కువైట్ ప్రధాని సహా క్యాబినెట్ రాజీనామా

Fri,November 15, 2019 01:07 AM

-మంత్రులపై విమర్శలు, అంతర్గత తగాదాలే కారణం
-ఎనిమిదేండ్లలో ఎనిమిదోసారి ప్రభుత్వ పతనం
కువైట్ సిటీ: అంతర్గత విభేదాలు, పేలవ పనితీరు, మంత్రుల మధ్య ఘర్షణ, పార్లమెంట్ సభ్యుల ఆరోపణల నేపథ్యంలో కువైట్ ప్రధాని షేక్ జబేర్ ముబారక్ అల్ సబాహ్ రాజీనామా చేశారు. తదుపరి ప్రభుత్వ ఏర్పాటు కోసం తనతోపాటు యావత్ తన క్యాబినెట్ రాజీనామా లేఖను కువైట్ రాజుకు అందజేశారని ప్రభుత్వ అధికార ప్రతినిధి తారిఖ్ అల్ మజ్రేమ్ ఒక ప్రకటనలో తెలిపారు.


ప్రభుత్వ పెన్షన్ సంస్థ నుంచి రిటైర్డ్ ఉద్యోగులు తీసుకున్న రుణాలపై ఇస్లామిక్ చట్టాలను ఉల్లంఘించి వడ్డీరేటు వసూలు చేస్తున్నారని ఆరోపణలు రావడంతో గత నెలలోనే ఆర్థిక మంత్రి నయీఫ్ అల్ హజ్రఫ్ రాజీనామా చేశారు. ప్రభుత్వ నిధుల వినియోగంలో వైఫల్యం, పనితీరులో పేలవ ప్రదర్శనపై సుదీర్ఘ కాలం పార్లమెంట్ నిలదీస్తుండటంతో ప్రజా పనులశాఖ మంత్రి జెనన్ బుషెహ్రీ తన రాజీనామా లేఖను సమర్పించారు. స్వతంత్ర ఎంపీ సాలేహ్ అషౌర్ మాట్లాడుతూ ప్రస్తుత క్యాబినెట్ కూర్పుపై మంత్రుల మధ్య విభేదాలు తలెత్తడంతోనే ప్రభుత్వం రాజీనామా చేసిందన్నారు. ప్రభుత్వ రాజీనామా తర్వాత వైదొలుగనున్న ప్రధానిని రాజు తిరిగి నియమించడం గానీ, కొత్త ప్రభుత్వ అధినేతను నియమించడం గానీ చేయొచ్చు. 2011లో కువైట్‌లో పార్లమెంట్ ఏర్పాటైనప్పటి నుంచి ఇది ఎనిమిదో క్యాబినెట్.

752
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles