ముంబైలో కుప్పకూలిన వంతెన


Fri,March 15, 2019 04:19 AM

5 dead after footbridge collapses at Mumbais CST

-ఐదుగురి మృతి
-రెడ్ సిగ్నల్ పడటంతో వాహనదారులకు తప్పిన ముప్పు
-36 మందికి గాయాలు
-ముంబై సీఎస్టీ రైల్వే స్టేషన్‌లో దుర్ఘటన
-ప్రధాని మోదీ, సీఎం ఫడ్నవీస్ సంతాపం
-రెడ్ సిగ్నల్ పడటంతో వాహనదారులకు తప్పిన ముప్పు

ముంబై, మార్చి 14: ముంబైలో మరోసారి పాదచారుల వంతెన కుప్పకూలింది. చరిత్రాత్మక ఛత్రపతి శివాజీ టెర్మినస్ (సీఎస్టీ) రైల్వే స్టేషన్ వద్ద గురువారం సాయంత్రం జరిగిన ఘోర ప్రమాదంలో ముగ్గురు మహిళలు సహా ఐదుగురు మృతి చెందగా 36 మంది గాయపడ్డారు. సాయంత్రం 7.30 గంటల సమయంలో రద్దీ వేళ ఈ ప్రమాదం జరుగడంతో బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంది. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని దవాఖానలకు తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. సీఎస్టీ రైల్వేస్టేషన్ మొదటి ప్లాట్‌ఫాంకు ఉత్తర దిశలో ఉన్న పాదచారుల వంతెనలో ప్రధాన భాగం ఒక్కసారిగా కుప్పకూలిందని ముంబై పోలీసులు ట్విట్టర్ ద్వారా తెలిపారు. ప్రయాణికులు వంతెనపై వెళుతుండగా, దాదాపు 30 అడుగుల మేర గచ్చు ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో దాని పై నడుస్తున్న వారందరూ 20 అడుగుల ఎత్తు నుంచి కింద పడిపోయారు. వంతెన కింద నుంచి వెళుతున్న ద్విచక్ర వాహనదారులు కూడా ఈ ఘటనలో గాయపడ్డారు.

ప్రమాదం జరిగినప్పుడు వంతెనకు సమీపంలోని ఒక చౌరస్తాలో రెడ్ సిగ్నల్ పడిందని దీంతో వందల సంఖ్యలో వాహనాలు ఆగిపోయాయని, లేకపోతే వారిలో చాలామంది బ్రిడ్జి కింద నలిగిపోయేవారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. కసబ్ బ్రిడ్జ్‌గా పేరున్న ఆ వంతెనకు ఉదయం మరమ్మతులు జరుగుతుండగానే.. ప్రయాణికులను దానిపై నుండి వెళ్లేందుకు అనుమతించారని మరికొందరు తెలిపారు. నగర మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) 1980లో ఆజాద్ మైదాన్ పోలీస్‌స్టేషన్ నుంచి సీఎస్టీ టెర్మినస్ వరకు ఈ వంతెనను నిర్మించింది. ప్రయాణికులు స్టేషన్ వెలుపల నుంచి నేరుగా ప్లాట్‌ఫాం వద్దకు చేరుకునేందుకు ఈ వంతెనలను నిర్మించారు. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బంది అక్కడికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని విపత్తు సహాయ దళం అధికారి చెప్పారు. ముంబైలో 26/11 ఉగ్రదాడి జరిగినప్పుడు ఉగ్రవాది అజ్మల్ కసబ్ ఈ వంతెనపై నుంచి నడుచుకుంటూ వెళ్లడంతో దానికి కసబ్ బ్రిడ్జి అని పేరు వచ్చింది.

mumbai-bridge2

ప్రధాని మోదీ సహా పలువురి సంతాపం

వంతెన కూలిన ప్రమాదంలో ప్రాణ నష్టం జరుగడం పట్ల తీవ్ర ఆవేదనకు గురైనట్టు ప్రధాని మోదీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మృతు ల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం చెల్లించనున్నట్టు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ప్రకటించారు. ప్రమాదంపై బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

959
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles