-కంటి నుంచి రక్తం కారుతున్న వీడియోను పోస్టు చేసి.. పోలీసుల సాయం కోరిన భారత యువతి
-రంగంలోకి దిగిన షార్జా పోలీసులు.. నిందితుడి అరెస్టు
షార్జా: కట్టుకున్న వాడే కర్కోటకుడై తనను వేధింపులకు గురి చేస్తుండటంతో బాధలకు తాళలేక ఓ భారత మహిళ సోషల్‌మీడియా వేదికగా తన గోడును వెళ్లబోసుకుంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ ఘటనకు కారణమైన నిందితుడిని అరెస్టు చేశారు. ఈ ఘటన షార్జాలో జరిగింది. భారత్‌కి చెందిన జాస్మిన్ సుల్తాన్, మహమ్మద్ ఖిజార్ ఉల్లాకు ఏడేండ్ల క్రితం పెండ్లి జరిగింది. యూఏఈలోని షార్జాలో నివసిస్తున్న ఈ దంపతులకు ఇద్దరు కుమారులు. అయితే, గత కొంతకాలంగా జాస్మిన్ను దూషిస్తూ ఖిజార్ శారీరకంగా ఆమెను వేధిస్తున్నాడు. ఆమె దగ్గరున్న నగలు, పాస్‌పోర్టును కూడా తీసుకున్నాడు.
ఖిజార్ ఇటీవల చేసిన దాడిలో జాస్మిన్ కన్ను నుంచి రక్తం కారింది. దీంతో తనపై జరిగిన దాడిని వీడియో తీసిన జాస్మిన్ మంగళవారం తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. తనకు సాయం చేయాల్సిందిగా స్థానిక పోలీసులను అభ్యర్థించింది. జాస్మిన్ ట్వీట్‌కు స్పందించిన పోలీసులు దాడికి కారణమైన ఖిజార్ను అదుపులోకి తీసుకున్నారు. తనకు షార్జాలో ఎవరూ బంధువులు లేరని, తనను, తన పిల్లల్ని స్వస్థలం బెంగళూరుకు పంపాల్సిందిగా బాధితురాలు పోలీసుల్ని కోరింది. జరిగిన ఘటనపై సంబంధిత అధికారులకు సమాచారం ఇస్తామని షార్జా పోలీసులు తెలిపారు.