంటా యి. కాబట్టి ఆ సమయంలో సొంత గ్రామాలకు కుటుంబాలతో సహా వెళ్తారు. అదే అదనుగా ఆర్టీసీ ఛార్జీలను పెంచుతుంది. అయినా సరే, ప్రైవే టు రవాణాతో పోలిస్తే ఆర్టీసీ ఛార్జీలు తక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కువమంది ప్రభుత్వ రవాణానే ఆశ్రయిస్తారు.

సరిగ్గా అలాంటి పండుగ సమయంలో ఆర్టీసీ కార్మికులు ప్రయాణికుల ఆశల మీద చావుదెబ్బ కొట్టారు. హైదరాబాద్‌ నుంచి, ఇతర పట్టణాల నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులను వంచిస్తూ హటాత్తుగా సమ్మెకు దిగారు. రోజుకు ఐదు కోట్ల రూపాయల ఆదాయం ఈ పండుగల సమయాల్లో సంస్థకు వస్తుం ది. అదేమంటే మేము నెల రోజుల కిందటే ప్రభుత్వానికి నోటీసు ఇచ్చామని యూనియన్ల వారు వాదిస్తారు. నిజమే కావచ్చు. వారికి డిమాండ్లు ఉండవచ్చు. జీతాలు పెంచమని అడుగడానికి వారికి అన్ని హక్కులూ ఉన్నాయి. కార్మికచట్టాలు వారికీ వర్తిస్తాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీ నం చేయాలనేది వారి ప్రధాన డిమాండ్‌. సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడం, చేయకపోవడమనేది యాజమాన్యానికి సంబంధించిన విష యం. సంస్థ యాజమాన్యం, ప్రభుత్వం కలిసి చర్చించుకోవాల్సిన నిర్ణ యం అది. కార్మికులు ఎలా డిమాండ్‌ చేస్తారో నాకు అర్థం కావడం లేదు. ఒకవేళ రేపు తమను పోలీస్‌ శాఖలోనో, రెవెన్యూ శాఖలోనో కలిపేయాలంటే కలిపేయాల్సిందేనా?

ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? గతేడాది వెయ్యి కోట్ల నష్టాలను చూసిందట. నగరాల్లో ఎప్పుడుచూసినా బస్సులు కిటకిటలాడుతుంటా యి. దూరప్రాంతాలకు వెళ్లాలన్నా ఐదారు రోజుల ముందు రిజర్వ్‌ చేయించుకోవాలి. ఒక ప్రైవేట్‌ బస్సు కొన్న వ్యక్తి ఏడాది తిరిగేసరికి మరో రెండు బస్సులు కొంటున్నాడు. అనేక ప్రైవేట్‌ ట్రావెల్స్‌ వారు వందలాది బస్సులను నడుపగలుగుతున్నారు. ఆర్టీసీ బస్సులతో పోలిస్తే ప్రైవేట్‌ బస్సు లు ఇంద్రభవనాల్లా ఉంటాయి. వేగం కూడా ఎక్కువ. ఛార్జీలు కూడా ఎక్కువే. అయినప్పటికీ, ప్రయాణీకులు ప్రైవేట్‌ బస్సులను ఎందుకు ఆశ్రయిస్తున్నారో కార్మికులు ఎప్పుడైనా ఆత్మవిమర్శ చేసుకున్నారా? ప్రైవేట్‌ బస్సుల్లో ఎంతదూరం ప్రయాణమైనా డ్రైవర్‌ ఒక్కడే ఉంటాడు. నైట్‌ హాల్ట్‌ అయితే బస్సులోనే పడుకుంటారు సిబ్బంది. ఆర్టీసీకి దూరప్రాంతాలకు ఇద్దరు డ్రైవర్లుంటారు. వారికి డిపోల్లోనే నిద్రించడానికి, విశ్రాంతి తీసుకోవడానికి వసతి కల్పిస్తుంది యాజమాన్యం. అలాగే ప్రైవేట్‌ రవాణాలో పనిచేసే కార్మికులతో పోల్చినప్పుడు ఆర్టీసీ కార్మికులకు జీతభత్యా లు, ఇతర సదుపాయాలు అధికమే. అంగట్లో అన్నీఉన్నా, అల్లుడి నోట్లో శని అన్నట్లు, ఎన్ని సదుపాయాలు సమకూర్చినా, సంస్థ మాత్రం ఎప్పు డూ నష్టాల్లోనే కునారిల్లుతుంది. మనకు తిండి పెట్టే సంస్థకు లాభాలు చేకూర్చిపెట్టాలి. దానిలో మన వాటా దబాయించి అడుగాలని కార్మికులు ఆలోచిస్తే బాగుంటుంది. పది వేలకు పైగా బస్సులున్న సంస్థ ఎందుకు ఏటా నష్టాల్లో కూరుకుపోతుందని చర్చించుకోవాలి. తప్పు అధికారుల దా? ప్రభుత్వ విధానానిదా అని తేల్చుకొని తప్పులు దిద్దుకోవచ్చు.
ఇక సమ్మె చట్టబద్ధం అని, చట్టవిరుద్ధం అని పరస్పరం ఆరోపించుకుంటారు.

ఇదెప్పుడూ జరిగేదే. ఇప్పుడు సుమారు 48 వేల మం ది కార్మికులు తమంత తామే స్వచ్ఛందంగా ఉద్యోగాలను వదులుకున్నారని ప్రభుత్వం ప్రకటించింది. అంటే ఇప్పుడు వారు ఆర్టీసీ ఉద్యోగులు కాదని ప్రభుత్వం స్పష్టంచేసింది. ఇప్పుడేం జరుగుతుంది? వారు కోర్టుకు వెళ్లకతప్పదు. కోర్టు ఒకవేళ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తే కార్మికులకు అంతకన్నా పెద్ద పరాభవం ఉండదు. సమర్థించకుండా, ఉద్యోగులను క్షమాపణ లేఖ ఇస్తే తిరిగి విధుల్లోకి తీసుకోమని కోర్టు ఆదేశిస్తే ప్రభుత్వం అంగీకరించకతప్పదు. అప్పటికీ కార్మికులు మొండిపట్టుతో మేము ఉద్యోగాల్లో చేరమని భీష్మిస్తే వారిని అధికారికంగా డిస్మిస్‌ చేయడానికి ప్రభుత్వానికి సంపూర్ణమై న హక్కు లభిస్తుంది. అప్పుడై నా నష్టపోయేది కార్మికులే. పదహారేండ్ల కింద తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఒకేసారి దాదాపు రెండు లక్షల మంది ఉద్యోగులను ఒక్క కలంపోటుతో డిస్మి స్‌ చేసినప్పుడు పైన చెప్పినట్లే జరిగింది. ఆ దెబ్బతో మళ్లీ సమ్మె అంటే ప్రభుత్వోద్యోగులు వణికిపోయారు. అటు ప్రభుత్వం, ఇటు కార్మిక సం ఘాలు ఇద్దరూ మొండిపట్టు పడితే జరుగబోయేది ఇదే కావచ్చు.
Murali-Mohan
ప్రస్తుతం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు ప్రజా మద్దతు లేదు. పం డుగల సమయాల్లో తమను తీవ్రంగా ఇబ్బందుల పాలుచేసిన కార్మిక సం ఘాల పట్ల ప్రయాణికులు ఆగ్రహంగా ఉన్నారు. వంద రూపాయలతో చెయ్యాల్సిన ప్రయాణం సమ్మె మూలంగా మూడు వందలు పెట్టి చేయా ల్సివచ్చిందని రగిలిపోతున్నారు. ప్రజా మద్దతులేని ఏ సమ్మె కూడా విజ యం సాధించదు. తమ సమస్యలను సరైన సమయంలో యాజమాన్యం తో, ప్రభుత్వంతో కూర్చొని చర్చించుకోవాలి తప్ప ప్రజలను ఇబ్బందుల కు గురిచేస్తే ఆర్టీసీ పట్ల ప్రజలకు విశ్వాసం సడలుతుంది. వారు ప్రత్యామ్నాయ మార్గాలకు అలవాటుపడితే, ఆర్టీసీ దివాలా తీసి ఆల్విన్‌, రిపబ్లిక్‌ ఫోర్జ్‌ లాంటి అనేక ప్రభుత్వరంగ సంస్థల మాదిరిగా శాశ్వతంగా మూతపడుతుంది. అప్పుడు సంస్థను నమ్ముకున్నవారంతా రోడ్డుమీద పడక తప్పదు. బంగారుబాతు నుంచి రోజుకో గుడ్డు తీసుకోవాలి తప్ప ఒకేసారి పొదుగు కొస్తే ఏమవుతుంది?
(వ్యాసకర్త: సీనియర్‌ రాజకీయ విశ్లేషకులు)

470
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles