మసీదులో బాంబు పేలుడు

Sat,October 19, 2019 02:14 AM

-62 మంది మృత్యువాత.. 36 మందికి తీవ్రగాయాలు
-ఆఫ్ఘనిస్థాన్‌లో దారుణం

కాబూల్, అక్టోబర్ 17: ఆఫ్ఘనిస్థాన్‌లోని నంగర్‌హార్ రాష్ట్రం హస్కా మినా జిల్లా కేంద్రంలోని మసీదులో భారీ బాంబు పేలుడు సంభవించింది. శుక్రవారం ప్రార్థనలు జరుపుతున్న సమయంలో జరిగిన ఈ బాంబు పేలుడు వల్ల మసీదు భవనం పైకప్పు కూలిపోవడంతో 62 మంది మృతి చెందారు. మరో 36 మందికి తీవ్ర గాయాలయ్యాయని నంగార్‌హర్ రాష్ట్ర గవర్నర్ అధికార ప్రతినిధి అతాహుల్లా ఖోగ్యానీ చెప్పారు. ఆత్మాహుతి దళ సభ్యుడి దాడి వల్ల పేలుడు సంభవించిందా, బాంబు పేలుళ్లు జరిగాయా? అన్న అనుమానాలు ఉన్నాయని చెప్పారు. మరణించిన వారిలోనూ, క్షతగాత్రుల్లోనూ పిల్లలు ఉన్నారు. ఆఫ్ఘనిస్థాన్‌లో హింస ఆందోళనకర స్థాయికి చేరుకున్నది అని ఐక్యరాజ్యసమితి (ఐరాస) ఆందోళన వ్యక్తంచేసిన మరునాడే ఈ దారుణం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనకు తమదే బాధ్యత అని ఏ ఉగ్రవాద సంస్థ కూడా ప్రకటించుకోలేదు. నంగర్‌హార్‌లో తాలిబన్, ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) గ్రూప్ ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. క్షతగాత్రుల్లో తీవ్రంగా గాయపడిన 23 మందిని జలాలాబాద్ దావాఖానకు తరలించామని, మిగతా వారికి స్థానిక జిల్లా కేంద్ర క్లినిక్‌లో చికిత్స అందిస్తున్నామని నంగర్‌హార్ ప్రజారోగ్య విభాగం అధికార ప్రతినిధి జహీర్ అదిల్ తెలిపారు. జూలై నుంచి సెప్టెంబర్ వరకు ఆఫ్ఘనిస్థాన్‌లో ఎంతో మంది పౌరులు దుర్మరణం పాలయ్యారని, మరెంతో మంది గాయపడి దుర్భర జీవితాలను గడుపుతున్నారని తన తాజా నివేదికలో ఐరాస విచారం వ్యక్తం చేసింది. ఉగ్రవాద దాడుల్లో ప్రజల మరణాలు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయని, ప్రజల ప్రాణాల రక్షణపై దేశంలోని అన్ని పార్టీలు మరింత దృష్టి సారించాల్సి ఉందని ఆఫ్ఘన్‌లో ఐరాస ప్రధాన కార్యదర్శి ప్రత్యేక రాయబారి తడామిచి యమామొటో తెలిపారు.

654
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles