దుబాయ్‌లో ఘోర ప్రమాదం

Sat,June 8, 2019 02:55 AM

Dubai bus crash 17 dead after driver hits overhead sign

- 17 మంది మృతి, 9 మందికి గాయాలు
- మృతుల్లో 12 మంది భారతీయులు
- సహాయ చర్యలు చేపట్టిన భారతీయ కాన్సులేట్ అధికారులు


దుబాయ్, జూన్ 7: అరబ్ దేశమైన దుబాయ్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 17 మంది చనిపోగా 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో 12 మంది భారతీయులున్నట్లు దుబాయ్ పోలీసు యంత్రాంగంతోపాటు భారతీయ రాయబార కార్యాలయం శుక్రవారం వెల్లడించింది. 31 మంది ప్రయాణికులతో ఓమన్ రాజధాని మస్కట్ నుంచి వస్తున్న బస్సు గురువారం సాయంత్రం దుబాయ్‌లోని రాషిదియా మెట్రో స్టేషన్ సమీపంలో ప్రమాదానికి గురైంది. అతి వేగం కారణంగా అదుపుతప్పిన బస్సు రాంగ్ రూట్‌లోకి దూసుకొచ్చింది. ట్రాఫిక్ సిగ్నల్‌ను దాటుకుని బారియర్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సు ముందు భాగం చీలిపోగా ఎడమవైపు ఉన్న ప్రయాణికులు మృత్యువాతపడ్డారు. మృతుల్లో మరి కొందరిని గుర్తించాల్సి ఉందని, చనిపోయిన భారతీయుల సంఖ్య పెరిగే అవకాశముందని దుబాయ్ పోలీస్ అధికారులు వెల్లడించారు. కాగా బస్సు ప్రమాదంలో మృతి చెందిన భారతీయుల సంఖ్య తొలుత 8గా పేర్కొనగా తర్వాత ఆ సంఖ్య 12కు పెరిగినట్టు దుబాయ్‌లోని భారతీయ కాన్సులేట్ జనరల్ విపుల్ ట్వీట్ చేశారు. మృతుల పేర్లను కూడా ఆయన తెలిపారు.

బాధితులకు అండగా ఉంటాం: జైశంకర్

బస్సు ప్రమాదంలో భారతీయుల మృతిపట్ల భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ట్విట్టర్‌లో బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతదేహాలను స్వదేశానికి రప్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. దుబాయ్ పోలీస్ డైరెక్టర్ జనరల్ కార్యాలయం కూడా బస్సు ప్రమాదంపై తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. మరోవైపు బస్సు ప్రమాదం నేపథ్యంలో మస్కట్ నుంచి దుబాయ్‌కి తమ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు మ్వాసాలత్ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీ ట్విట్టర్‌లో వెల్లడించింది. అలాగే బాధిత కుటుంబాలకు సంతాపం తెలపడంతోపాటు గాయపడిన ప్రయాణికులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. కాగా కొందరు ఈద్ సెలవులకు వెళ్లి తిరిగి వస్తూ బస్సు ప్రమాదంలో మృతిచెందడంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది.

బాధిత కుటుంబాలకు హెల్ప్‌లైన్

మృతిచెందిన భారతీయుల్లో విక్రమ్ జవహర్ ఠాకూర్, విమల్ కుమార్ కార్తికేయన్ కేశవపిలైకర్, కిరణ్ జానీ, ఫిరోజ్ ఖాన్ అజీజ్ పఠాన్, రేష్మా ఫిరోజ్ ఖాన్ పఠాన్, వాసుదేవ్ విష్ణుదాస్, రాజన్ గోపాలన్, జమాలుద్దీన్ అరక్కవీత్తిల్, ప్రబులా మాధవన్ దీపా కుమార్, రోషిణి మూల్‌చందాని,ఉమ్మెర్ మహ్మద్ పుతెన్, నబిల్ ఉమ్మెర్ ఉన్నారు. కాగా గాయపడిన భారతీయుల్లో దవాఖానలో ప్రాథమిక చికిత్స అనంతరం నలుగురు డిశ్చార్జ్ కాగా రషీద్ దవాఖానలో మరో ముగ్గురు చికిత్స పొందుతున్నట్లు భారతీయ కాన్సులేట్ జనరల్ విపుల్ తెలిపారు. బాధిత కుటుంబాలకు భారతీయ రాయబార కార్యాలయం అండగా ఉంటుందన్నారు. సహాయం కోసం +971-565463903 హెల్స్‌లైన్ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు.

430
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles