50 శాతం వీవీప్యాట్‌లు లెక్కించాల్సిందే


Mon,April 15, 2019 01:58 AM

50 per cent of vv pats should calculate

-దీనిపై మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం
-ఢిల్లీలో సంయుక్త సమావేశంలో విపక్షాల వెల్లడి

న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యం త్రాలపై (ఈవీఎంలపై) విపక్షాలు మరోసారి గళమెత్తాయి. పోలైన ఓట్లలో కనీసం 50 శాతం ఓట్లను వీవీప్యాట్ స్లిప్పులతో సరిచూడాల్సిందేనని డిమాండ్ చేశాయి. ఈ విషయమై మరోసారి సుప్రీంకోర్టు తలుపు తడతామని వెల్లడించాయి. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, ప్రజాస్వామ్య పరిరక్షణపై కాంగ్రెస్, టీడీపీ, ఎస్పీ, సీపీఐ, సీపీఎం, ఆప్ తదితర విపక్షాలు ఆదివారం ఢిల్లీలో సంయుక్త మీడియా సమావేశం నిర్వహించాయి. లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు బీజేపీ ఈవీఎంలను ప్రోగ్రామింగ్ చేసిందని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. మరోవైపు 50 శాతం వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని 21 రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్న విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గుర్తు చేశారు.

ఈవీఎంలు పనిచేయకపోవడంపై ఆయన శనివారం కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి సునీల్ అరోరాను కలిసిన విషయం తెలిసిందే. ఈనెల 18న రెండో దశ లోక్‌సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో విపక్షాలు ఈవీఎంలపై స్వరం పెంచడం గమనార్హం. ఈ నెల 11న తొలి విడుత ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. వీవీప్యాట్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు గత సోమవారం ఎన్నికల సంఘానికి కీలక ఆదేశాలిచ్చింది. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌కు ఒక పోలింగ్ బూత్‌కు బదులుగా ఐదు పోలింగ్ బూత్‌లలో వీవీప్యాట్లను లెక్కించాలని ఆదేశించింది. వీవీప్యాట్ యంత్రాల ద్వారా ఓటర్లు తాము అనుకున్న అభ్యర్థికి తమ ఓటు పడిందా లేదా అనేది నిర్ధారించుకోవచ్చు.

బీజేపీ ప్రోగ్రామింగ్ చేసింది: కేజ్రీవాల్

సమావేశం అనంతరం ఆప్ అధినేత కేజ్రీవాల్ విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలుపొందేందుకు ఈవీఎంలను బీజేపీ ప్రోగ్రామింగ్ చేసిందని ఆరోపించారు. ఈవీఎంలపైనా, ఎన్నికల ప్రక్రియపైనా ప్రజలు విశ్వాసం కోల్పోతున్నారని పేర్కొన్నారు. ఈ యంత్రాల్లో అక్రమాల ద్వారా లబ్ధిపొందుతున్న బీజేపీ మినహా ఇతర పార్టీలన్నీ కనీసం 50 శాతం వీవీప్యాట్ల లెక్కించాలని కోరుతున్నాయని చెప్పారు. ఈవీఎంలపై ఫిర్యాదులను ఈసీ విస్మరిస్తున్నదని ఆరోపించారు. ఈవీఎంలలో ఏ బటన్ నొక్కినా బీజేపీకి వెళ్తున్నదని, ఈ తేడాలపై ఈసీ ఎందుకు విచారణ చేపట్టడం లేదన్నారు.

జాతీయ స్థాయి ఉద్యమం: అభిషేక్ సింఘ్వీ

కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వీ మాట్లాడుతూ.. 50 శాతం వీవీప్యాట్ల లెక్కింపు విషయమై విపక్షాలన్నీ సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్లు చెప్పారు. ఈవీఎంలలో అవకతవకలపై జాతీయ స్థాయి ఉద్యమం ప్రారంభిస్తామని, సమస్య పరిష్కారానికి ఈసీ తగిన చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. తొలి విడుత ఎన్నికల తర్వాత ఈవీఎంలపై అనేక ప్రశ్నలు తలెత్తాయి. అయితే వీటిపై ఈసీ తగిన దృష్టి పెడుతున్నదని మేం అనుకోవడం లేదు. మీరు ఎక్స్ పార్టీకి ఓటేస్తే, వై పార్టీకి ఓటు వెళ్తున్నది. ఏడు సెకండ్లు కాకుండా కేవలం మూడు సెకండ్లే వీవీప్యాట్ దర్శనమిస్తున్నది అని ఆయన పేర్కొన్నారు.

ఈసీ ఎందుకు వ్యతిరేకిస్తున్నది: కపిల్ సిబల్

ఈ సమస్యను ఈసీ విమర్శిస్తే.. మేం ఇతర మార్గాలు అనుసరిస్తాం. చూస్తూ ఊరుకోబోం. సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం అని సీనియర్ న్యాయవాది, కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ వ్యాఖ్యానించారు. 50 శాతం వీవీప్యాట్లు లెక్కించేందుకు ఈసీ ఎందుకు వెనకడుగు వేస్తున్నదని ప్రశ్నించారు. 20 నుంచి 25 శాతం ఈవీఎంలు సరిగా పనిచేయడం లేదని, తెల్లవారుజామున 4 గంటల వరకు కూడా ఓటేసేందుకు ప్రజలు క్యూలో నిల్చోవాల్సి వచ్చిందంటే దానర్థమేమిటని నిలదీశారు. ఈసీ ఉద్దేశాలపై సందేహాలు లేవనెత్తుతూ.. ఒకవేళ ఓటర్లకు బదులుగా ఓటింగ్ యంత్రాలకు ఈసీ మద్దతుగా నిలిస్తే అది అత్యంత దురదృష్టకరమవుతుందని వ్యాఖ్యానించారు.

ఓటమికి సాకులు వెతికే ప్రయత్నమే..: బీజేపీ

ఈవీఎంలపై విపక్షాలు ఢిల్లీలో సంయుక్త సమావేశం నిర్వహించడంపై బీజేపీ విమర్శలు గుప్పించింది. ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోతామని తెలిసి, విపక్షాలు ఓటమికి సాకులు వెతికే ప్రయత్నాలు చేస్తున్నాయని ఎద్దేవా చేసింది. ఢిల్లీలో నిర్వహించిన అన్ని పార్టీల సమావేశం.. ఓటమిని అంగీకరించడానికి తప్ప మరేమీ కాదు. ఘోరంగా ఓడిపోతామని తెలిసి సాకులు వెతికే ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీకి సవాల్‌గా నిలవడంలోనే కాదు ప్రతిపక్ష పాత్ర పోషించడంలోనూ గత ఐదేండ్లలో ఘోరంగా విఫలమయ్యారు అని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యానించారు.

ఆ జాబితాలో ఈవీఎం దొంగ పేరు లేదు: ఈసీ

ఈవీఎంలపై టీడీపీ, ఎన్నికల సంఘం మధ్య పోరు కొనసాగుతున్నది. ఈవీఎంల విషయమై ఏపీ సీఎం చంద్రబాబు బృందం శనివారం తమతో సమావేశమైనప్పుడు.. ఆ పార్టీ అందజేసిన ప్రతినిధుల బృందంలో ఈవీఎం చోరీ కేసులో 2010లో అరెస్టయిన పార్టీ టెక్నికల్ అడ్వైజర్ హరిప్రసాద్ పేరులేదని ఎన్నికల సంఘం తెలిపింది. ఈ విషయాన్ని ఎత్తిచూపుతూ ఆదివారం టీడీపీకి ఈసీ లేఖ రాసింది. సమావేశం సందర్భంగా, డిప్యూటీ ఎన్నికల కమిషనర్ సుదీప్ జైన్, సాంకేతిక నిపుణుల కమిటీ చైర్మన్ సహానీతో చర్చకు రావాలని హరిప్రసాద్‌ను ఎన్నికల ప్రధానాధికారి ఆహ్వానించారని, అయితే ప్రసాద్ పూర్వచరిత్ర తమకు తర్వా త తెలిసిందని టీడీపీ లీగల్ సెల్ చీఫ్‌కు రాసి న లేఖలో ఈసీ పేర్కొంది. ఇలాంటి నేపథ్యంలేని మరో నిపుణుడిని పంపాలన్నది.

విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారు: టీడీపీ

హరిప్రసాద్‌ను అడ్డుకోవడం ద్వారా ఎన్నికల సంఘం ఈవీఎంలు పనిచేయని విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నదని టీడీపీ ఆదివారం ఆరోపించింది. గత తొమ్మిదేండ్లలో ప్రసాద్‌పై ఎలాంటి చార్జిషీట్ నమోదు కాలేదని టీడీపీ పేర్కొంది. 2011 జూలై 21న ఢిల్లీలో వీవీప్యాట్లను ప్రయోగాత్మకంగా పరిశీలించినప్పుడు హరిప్రసాద్‌ను ఈసీ ఆహ్వానించిందని గుర్తుచేసింది. విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించింది.

848
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles