పాక్ మాజీ అధ్యక్షుడు జర్దారీ అరెస్ట్

Tue,June 11, 2019 02:13 AM

Pakistan ex-President Zardari Arrested over Corruption Charges

- నకిలీ బ్యాంకు ఖాతాల నుంచి సొమ్మును విదేశాలకు మళ్లించినట్లు ఆరోపణలు

ఇస్లామాబాద్, జూన్ 10: పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ(63) సోమవారం అరెస్టయ్యారు. నకిలీ బ్యాంకు ఖాతాల నుంచి సుమారు రూ.15 కోట్లు అక్రమంగా విదేశాలకు మళ్లించినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి. ఈ కేసులో ఇస్లామాబాద్ హైకోర్టు జర్దారీ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో ఆదివారం అరెస్ట్ వారెంట్ జారీ చేసిన ఆ దేశ అవినీతి నిరోధక సంస్థ అధికారులు సోమవారం పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ కో ఛైర్మన్ అయిన జర్దారీ నివాసానికి వచ్చారు. తొలుత ఆయన అరెస్టును అడ్డుకునేందుకు పార్టీ కార్యకర్తలు తీవ్రంగా యత్నించారు. అయితే కొందరు అధికారులు జర్దారీతో చర్చలు జరుపడంతో చివరకు ఆయన లొంగిపోయారు. అయితే మనీ ల్యాండరింగ్ స్కాంలో జర్దారీతోపాటు నిందితురాలిగా ఉన్న ఆయన సోదరి ఫర్యాల్ తల్పూర్‌ను అరెస్ట్ చేయలేదు. 2008 నుంచి 2013 వరకు పాక్ 11వ అధ్యక్షుడుగా బాధ్యతలు నిర్వర్తించిన జర్దారీ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించడంతోపాటు అధికార పార్టీ వైఖరిని తప్పుపట్టారు. మరోవైపు జర్దారీ అరెస్ట్‌పై కార్యకర్తలు ఎలాంటి ఆందోళన చెందవద్దని, సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తామని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీకి చెందిన మాజీ ప్రధాని యూసఫ్ రజా గిలానీ ప్రకటించారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో సభ్యుడైన జర్దారీని సభలో హాజరుపర్చేలా స్పీకర్ ఆదేశాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా జర్దారీ అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ కార్యకర్తలు లాహోర్, కరాచీతోపాటు పలు చోట్ల నిరసనలు తెలిపారు.

707
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles