ముడి చమురు సరఫరా నిలిపేసిన సౌదీ

Wed,May 15, 2019 12:47 AM

Crude oil rises over drone attacks on Saudi pump stations

రియాద్: తూర్పు ప్రాంతాన ఉన్న చమురుక్షేత్రాల నుంచి పశ్చిమాన ఉన్న ఎర్రసముద్రం ఓడరేవు నగరం యన్‌బు వరకు గల పైపులైన్ ద్వారా ముడి చమురు సరఫరాను నిలిపివేసినట్లు సౌదీ అరేబియా మంగళవారం తెలిపింది. ఈ పైపులైన్ నుంచి కొన్ని దశాబ్దాలుగా సౌదీ ముడి చమురు సరఫరా చేస్తున్నది. సౌదీ చమురు క్షేత్రాలు లక్ష్యంగా డ్రోన్ దాడులు చేశామని యెమెన్ హుథీ తిరుగుబాటుదారులు ప్రకటించిన కొన్ని గంటల్లోనే సౌదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. మంగళవారం తెల్లవారుజామున తూర్పు దిశలో గల చమురు క్షేత్రం నుంచి ఎర్ర సముద్రం మీదుగా వెళ్లే 1200 కి.మీ. పొడవున గల పైపులైన్ పరిధిలో రెండు పంపింగ్ స్టేషన్లపై దాడి జరిగిందని సౌదీ ఇంధనశాఖ మంత్రి ఖాలీద్ అల్ పాలిహ్ తెలిపారు. ఈ పైపులైన్ ద్వారా రోజు 50 లక్షల బ్యారెళ్ల ముడి చము రు పంపిణీ జరుగుతున్నది. ముందు జాగ్రత్త గా తాత్కాలికంగా ముడి చమురు సరఫరా నిలిపివేశామని ఖాలీద్ చెప్పారు. పరిస్థితిపై పూర్తిగా సమీక్షించిన తర్వాత ముడి చమురు సరఫరా చేస్తామని ఒక ప్రకటనలో తెలిపారు. హుథీ తిరుగుబాటుదారుల దాడులను ఖండించారు. సౌదీ అరేబియాను మాత్రమే కాక ప్రపంచ చమురు సరఫరా వ్యవస్థ, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు ఈ దాడులు చేశారన్నారు. ఈ దాడుల వెనుక ఇరాన్ ఉన్నదని మరోసారి స్పష్టమైందని ఫాలిహ్ అన్నారు.

329
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles