డ్రాగన్.. తోక తెగుద్ది!

Fri,March 15, 2019 04:09 AM

Pakistans Masood Azhar China blocks bid to call militant terrorist

-తీరు మారకపోతే.. ఇతర చర్యలు తప్పవు
-చైనాకు భద్రతా మండలిలోని సభ్య దేశాల హెచ్చరిక
-మసూద్ అజర్‌ను ఉగ్రవాదిగా ప్రకటించకుండా అడ్డుకోవడంపై మండిపాటు
-బాధ్యతగల దేశాలు చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోవని స్పష్టీకరణ

వాషింగ్టన్, మార్చి 14: పాకిస్థాన్‌కు చెందిన జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ అధిపతి మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించకుండా అడ్డుకోవడాన్ని చైనా కొనసాగిస్తే.. తాము తప్పనిసరి పరిస్థితుల్లో ఇతర చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని సభ్య దేశాలు హెచ్చరించాయి. మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించకుండా చైనా అడ్డుకున్న నేపథ్యంలో భద్రతా మండలిలోని సభ్య దేశాలు తమ అసహనం వ్యక్తం చేశాయి. పేర్లు వెల్లడించడానికి నిరాకరించిన ఆయా దేశాల దౌత్యవేత్తలు చైనా వైఖరిపై మండిపడ్డారు. 1267 అల్‌కాయిదా ఆంక్షల కమిటీ నిబంధనల ప్రకారం తాము బహిరంగంగ అభిప్రాయాలను వ్యక్తం చేయరాదన్నారు. పదేండ్లలో చైనా 4 సార్లు అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించకుండా అడ్డుకుంది. 2001లో పార్లమెంట్‌పై దాడి మొదలు మొన్నటి పుల్వామా ఘాతుకం వరకు భారత్‌లో జరిగిన పలు కిరాతక ఉగ్రదాడులకు అజర్ కుట్రపన్నాడు.

దీనివల్ల ప్రతిసారి భారత్, పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. పుల్వామా ఉగ్రదాడి తర్వాత ఫ్రాన్స్, బ్రిటన్, అమెరికా దేశాలు మరోసారి మసూద్ అజర్‌కు వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రతిపాదించాయి. 10 రోజుల గడువు తర్వాత చివరి క్షణంలో చైనా మరోసారి సాంకేతిక కారణాలతో మసూద్ అజర్‌కు అండగా నిలిచింది. చైనా ఇలాగే భద్రతా మండలిని అడ్డుకోవడం కొనసాగిస్తే, బాధ్యత గల దేశాలు ఇతర చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుంది. ఆ పరిస్థితి తలెత్తకూడదు అని భద్రతామండలికి చెందిన ఓ దౌత్యవేత్త హెచ్చరించారు. కాగా, చైనా నిర్ణయంపై భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. భారతీయులపై జరిగిన దాడులకు బాధ్యులైన ఉగ్రవాద సంస్థల నేతలందరినీ చట్టం ముందు నిలబెట్టేందుకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటామని భారత దౌత్యాధికారులు అన్నారు. అజర్‌కు చైనా అండగా నిలవడం ఇది నాలుగోసారి.

భద్రతా మండలికి అప్పగించిన బాధ్యతను నిర్వర్తించకుండా చైనా ఇలా అడ్డుకోరాదు అని ఆ దౌత్యవేత్త అన్నారు. దక్షిణాసియాలో ప్రాంతీయ స్థిరత్వానికి, చైనా తనంతట తానుగా నిర్దేశించుకున్న ఉగ్రవాద నిరోధక లక్ష్యాలకు దాని వ్యవహారం పూర్తి విరుద్ధమన్నారు. తమ భూభాగంలో ఉంటూ ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్న వారిని రక్షించుకొనేందుకు పాకిస్థాన్ చైనాపై ఆధారపడటాన్ని మరో దౌత్యవేత్త దు య్యబట్టారు. ప్రాంతీయ శాంతి, సుస్థిరతల విషయమై అమెరికా, చైనాకు పరస్పర ప్రయోజనాలున్నాయని, కానీ మసూద్ విషయంలో చైనా తీరు తమ ఉమ్మడి లక్ష్యాలకు విరుద్ధమ ని ఢిల్లీలోని అమెరికా దౌత్య కార్యాలయ ప్రతినిధి పేర్కొన్నారు.

మా నిర్ణయం సబబే: చైనా

బీజింగ్: మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించకుండా అడ్డుకోవాలన్న నిర్ణయాన్ని చైనా సమర్థించుకుంది. తమ నిర్ణయం ఈ కేసును మరింత లోతుగా, క్షుణ్ణంగా అధ్యయనం చేయడానికి సమయమిస్తుందన్నది. ఆ అంశంతో ముడివడి ఉన్న పక్షాలు మరింత విస్తృతంగా చర్చలు జరిపి, అందరికీ ఆమోదయోగ్యమైన అంతిమ పరిష్కారాన్ని కనుగొనేందుకు తమ నిర్ణయం దోహదపడుతుందని చెప్పుకుంది. తమ నిర్ణయం 1267 ఆంక్షల కమిటీ నిబంధనల ప్రకారమే ఉన్నదని చైనా విదేశాంగ శాఖ ప్రతినిది లుకాంగ్ చెప్పారు. ఆంక్షల కమిటీ చేపట్టిన చర్యతో సంబంధిత దేశాలు చర్చలు, సంప్రదింపులు జరుపుతాయని, ప్రాంతీయ శాంతి, సుస్థిరతను మరింత క్లిష్టంగా మార్చకుండా ఈ చర్య నిరోధించగలదని చైనా ఆశిస్తున్నదని కాంగ్ తెలిపారు. భారత్ సహా అన్ని పక్షాలతో మాట్ల్లాడేందుకు, సమన్వయానికి చైనా సిద్ధంగా ఉందని చెప్పారు.

ఫొటోల దౌత్యం ఫలితమిదేనా?

చైనా తీరుపై పలువురు భారత సంతతి అమెరికన్ ప్రముఖులు మండిపడ్డారు. వుహాన్ (చైనా)లో సాగిన (మోదీ, జిన్‌పింగ్) ప్రేమానుబంధాలకు ఫలితం ఇది అని హెరిటేజ్ ఫౌండేషన్ ప్రతినిధి జెఫ్ స్మిత్ ఎద్దేవా చేశారు. గత ఏడాది ఏప్రిల్‌లో వుహాన్‌లో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ సమావేశమైన సంగతి తెలిసిందే. చైనా నిర్ణయం ఊహించిందే. పుల్వామా దాడి తర్వాత చైనా అదే వైఖరిని పునరుద్ఘాటించడం భారత్‌కు చెంపపెట్టు. జిన్‌పింగ్‌తో మోదీ ఫొటో దౌత్యంతో కలిగిన ప్రయోజనాలపై తీవ్ర సందేహాలు వ్యక్తమవుతున్నాయి అని అమెరికన్ ఎంటర్‌ప్రైజ్ ఇన్‌స్టిట్యూట్ ప్రతినిధి సదానంద్ ధూమే ట్వీట్ చేశారు. పాక్ ప్రాయోజిత ఉగ్రవాదంపై చైనా రంగు బట్టబయలైందని, ఆ దేశ ఎంబసీ ఎదుట ప్రదర్శనలు చేస్తామని అమెరికన్ ఇండియా ప్రజా వ్యవహారాల కమిటీ అధ్యక్షుడు జగదీశ్ సెహవానీ చెప్పారు.

3342
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles