కుంచించుకుపోతున్న చందమామ!

Wed,May 15, 2019 02:20 AM

The Moon Is Shrinking Wrinkling Due To Earthquakes

- ఇప్పటివరకు 150 అడుగుల మేర తగ్గిన వైశాల్యం
- అంతర్గత శీతల పరిస్థితులే కారణం
- ఫలితంగా ఉపరితలంపై పగుళ్లు, ముడుతలు, ప్రకంపనలు
- వెల్లడించిన నాసా శాస్త్రవేత్తలు


వాషింగ్టన్: చంద్రుడు రానురాను కుంచించుకుపోతున్నాడట. అంతర్గతంగా ఉన్న శీతల పరిస్థితుల వల్ల చందమామ వైశాల్యం క్రమంగా తగ్గుతున్నదని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) ప్రకటించింది. గడిచిన కొన్ని కోట్ల ఏండ్ల కాలంలో దాదాపు 150 అడుగుల మేర (50 మీటర్లు) కుంచించుకుపోయినట్టు వెల్లడించింది. ఫలితంగా చంద్రుడి ఉపరితలంపై ముడుతలు, పగుళ్లు, ప్రకంపనలు ఏర్పడుతున్నాయని పేర్కొన్నది. ద్రాక్ష పండు ఎండిపోతున్నప్పుడు చర్మం ఎలా మారుతుందో.. చంద్రుడి ఉపరితలం అదేవిధంగా రూపాంతరం చెందుతున్నదని వివరించింది. చంద్రుడిపై పరిశోధనల కోసం నాసా పంపిన ల్యూనార్ రికాన్నైస్సన్స్ ఆర్బిటర్ (ఎల్‌ఆర్వో) ఎయిర్‌క్రాఫ్ట్ అందించిన 12 వేల ఫొటోలను, అపోలో మిషన్లలో భాగంగా చంద్రుడిపై బిగించిన సిస్మోమీటర్లు అందించిన సమాచారాన్ని శాస్త్రవేత్తలు విశ్లేషించి ఈ నిర్ధారణకు వచ్చారు. ఉత్తర ధ్రువం కుంచించుకుపోయినట్టు గుర్తించారు. ఈ ప్రాంతంలో ఉపరితలంపై పగుళ్లు ఏర్పడుతున్నాయని, మార్పులు చెందుతున్నదని నిర్ధారించారు.
moon1

ఎలా గుర్తించారు?

నాసా శాస్త్రవేత్తలు ఎల్‌ఆర్వో పంపిన ఫొటోలు, గతంలో సిస్మోమీటర్లు అందించిన సమాచారాన్ని కలిపి విశ్లేషించారు. 1969 నుంచి 1977 వరకు నాసా చంద్రుడిపైకి చేపట్టిన అపోలో -11,12,14,15,16 మిషన్‌లో భాగంగా వ్యోమగాములు ఉపరితలంపై వేర్వేరు ప్రాంతాల్లో ఐదు సిస్మోమీటర్లను బిగించారు. ఇవి జాబిల్లి ఉపరితలంపై ఏర్పడే ప్రకంపనలను గుర్తించాయి. మొదటి సిస్మోమీటర్ మూడువారాలు మాత్రమే పనిచేసింది. మిగతా నాలుగు సిస్మోమీటర్లు మొత్తం 28 ప్రకంపనలను నమోదు చేశాయి. నాసా శాస్త్రవేత్తలు ఇప్పుడు ఆ సమాచారాన్ని విశ్లేషించి వాటి తీవ్రత రిక్టర్ స్కేలుపై 5-8 మధ్య నమోదైందని గుర్తించారు. ఎనిమిది ప్రకంపనల కేంద్రాలు 30 కి.మీ. పరిధిలోనే ఉన్నట్టు నిర్ధారించారు. ఈ ప్రకంపనల సమయంలో ఉపరితల పొరల్లో మార్పులు జరిగాయి. ఎల్‌ఆర్వో ఎయిర్ క్రాఫ్ట్‌లోని ద ల్యూనార్ రికాన్నైస్సన్స్ ఆర్బిటర్ కెమెరా (ఎల్‌ఆర్వోసీ) తీసిన చిత్రాలను విశ్లేషించగా ఈ విషయం బయటపడిందని శాస్త్రవేత్తలు తెలిపారు.

మొత్తం 3,500 చిత్రాల్లో ఈ మార్పులు గుర్తించామని, కొన్నిచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయని చెప్పారు. ఇది అద్భుతం. 50 ఏండ్ల కిందట సిస్మోమీటర్లు అందించిన సమాచారం, ఇప్పుడు ఎల్‌ఆర్వో పంపిన సమాచారం కలిపి చూస్తే చంద్రుడి ఉపరితలంలో జరిగిన మార్పులను గుర్తించగలిగాం. కోట్ల ఏండ్లుగా సూర్యుడు, అంతరిక్షం నుంచి వెలువడే రేడియేషన్‌ను గ్రహించడం వల్ల చంద్రుడి శీతల ప్రాతంలో ఉన్న ఉపరితలం మొత్తం నలుపురంగులోకి మారిపోయింది. ఇటీవలి ప్రకంపనల వల్ల కొండచరియలు విరిగిపడినప్పుడు కింది పొరలు బహిర్గతమయ్యాయి. ఈ ప్రాంతం నుంచి కాంతి పరావర్తనం చెందుతున్నది. సిస్మోమీటర్లు పంపిన ప్రకంపనల ప్రాంతాలను ఎల్‌ఆర్వో పంపిన చిత్రాల్లో పోల్చిచూడగా.. వెలుగుమచ్చలు కనిపించాయి. చంద్రుడిపై తీవ్ర ప్రకంపనలు ఏర్పడుతున్నాయని అనడానికి ఇదే నిదర్శనం అని పరిశోధక బృంద సభ్యుడు జాన్ కెల్లర్ వివరించారు. భవిష్యత్తులో చేపట్టబోయే ప్రయోగాలకు ఈ సమాచారం ఉపయోగపడుతుందన్నారు.
moon2

ఎలా మార్పు చెందుతున్నది?

భూమి మాదిరిగా చంద్రుడిపై టెక్టానిక్ ప్లేట్లు ఉండవు. 450 కోట్ల ఏండ్ల కిందట చంద్రుడు ఏర్పడినప్పుడు ఈ ప్లేట్ల ఏర్పాటు ప్రారంభమైనా.. ఉష్ణోగ్రతలను కోల్పోవడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. అప్పటినుంచి ద్రాక్షపండు పైపొర, దాని కింది గుజ్జు మాదిరిగానే చంద్రుడి ఉపరితలం, లోపలి పొరలు పెళుసుగా ఉన్నాయి. కొన్నేండ్ల తర్వాత అంతర్గతంగా అత్యంత శీతల పరిస్థితులు ఉండటంతో, లోపలి పొరలు మెల్లిగా కుంచించుకుపోవడం ప్రారంభించాయి. ఈ క్రమంలో లోపలి పొరల్లోని పదార్థంలో కొంతభాగం ఉపరితలంవైపు చొచ్చుకొస్తున్నది. ఫలితంగా పైపొరపై ఒత్తిడి పెరిగి పగుళ్లు రావడంతోపాటు ముడుతలు ఏర్పడుతున్నాయి. ఈ సమయంలో భూకంపాల మాదిరిగా తరుచూ ప్రకంపనలు ఏర్పడుతున్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతున్నదని శాస్త్రవేత్తల బృంద సభ్యుడు థామస్ వాటర్స్ తెలిపారు.

684
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles