శ్రీలంకలో మతహింస

Wed,May 15, 2019 01:51 AM

Sri Lanka extends nationwide curfew after anti Muslim riots

- ముస్లింల ఆస్తులపై కొనసాగుతున్న దాడులు


కొలంబో: అంతర్యుద్ధం అనంతరం గత దశాబ్ద కాలానికి పైగా శాంతియుతంగా జీవనం సాగిస్తున్న శ్రీలంక ప్రజల మధ్య ఈస్టర్ బాంబుదాడులు చిచ్చు పెట్టాయి. 250 మందికి పైగా మృత్యువాత పడిన ఈస్టర్ దాడులకు తామే కారణమని అంతర్జాతీయ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఐఎస్ ప్రకటించిన నేపథ్యంలో.. మెజారిటీ వర్గం ప్రజలు మైనారిటీలైన ముస్లింలపై దాడులకు దిగుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. శ్రీలంక వాయవ్య రాష్ట్రంలో గత రెండు రోజులుగా ముస్లింలకు చెందిన ఇండ్లు, దుకాణాలు, వాహనాలు, మసీదులపై సింహళీయులు విధ్వంసానికి దిగారు. ఈ దాడుల్లో ఒకరు మరణించగా, భారీ స్థాయిలో ఆస్తులకు నష్టం వాటిల్లింది. అల్లరి మూకలు కత్తులూ, కర్రలతో ఊరూరూ తిరుగుతూ దాడులకు పాల్పడుతున్నారు. దీంతో దేశమంతటా కర్ఫ్యూ విధించినట్టు పోలీసులు ప్రకటించారు. సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించారు. అల్లర్లను రెచ్చగొడుతున్న ఇద్దరితోపాటు హింసకు కారణమైన 20 మందిని అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ, ముస్లిం వ్యతిరేక అల్లర్లను అదుపు చేసేందుకు సైన్యం సహకారాన్ని కోరామని చెప్పారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రజలు సహకరించాలని కోరారు.

ఈస్టర్ దాడుల సూత్రధారిపై భారత్‌లో రెండు చార్జిషీట్లు

శ్రీలంకలో ఈస్టర్ బాంబు దాడులకు సాంకేతిక సహకారం అందించిన ఆ దేశ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆదిల్ అమీజ్ (24)పై మూడేండ్ల క్రితమే తాము నిఘా వేశామని భారత ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. 2016లో నమోదైన రెండు కేసులకు సంబంధించిన చార్జిషీట్లలో అతని పేరును ప్రస్తావించామని పేర్కొన్నాయి. అహ్మదాబాద్‌లోని ఓ ప్రార్థనా మందిరంపై దాడికి కుట్ర పన్నిన ఇద్దరు ఐఎస్ ఉగ్రవాదులలో ఒకడు ఆదిల్‌తో టచ్‌లో ఉన్నట్టు ఆ చార్జిషీట్‌లో పేర్కొన్నారు. ఐఎస్‌కు అనుకూలంగా ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణపై అరెస్టయిన ముగ్గురు భారతీయులకు ఆదిల్ ఆన్‌లైన్‌లో ప్రచార సామగ్రిని అందించినట్టు తెలిపారు. ఈ ఆరోపణలను ఆదిల్ తండ్రి అమీజ్ తోసిపుచ్చారు. అవన్నీ అసత్యాలని పేర్కొన్నారు. కాగా ఈస్టర్ దాడులకు పాల్పడిన నేషనల్ తౌహీత్ జమాత్ (ఎన్టీజే) ఉగ్రవాద సంస్థతోపాటు మరో రెండు ఇస్లామిక్ ఉగ్రవాద గ్రూపులపై శ్రీలంక ప్రభుత్వం నిషేధం విధించింది.

411
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles