ప్రతిపక్షం పతనానికి పది కారణాలు


Fri,May 24, 2019 03:51 AM

10 reasons to downfall for opposition partys

న్యూఢిల్లీ, మే 23: బీజేపీ అగ్రనేతలు ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా ద్వయం మరోసారి తమ ప్రత్యర్థులను దెబ్బతీశారు. క్రితంసారి (2014) ఎన్నికల కంటే ఈసారి వారు తమ పార్టీ సీట్ల సంఖ్యను మరింత పెంచుకున్నారు. బీజేపీ ఇంతటి ఘన విజయాన్ని సాధించడానికి, ప్రతిపక్షాలు చతికిలబడటానికి విశ్లేషకులు పలు కారణాలను పేర్కొంటున్నారు. వీటిలో పది ముఖ్యమైనవి..

1 ప్రధాని అభ్యర్థి లేకపోవటం

ప్రధాని పదవికి నరేంద్రమోదీని ఎదుర్కోగల తగిన వ్యక్తి ప్రతిపక్షాలకు కరువయ్యాడు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అభ్యర్థిత్వాన్ని ఒకరిద్దరు మాత్రమే ఆమోదించారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి, మాజీ ప్రధాని దేవెగౌడ, ఎన్సీపీ నాయకుడు శరద్‌పవార్ వంటి నేతలందరూ మేము సైతం అంటూ ప్రధాని అభ్యర్థిత్వానికి పోటీ పడ్డారు.

2 చమురు-నీరులా విపక్షాలు

గతేడాది కర్ణాటక సీఎంగా కుమారస్వామి ప్రమాణం కార్యక్రమంలో విపక్ష నేతలలు ఒకే వేదికను పంచుకున్న ప్రతిపక్షాలు గత మార్చిలో ఎన్నికల ప్రకటన నాటికి దూరమయ్యాయి. యూపీలో ఎస్పీ-బీఎస్పీ కాంగ్రెస్‌ను దూరం పెట్టాయి. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు పరస్పరం పోటీకి దిగాయి. దీంతో విపక్షాల కూటమిని ప్రధాని మోదీ మహాకల్తీ కూటమి అని ప్రతిపక్ష పార్టీలు చమురు, నీరు వంటివని ఎద్దేవా చేశారు.

3 న్యాయ్‌ఆలస్యం

న్యాయ్ కింద దేశంలోని 20 శాతం పేద కుటుంబాలకు నెలకు రూ.6వేల చొప్పున రాహుల్‌గాంధీ చేసిన ప్రకటన ఓటర్లందరికీ చేరలేదు. అసలు ఆ ప్రకటనే ఆలస్యంగా వెలువడింది. తొలి విడుత ఎన్నికలు జరుగడానికి కొద్ది రోజుల ముందు మార్చి చివరి వారిలో రాహుల్ ఆ ప్రకటన చేశారు.

4 ప్రతికూల రాజకీయాలు

అధికారంలోకి వస్తే ఏం చే స్తారో చెప్పకుండా.. అధికార పక్షంపై దుమ్మెత్తిపోయడ మూ విపక్షాల పతనానికో కారణమని పరిశీలకులు భావిస్తున్నారు. విపక్ష నేతలు ప్రధాని మోదీపై వ్యక్తిగత దూషణలకు దిగడం బెడిసికొట్టింది. చౌకీదార్ చోర్ హై అంటూ రాఫెల్ ఒప్పందంలో ప్రధాని అవినీతికి పాల్పడ్డారన్న రాహుల్‌గాంధీ ప్రచారాన్ని ప్రజలు తిరస్కరించారు. a

5 మహిళలు నిర్ణయాత్మకం

మోదీ విజయంలో మహిళ లు నిర్ణయాత్మక పాత్ర పో షించినట్టు తెలుస్తున్నది. స్వ చ్ఛ భారత్ మిషన్ కింద మ రుగుదొడ్ల నిర్మాణం, ఉజ్వల యోజన కింద ఎల్పీజీ సిలిండర్ల పంపిణీ మహిళలను ఆకట్టుకుంది. ట్రిపుల్ తలాక్ తొలిగిస్తానంటూ మోదీ ముస్లిం మహిళలను ఆకర్షించారు. దీనిపై బిల్లు ఆమోదం పొందకున్నా ఆర్డినెన్స్ తో బీజేపీ తమ సంకల్పాన్ని చాటుకుంది.

6 జాతీయ భద్రత

పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా ఐఏఎఫ్ పాకిస్థాన్‌లోని బాలాకోట్‌పై జరిపిన దాడులు.. అంతకుముందు యురి ఉగ్రదాడికి ప్రతీకారంగా జరిపిన లక్షిత దాడులనూ బీజేపీ ఓటర్లకు గుర్తు చేసింది. తమ పాలనలో కశ్మీర్ మినహా దేశంలో ఎక్కడా ఉగ్రదాడులు జరుగలేదని మోదీ పలుమార్లు ఓటర్లకు గుర్తు చేశారు.

7 అభివృద్ధి

బీజేపీ నేతలు కేవలం బాలాకోట్, లక్షిత దాడుల గురించే కాక ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలనూ తమ ప్రచారం చేశారు. మరుగుదొడ్ల నిర్మాణం, గ్యాస్ సిలిండర్ల పంపిణీ, ఇండ్లకు విద్యుత్ కనక్షన్లు, ఇండ్ల నిర్మాణం, ఆయుష్మాన్ భారత్, జన్‌ధన్ ఖాతాలు తదితరమైన వాటిని వారు గుర్తు చేశారు.

8 కూటములు

కూటముల ఏర్పాటు, మిత్ర పక్షాల మధ్య సీట్ల పంపకాల్లో బీజేపీ ముందున్నది. కాంగ్రెస్, ఇతర పార్టీలు చేతులు కలుపలేదు. కానీ బీజేపీ తన మిత్ర పక్షాల కోసం ఒక అడుగు వెనుకడుగేసేందుకూ వెనుకాడలేదు. బీహార్‌లో గత ఎన్నికల్లో జేడీయూ రెండు సీట్లే గెలిచినా ఈసారి ఆ పార్టీకి బీజేపీ17 సీట్లిచ్చింది.

9 కొరవడిన వ్యూహం

ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాలలో ఒకవేళ సీట్లు కోల్పోతే ఆ లోటును ఈశాన్య రాష్ర్టాలు, తూర్పు రాష్ర్టాలైన పశ్చిమ బెంగాల్, ఒడిశాలో భర్తీ చేసుకొనేందుకు బీజేపీ ఒక వ్యూహాన్ని రచించింది. ఈ రాష్ర్టాల్లోనూ బీజేపీకి ఎక్కడా చెప్పుకోదగిన రీతిలో నష్టం జరుగలేదు.

10 హిందుత్వ.. కుల సమీకరణలు

హిందూత్వ తన చేతికి కంకణంలా కట్టుకున్న మోదీ.. హిందూ మత పక్షపాతిననేందుకు వెనుకాడలేదు. కుంభమేళా, గంగా హారతి వంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముస్లిం లు అధికంగా ఉన్న వయనాడ్ నుంచి పోటీ చేస్తున్నారని రాహుల్‌ను ఎద్దేవా చేశారు.

3134
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles