లంకను వీడని భయం

Thu,April 25, 2019 02:35 AM

Sri Lanka investigates Easter bombings

-కొనసాగుతున్న సోదాలు, అరెస్టులు
-నరమేధంలో మహిళ సహా తొమ్మిది మంది బాంబర్లు
-మాస్టర్‌మైండ్‌గా జహ్రాన్ హాసిమ్‌పై అనుమానం
-359కి పెరిగిన మృతుల సంఖ్య

కొలంబో, ఏప్రిల్ 24: శ్రీలంకలో భయానక వాతావరణం ఇంకా తొలిగిపోలేదు. మృతుల సంఖ్య 359కి పెరిగింది. దేశవ్యాప్తంగా అనుమానిత ప్రాంతాల్లో భద్రతా బలగాల సోదాలు కొనసాగుతున్నాయి. మరిన్ని దాడులు జరుగుతాయని హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో భద్రతను మరింత పెంచాలని, సైన్యానికి మరిన్ని అధికారాలు ఇవ్వాలని పార్లమెంట్ నిర్ణయించింది. నేషనల్ తౌహీద్ జమాత్ (ఎన్టీజే) ఉగ్రసంస్థతో సంబంధం ఉన్నట్టు అనుమానిస్తున్న మరో 16 మందిని అరెస్టు చేశారు. దీంతో అరెస్టుల సంఖ్య 60కి పెరిగింది. దాడుల్లో మొత్తం తొమ్మిది మంది ఆత్మాహుతి దళ సభ్యులు పాల్గొన్నట్టు నిర్ధారించారు. ఐఎస్ విడుదల చేసిన ఓ వీడియోలో ఉగ్రవాది మహ్మద్ జహ్రాన్ కనిపించాడు. దీంతో ఈ పేలుళ్లకు అతడే సూత్రధారిగా అనుమానిస్తున్నారు. పాఠశాలలు, విద్యాసంస్థలను ఈ నెల 29 వరకు మూసివేస్తున్నట్టు విద్యాశాఖమంత్రి ప్రకటించారు.

మొత్తం తొమ్మిది మంది బాంబర్లు

ఆదివారం నాటి పేలుళ్లలో ఎన్టీజేకు చెందిన మొత్తం తొమ్మిది మంది ఆత్మాహుతి దళ సభ్యులు(సూసైడ్ బాంబర్లు) పాల్గొన్నట్టు అధికారులు తెలిపారు. ఇందులో ఒక మహిళ కూడా ఉన్నదని, ఆమె ఓ బాంబర్ భార్య అని పేర్కొన్నారు. వీరిలో చాలామంది సంపన్న కుటుంబాలకు చెందినవారు, విద్యావంతులేనని వెల్లడించారు. ఒక సూసైడ్ బాంబర్ బ్రిటన్‌లో డిగ్రీ, ఆస్ట్రేలియాలో పీజీ చేసి వచ్చి శ్రీలంకలో స్థిరపడ్డట్టు తెలిసిందన్నారు. దాడులు తమ పనేనని ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ప్రకటించినా.. ఇప్పటివరకు ఎన్టీజే-ఐఎస్ మధ్య సంబంధాలపై ఆధారాలు దొరుకలేదని చెప్పారు. సూసైడ్ బాంబర్లకు నేతృత్వం వహించిన ఇద్దరు సోదరులు శాంగ్రిలా, సిన్నామన్ గ్రాండ్ హోటళ్లలోకి ప్రవేశించిన సీసీటీవీ ఫుటేజీలు లభించాయి. వీరి మరో సోదరుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి ఇంట్లో విద్వేషపూరిత సాహిత్యం, కంప్యూటర్ హార్డ్ డిస్క్, సిమ్‌కార్డులు లభించాయని చెప్పారు. దెహీవాలా ప్రాంతంలోని నేషనల్ జూ సమీపంలో ఉగ్రవాదులు నివాసం ఉన్న ఇంటి ఓనర్‌ను, పేలుళ్లకు ముందు వారిని హోటళ్లు, లాడ్జీలకు చేర్చిన ట్యాక్సీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.

ప్రణాళికలో ఇంకో చర్చి?

ఉగ్రవాదులు కొలంబోలోని సెయింట్ మేరీస్ చర్చిని కూడా లక్ష్యంగా చేసుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈస్టర్ రోజు ఆత్మాహుతి దళ సభ్యుడు అక్కడికి వెళ్లాడని, అయితే భద్రత ఎక్కువగా ఉండటంతో లోనికి వెళ్లడం సాధ్యం కాలేదని భావిస్తున్నారు. ఇటీవలే ఆ చర్చిలో దొంగతనం జరిగింది. అప్పటి నుంచి అక్కడ భద్రతను పెంచారు. ఇదే ఇప్పుడు పెద్దముప్పు నుంచి కాపాడింది.

వెంటనే రాజీనామా చేయండి

పేలుళ్లపై ముందస్తు సమాచారం ఉన్నా తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమైన నేపథ్యంలో ఐజీపీ పుజిత్ జయసుందర, రక్షణశాఖ కార్యదర్శి హేమశ్రీ ఫెర్నాండో రాజీనామా చేయాలని శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఆదేశించారు. పార్లమెంట్ నాయకుడు లక్ష్మణ్ కిరియెల్ల మాట్లాడుతూ వారికి ఈ నెల 4న ఇంటెలిజెన్స్ హెచ్చరికలు అందినా.. ఈ నెల 7న జరిగిన జాతీయ భద్రతా మండలి సమావేశంలో ప్రస్తావించలేదని విమర్శించారు. మరోవైపు కొలంబో వెల్లవట్ట ప్రాంతంలోని సవోయ్ థియేటర్ సమీపంలో పార్క్ చేసి ఉన్న ఓ బైక్‌ను భద్రతాబలగాలు పేల్చివేశాయి. దానిపై యజమాని వివరాలు లేకపోవడంతో పేల్చేశామని, అందులో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని చెప్పారు.
movie-theatre

భారత్‌కు చేరిన మృతదేహాలు

పేలుళ్లలో మృతిచెందిన 10 మంది భారతీయుల్లో తొమ్మిది మృతదేహాలు భారత్‌కు వచ్చాయి. మొత్తం నాలుగు ప్రత్యేక విమానాల్లో మృతదేహాలను తరలించామని శ్రీలంకలో భారత హైకమిషన్ తెలిపింది. ఈ విమానాలు హైదరాబాద్, బెంగళూరులో ల్యాండ్ అవుతాయని, అక్కడి నుంచి స్వస్థలాలకు తీసుకెళ్తారని చెప్పారు.

సూత్రధారి జహ్రాన్ హాసిమ్?

ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాది జహ్రాన్ హాసిమ్‌ను శ్రీలంక వరుస పేలుళ్ల సూత్రధారిగా అనుమానిస్తున్నారు. మంగళవారం రాత్రి ఐఎస్ అధికారిక న్యూస్ ఏజెన్సీ అమాఖ్ విడుదల చేసిన వీడియోలో జహ్రాన్ కనిపించాడు. ఇందులో 8 మంది నలుపు జెండా కింద నిలబడి ఐఎస్ వ్యవస్థాపకుడు అబూబకర్ అల్ బాగ్ధాదీకి విశ్వాసంగా ఉంటామన్నారు. ఇందులో ఏడుగురు ముసుగులో ఉండగా, ఒకరి ముఖమే కనిపించింది. అతడిని మహ్మద్ జహ్రాన్ హాసిమ్‌గా నిర్ధారించారు. అతడు శ్రీలంకలోని తూర్పుతీర ప్రాంత వాసి అని గుర్తించారు. జహ్రాన్ 2016 నుంచి తన ఫేస్‌బుక్ పేజీలో ఐఎస్ గురించి ప్రచారం చేస్తున్నాడు. అతడి కింద దాదాపు 200 మంది పనిచేస్తున్నట్టు సమాచారం.

జహ్రాన్ గురించి ముందే హెచ్చరించినా..

వరుస పేలుళ్లలో ఉన్నతాధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా బయటపడుతున్నది. పేలుళ్ల సూత్రధారిగా భావిస్తున్న జహ్రాన్ హాసిమ్ గురించి, తీవ్రవాద భావజాల ప్రచారం గురించి స్థానిక ముస్లిం మత సంస్థలతోపాటు భారత నిఘా వర్గాలు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని తేలింది. భారత్‌లోని పలువురు ప్రముఖ నేతలు, హిందూ సంస్థల ముఖ్య నేతలను హత్యచేసేందుకు ఐఎస్ కుట్ర పన్నిందన్న సమాచారం మేరకు ఎన్‌ఐఏ అధికారులు గత ఏడాది కోయంబత్తూరులో కొందరు యువకులను అరెస్టు చేశారు. వీరి నుంచి జప్తు చేసిన వీడియోల్లో జహ్రాన్ హాసిమ్ కనిపించాడు. శ్రీలంక, తమిళనాడు, కేరళ నుంచి తనకు కొందరు యువకులు కావాలని, వారితో ఐఎస్ సామ్రాజ్యాన్ని విస్తరిస్తామని అతడు చెప్పాడు. లోతుగా దర్యాప్తు చేసిన అనంతరం.. జహ్రాన్ నేతృత్వంలో శ్రీలంకలో చర్చిలు, భారత హైకమిషనరేట్‌పై ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందంటూ 3 పేజీల నివేదికను శ్రీలంక ఉన్నతాధికారులకు పంపారు. అదేవిధంగా శ్రీలంకలోని పలు ముస్లిం సంస్థలు సైతం జహ్రాన్ కార్యకలాపాల గురించి హెచ్చరించారు. అప్పుడే జహ్రాన్‌ను అరెస్ట్ చేసి ఉంటే నరమేధాన్ని అడ్డుకునేవారని పేర్కొన్నారు.

2513
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles