జూలియన్ అసాంజె అరెస్ట్

Fri,April 12, 2019 02:47 AM

Julian Assange arrested in London

-ఆశ్రయాన్ని ఉపసంహరించుకున్న ఈక్వెడార్
-వెంటనే అదుపులోకి తీసుకున్న స్కాట్‌లాండ్ యార్డ్ పోలీసులు

లండన్, ఏప్రిల్ 11: పలు దేశాల రహస్యాలు బట్టబయలు చేసి, పలువురు నేతలకు కంటగింపుగా మారిన వికిలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేను స్కాట్‌లాండ్ యార్డ్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఆయన గత ఏడు సంవత్సరాలుగా లండన్‌లోని ఈక్వెడార్ దౌత్య కార్యాలయంలో తలదాచుకుంటున్నారు.అయితే ఆయనకు ఇచ్చి న ఆశ్రయాన్ని ఈక్వెడార్ ప్రభుత్వం ఉపసంహరించుకోవడంతో.. వెంటనే రంగంలోకి దిగిన స్కాట్‌లాండ్ యార్డ్ పోలీసులు అసాంజేను అదుపులోకి తీసుకున్నారు. బ్రిటన్ బెయిల్ నిబంధనలను ఉల్లంఘించినందుకు 2012 జూన్‌లో అసాంజేకు వ్యతిరేకంగా అరెస్టు వారెంట్ జారీ అయిందని, దానిని ఇప్పుడు అమలు చేశామని స్కాట్‌లాండ్ యార్డ్ పోలీసులు తెలిపారు.

స్వీడన్‌లో లైంగిక దాడి అభియోగాలపై అరెస్టయిన అసాంజే.. అక్కడి నుంచి వచ్చి లండన్‌లోని ఈక్వెడార్ దౌత్య కార్యాలయంలో ఒక గదిలో నివాసముంటున్నారు. పోలీసులు తనను అమెరికాకు అప్పగించే అవకాశమున్నందున తనకు ఆశ్రయం కల్పించాలని ఆయన ఈక్వెడార్ ప్రభుత్వాన్ని కోరారు. అమెరికాకు చెందిన పలు రహస్యాలను వికిలీక్స్‌లో బట్టబయలు చేసిన నేపథ్యంలో తనకు మరణశిక్ష పడవచ్చని అసాంజే భావిస్తున్నారు. అసాంజేను ప్రస్తుతం సెంట్రల్ లండన్ పోలీస్ స్టేషన్‌లో ఉంచామని, త్వరలోనే వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్స్ కోర్టు ముందు హాజరుపరుస్తామని పోలీసులు చెప్పారు. స్వీడన్‌లో అసాంజేపై నమోదైన లైంగికదాడి ఆరోపణలు తొలిగిపోయాయని, బెయిల్ నిబంధనలకు ఉల్లంఘించినందుకు మాత్రం ఆయనపై తగు చర్యలుంటాయని తెలిపారు.

474
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles