నరమేధం.. ఐఎస్ పనే!

Wed,April 24, 2019 02:50 AM

ISIS suspect gave advance warning of Sri Lanka bombings source says

-శ్రీలంక పేలుళ్లు తామే జరిపామన్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ
-న్యూజిలాండ్ కాల్పులకు ప్రతీకారమని వెల్లడి
-321కి పెరిగిన మృతుల సంఖ్య
-బాంబర్లలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉన్నట్టు నిర్ధారణ
-ఇప్పటివరకు 40 మంది అనుమానితుల అరెస్టు
-బాంబులు అమర్చిన ట్రక్కు, వ్యాన్ కొలంబోవైపు వెళ్తున్నట్టు సమాచారం
-దేశవ్యాప్తంగా హై అలర్ట్.. వాహనాల కోసం వేట

కొలంబో, ఏప్రిల్ 23: శ్రీలంకలో ఈస్టర్ నాడు జరిగిన మారణహోమం తమ పనేనని ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాద సంస్థ తెలిపింది. ఈ మేరకు సంస్థ అధికారిక న్యూస్ ఏజెన్సీ అమాఖ్ ఒక ప్రకటన, ఉగ్రవాదుల ఫొటో విడుదల చేసింది. ఇటీవల న్యూజిలాండ్‌లో ముస్లింలే లక్ష్యంగా సాగిన ఉగ్రదాడికి ఇది ప్రతీకారమన్నది. మరోవైపు ఈ దాడుల విషయమై ఇప్పటివరకు 40 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. ఏడుగురు సూసైడ్ బాంబర్లలో ఇద్దరు ఒకే కుటుంబం వారని, వారి నేతృత్వంలోనే ఈ పేలుళ్లు జరిగాయన్నారు. ఇందులో బాంబర్లు ప్రయాణించిన వ్యాన్ డ్రైవర్ కూడా ఉన్నాడన్నారు. ప్రజ లు బిక్కుబిక్కుమని కాలం గడుపుతున్నారు.

క్రైస్ట్‌చర్చ్ కాల్పులకు ప్రతీకారమా?

పేలుళ్ల నేపథ్యంలో మంగళవారం అత్యవసర పార్లమెంట్ సమావేశం జరిపారు. ఈ సందర్భంగా రక్షణశాఖ సహాయమంత్రి రువాన్ విజయవర్ధనే మాట్లాడుతూ ప్రాథమిక విచారణ తర్వాత మార్చి 15న న్యూజిలాండ్ క్రైస్ట్‌చర్చ్ ప్రాంతంలోని మసీదుల్లో జరిపిన కాల్పులకు ప్రతీకారంగా ఈ దాడులు జరిగినట్టు అధికారులు నిర్ధారించారు. ఈ దాడుల వెనుక నేషనల్ తౌఫీక్ జమాత్(ఎన్టీజే) ఉన్నట్టు అనుమానిస్తున్నాం అని అన్నారు. ఎన్టీజేను నిషేధించాలని ప్రతిపాదించారు. ప్రధాని రణిల్ విక్రమసింఘే మాట్లాడుతూ అంతర్జాతీయ ఉగ్రవాదం శ్రీలంకలో అడుగుపెట్టిందన్నారు.

క్షమాపణలు కోరిన ప్రభుత్వం

తమ నిర్లక్ష్యం వల్లే మారణహోమం జరిగిందని శ్రీలంక ఒప్పుకున్నది. బాధిత కుటుంబాలతోపాటు దేశ ప్రజలకు మంగళవారం క్షమాపణలు తెలిపింది. పేలుళ్లపై నిఘా వర్గాలు ముందసు సమాచారమిచ్చినా తగిన భద్రతా చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యామని ఆరోగ్యశాఖ మంత్రి రజిత సేనరత్నె తెలిపారు.

మరో ఇద్దరు భారతీయులు మృతి

మృతుల సంఖ్య మంగళవారానికి 321కి పెరిగింది. కనీసం 45 మంది చిన్నారులు బలయ్యారని, ఇందులో ఐదుగురు విదేశీయులని యునిసెఫ్ తెలిపింది. వారిలో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు చెందిన ఎనిమిదేండ్ల వయస్సు గల బంధువు ఉన్నారు. అతడు అధికార అవామీ లీగ్ నేత షేక్ ఫాజ్లుల్ మనుమడు జయాన్ చౌదరి అని తెలిపారు. సెయింట్ సెబాస్టియన్ చర్చిలో 17 మంది, జోయి చర్చి లో 13 మంది, మిగతావారు ఇతర పేలుళ్లలో మరణించారన్నది. పదుల సంఖ్యలో గాయపడ్డారని వెల్లడించింది. మరోవైపు మృతిచెందిన భారతీయ పౌరుల సంఖ్య 10కి పెరిగింది. కర్ణాటకకు చెందిన ఏ మరేగౌడ, హెచ్ పుట్టరాజు మృతదేహాలను గుర్తించామని భారత హై కమిషన్ మంగళవారం ట్వీట్ చేసింది. వారిద్దరూ జేడీఎస్ వారేనని కర్ణాటక సీఎం కుమారస్వామి తెలిపారు.

లారీ, వ్యాన్ కోసం వేట

శక్తివంతమైన పేలుడు పదార్థాలు అమర్చిన ఒక ట్రక్, ఒక వ్యాన్ కొలంబోవైపు వెళ్తున్నాయని నిఘా వర్గాలు గుర్తించాయి. దీంతో రక్షణశాఖ డైరెక్టర్ దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించి.. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో విస్తృత తనిఖీలు చేపట్టారు. మరోవైపు ఉగ్రవాదులు వాడినట్లు భావిస్తున్న మూడు బైక్‌లు, కారు, వ్యాన్ కోసం గాలిస్తున్నారు. ఐజీపీ ఆఫీస్ నుంచి వాటి రిజిస్ట్రేషన్ నంబర్లు, ఇతర వివరాలు వచ్చాయని స్థానిక మీడియా తెలిపింది.

కుటుంబమంతా సూసైడ్ బాంబర్లు?

సూసైడ్ బాంబర్లలో ముగ్గురు ఒకే కుటుంబం వారు ఉన్నారని అధికారవర్గాలు తెలిపాయి. వీరిని కొలంబోలోని మసాలా దినుసుల వ్యాపారి ఇద్దరు కొడుకులు, కోడలుగా గుర్తించాయి. నిజానికి ఉగ్రవాదులు మొత్తం 4 హోటళ్లను టార్గెట్ చేశారు. వ్యాపారి కొడుకులు శనివారం సాయం త్రం శాంగ్రిలా, సిన్నామన్ గ్రాండ్ హోటళ్లలోకి అతిథులుగా ప్రవేశించారు. ఒకరు నకిలీ వివరాలు ఇవ్వగా, మరొకరు అసలు వివరాలు చెప్పారు. ఆదివారం అల్పాహారం తినేందుకు క్యూలో నిలబడి తమనుతాము పేల్చేసుకున్నారు. నాలుగో ఉగ్రవాది చివరి నిమిషంలో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అతడి ప్రవర్తనపై అనుమానం తో హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు. అతడు ఒరుగోడవట్టలోని ఓ ఇంటిలో దాక్కున్నట్టు తెలిసింది. అదే ఇంటిలో వ్యాపారి కోడలు, ఇద్దరు పిల్లలూ ఉన్నారు. పోలీసులు ఆ ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా ఆమె ఒక బాంబును పేల్చివేసింది. దీంతో ఇంట్లోని నలుగురితోపాటు ముగ్గురు పోలీసులు మృతిచెందారు. మిగతా బాంబర్లు వీరికి బంధువులు కావొచ్చని అనుమానిస్తున్నారు.
Islamist-State

ఏడుగురు ఉగ్రవాదులు

శ్రీలంకలో పేలుళ్లకు తమదే బాధ్యత అని ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాద సంస్థ తెలిపింది. అమెరికా, దాని మిత్రదేశాల పౌరులు, క్రైస్తవులే లక్ష్యంగా శ్రీలంకలో దాడులు జరిపిన వీరులు ఐఎస్‌వారే అని ఐఎస్‌కు చెందిన అమాఖ్ న్యూస్ ఏజెన్సీ పేర్కొన్నది. ఈ మేరకు ఏడుగురు ఉగ్రవాదులతో కూడిన ఓ ఫొటోను విడుదల చేసింది. ఈ ఫొటోలో ఏడుగురు ముసుగు ధరించి ఉండగా, మధ్యలో ఉన్న వ్యక్తి ముసుగు లేకుండా ఉన్నాడు. ముసుగు ధరించిన ఏడుగురిని శ్రీలంకలో దాడులకు పాల్పడిన వారిగా మధ్యలో ఉన్న వ్యక్తిని వారి నాయకుడిగా భావిస్తున్నారు. ఈ ఏడుగురి పేర్లను, వారికి నిర్దేశించిన లక్ష్యాలను కూడా ఐఎస్ వెల్లడించింది. ఉగ్రవాదుల్లో ముగ్గురు మూడు చర్చిల్లో పేలుళ్లు జరపగా మిగిలిన వారు హోటళ్లలో దాడులు నిర్వహించారని తెలిపింది.
New-Delhi

మూడు నిమిషాలు మౌనం

బాంబుపేలుళ్ల మృతులకు శ్రీలంకతోపాటు పలు దేశాలు సంతాపం తెలిపాయి. శ్రీలంకలో మంగళవారం ఉదయం 8:30 గంటలకు దేశవ్యాప్తంగా జాతీయ జెండాలను అవనతం చేసి ప్రజలంతా మూడు నిమిషాలు మౌనం పాటించారు. ఇంగ్లండ్ రాజధాని లండన్, డెన్మార్క్ రాజధాని కోపెన్‌హగన్‌లో ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ జెండాను అవనతం చేశారు. పారిస్‌లోని ప్రఖ్యాత ఈఫిల్ టవర్ లైట్లను కొద్దిసేపు ఆర్పివేశారు. నెగాంబోలోని సెయింట్ సెబాస్టియన్ చర్చి వద్ద సామూహిక అంత్యక్రియలు నిర్వహించారు. ఈ చర్చిలో జరిగిన పేలుడులో దాదాపు 100 మంది మృతిచెందారు.

1407
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles