
-లైసెన్స్ వెనక్కి ఇచ్చిన ప్రిన్స్..-రెన్యువల్ చేసుకున్న భారత సంతతి వ్యక్తి
లండన్/దుబాయ్, ఫిబ్రవరి 10: యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ (యూఏఈ)లో ఉంటున్న 97 ఏండ్ల భారత సంతతి వ్యక్తి తన డ్రైవింగ్ లైసెన్స్‌ను రెన్యూవల్ చేసుకోగా.. అదే వయసున్న ఎలిజిబెత్ రాణి భర్త ఫిలిప్ తన డ్రైవింగ్ లైసెన్స్‌ను అధికారులకు అప్పగించారు. యూఏఈలో ఉంటున్న తెహిమ్టన్ హోమి ధుంజిబాయ్ మెహతా రానున్న నాలుగేండ్ల కాలానికిగాను తన డ్రైవింగ్ లైసెన్స్‌ను రెన్యూవల్ చేసుకున్నట్లు అక్కడి మీడియా గల్ఫ్ న్యూస్ తెలిపింది. మెహతా అవివాహితుడని, ఆయన 2004లో చివరి సారిగా కారును నడిపారని పేర్కొంది. ఆయన ఎక్కువగా నడకకే ప్రాధాన్యం ఇస్తారని, మద్యం సేవించడం, సిగిరెట్ తాగడంలాంటి అలవాట్లు లేవని వివరించింది. మరోవైపు ఎలిజిబెత్ రాణి భర్త ప్రిన్స్ ఫిలిప్ ఇటీవల రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డారు. దీంతో కంగుతిన్న ఆయన శనివారం తన డ్రైవింగ్ లైసెన్స్‌ను అధికారులకు స్వచ్ఛందంగా అప్పగించారు. లైసెన్స్‌ను అప్పగించే నిర్ణయం ప్రిన్స్ ఫిలిప్ తీసుకున్నారని, ఇందులో ఎవరి జోక్యం లేదని రాజభవనం అధికారులు తెలిపారు. ఇటీవల ప్రమాదంలో గాయపడిన ఇద్దరు మహిళలకు క్షమాపణలు చెబుతూ ప్రిన్స్ ఫిలిప్ లేఖ కూడా రాశారని పేర్కొన్నారు.