నేడే హౌడీ ‘మోదీ’

Sun,September 22, 2019 03:04 AM

-హ్యూస్టన్‌లో ఏర్పాట్లు పూర్తి
-50వేల మందికి పైగా హాజరుకానున్న ప్రజలు
-ప్రత్యేక అతిథిగా రానున్న ట్రంప్

హ్యూస్టన్, సెప్టెంబర్ 21: అమెరికాలోని భారతీయులు, భారత సంతతి ప్రజలు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించతలపెట్టిన హౌడీ మోదీ (హౌ డుయు డూ మోదీ) కార్య్రకమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. హ్యూస్టన్‌లో జరుగనున్న ఈ కార్యక్రమానికి దాదాపు 50 వేల మంది హాజరు కానున్నారు. పోప్ తరువాత ఓ విదేశీ నాయకుడు పాల్గొనే సమావేశానికి ఇంత భారీ ఎత్తున ప్రజలు హాజరు కావడం అమెరికాలో ఇదే మొదటిసారి. ఈ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా పాల్గొననున్న విషయం తెలిసిందే. అమెరికాలోని ఎన్‌ఆర్‌జీలో ఈ సభను నిర్వహిస్తున్నారు. 1500 మందికి పైగా వలంటీర్లు ఇక్కడ స్వచ్ఛంద సేవ అందిస్తున్నారు. హౌడీ మోదీ కార్యక్రమం ప్రచారంలో భాగంగా శుక్రవారం 200 కార్లతో హ్యూస్టన్‌లో ర్యాలీ నిర్వహించారు. భారత్, అమెరికా స్నేహానికి సంకేతంగా ఉభయ దేశాల జెండాలను ఆ కార్లకు కట్టారు.

టెక్సాస్ ఇండియా ఫోరం ప్రతినిధులు ప్రీతీ దావ్రా, గీతేశ్ దేశాయ్, రిషి భుటాడా మీడియాతో మాట్లాడుతూ.. భారత్, అమెరికాల సంస్కృతి, ఐక్యతను చాటడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో భారత్-అమెరికాల మధ్య బలోపేతమవుతున్న సంబంధాల గురించి మోదీ ప్రసంగిస్తారు. ఉభయ దేశాల మధ్య సంబంధాలు అమెరికాలోని 30 లక్షల మంది భారతీయ అమెరికన్ల కారణంగా మరింత బలోపేతమయ్యాయి. ఇంతటి భారీ కార్యక్రమంలో మొదటిసారిగా.. మోదీ, ట్రంప్ ఒకే వేదికను పంచుకోనున్నారు అని వివరించారు.

రేపు ఇమ్రాన్‌తో, ఎల్లుండి మోదీతో ట్రంప్ భేటీ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో భేటీ కానున్నారు. ఆ తరువాత మంగళవారం ఆయన ప్రధాని మోదీతో సమావేశమవుతారు.

542
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles