కోటీశ్వరుడి కొడుకులే..ఆ కిరాతకులు

Fri,April 26, 2019 04:17 AM

Sri Lanka blasts Islamic State claims responsibility of Easter suicide attacks

-శ్రీలంక పేలుళ్లలో కీలక పాత్రధారుల వివరాలు లభ్యం
-దేశవ్యాప్తంగా కొనసాగుతున్న తనిఖీలు.. మరో భారతీయుడు మృతి..
-మృతులు 359 కాదు.. 253 మాత్రమే
-రాజధాని సమీపంలో మరో పేలుడు
- రక్షణశాఖ కార్యదర్శి రాజీనామా

కొలంబో, ఏప్రిల్ 25: శ్రీలంకను కన్నీటి సంద్రంలో ముంచిన ఈస్టర్ పండుగనాటి వరుస బాంబు పేలుళ్ల ప్రధాన పాత్రధారులు ఓ కోటీశ్వరుడి కొడుకులని తేలింది. కొలంబోకు చెందిన ఇన్సాఫ్ ఇబ్రహీం, ఇల్హాం ఇబ్రహీంను ప్రధాన పాత్రధారులుగా స్థానిక మీడియా పేర్కొన్నది. పోలీసులు మాత్రం ఈ విషయాన్ని నిర్ధారించలేదు. కానీ.. వారి తండ్రి మహ్మద్ యూసుఫ్ ఇబ్రహీంను బుధవారం అరెస్టుచేశారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహ్మద్ యూసుఫ్ ఇబ్రహీం మసాలా దినుసులను ఎగుమతి చేస్తుంటారు. వందల కోట్లకు అధిపతి. ఆయనకు ఆరుగురు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు. పెద్ద కొడుకు ఇన్సాఫ్ ఇబ్రహీం (33) రాగిని ఉత్పత్తిచేసే పరిశ్రమ నడుపుతున్నాడు. ఇన్సాఫ్ ఆదివారం శాంగ్రిలా హోటల్‌లో ఆత్మాహుతిదాడికి పాల్పడ్డాడు. సోమవారం పోలీసులను చూసి ఇల్హాం ఇబ్రహీం తనను తాను పేల్చివేసుకున్నాడు. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న అతడి భార్య, ముగ్గురు పిల్లలతోపాటు ముగ్గురు పోలీసులు మరణించారు. మహ్మద్ ఇబ్రహీం కుటుంబానికి ఆ ప్రాంతంలో మంచి పేరున్న ది. పేదలకు డబ్బు, ఆహారం సాయం చేస్తుంటారని, ఉద్యోగులకు బోనస్‌లు, కానుకలు ఇస్తుంటారని స్థానికులు చెప్తున్నారు.

మరో భారతీయుడు మృతి

పేలుళ్లలో గాయపడిన మరో భారతీయుడు మృతిచెందాడని శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు మరో 14 మంది విదేశీయులు మృతిచెందారని, 12 మంది చికిత్స పొందుతున్నారని తెలిపింది. పరిస్థితులు మెరుగుపడే వరకు వీసాల జారీ ప్రక్రియను నిలిపివేస్తున్నట్టు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. పేలుళ్లలో మృతిచెందిన వారి సంఖ్య 359 కాదని, 253 మాత్రమేనని తెలిపింది. కొందరి శరీర భాగాలను రెండుసార్లు లెక్కించడం వల్ల మృతుల సంఖ్య భారీగా పెరిగిందని వివరించింది. దేశవ్యాప్తంగా డ్రోన్లు వినియోగించడాన్ని, గుర్తుతెలియని విమానాలు తమ భూభాగం మీదుగా ఎగురడాన్ని నిషేధించింది.

దర్యాప్తులో ఆరుదేశాల నిఘా సంస్థలు

శ్రీలంక పేలుళ్లపై అంతర్జాతీయ స్థాయి దర్యాప్తు జరుగుతున్నది. శ్రీలంక అధికారులతోపాటు బ్రిటన్, అమెరికా తదితర ఆరు దేశాలకు చెందిన నిఘా సంస్థలు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నాయి. ఉగ్రవాదులతో సంబంధం ఉన్న ఐదు ఇండ్లను గుర్తించారు. కొలంబోకు 40 కిలోమీటర్ల దూరంలోఉన్న పుగోడా పట్టణంలో బుధవారం చిన్న పేలుడు సంభవించింది. మేజిస్ట్రేట్ కోర్ట్ ఆవరణలోని ఓ చెత్తకుండీలో పేలుడు జరిగింది. దీంతో ఎలాంటి నష్టం కలుగలేదు. దేశవ్యాప్తంగా సైన్యం, పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయి. మరో 16 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో అరెస్టుల సంఖ్య 76కు చేరింది. భద్రతావైఫల్యానికి బాధ్యత వహిస్తూ రక్షణశాఖ కార్యదర్శి హేమసిరి ఫెర్నాండో రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను అధ్యక్షుడికి అందించారు.

3238
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles