ఉగ్రభూతం అంతమెప్పుడు?


Thu,September 12, 2019 03:30 AM

9/11 Remembering Those Lost 18 Years Ago

- 9/11 దాడులకు 18 ఏండ్లు పూర్తి
- నాటి ఘటన తర్వాత పెరిగిన ఉగ్రదాడులు
- 2014 నుంచి తగ్గుముఖం


వాషింగ్టన్: సరిగ్గా 18 ఏండ్ల కిందట.. సెప్టెంబర్ 11న అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌కు చెందిన ట్విన్ టవర్లపై జరిగిన ఉగ్రదాడి నేటికీ మన జ్ఞాపకాల నుంచి చెరిగిపోలేదు. ఈ దాడిలో సుమారు మూడు వేలమంది ప్రాణాలు కోల్పోయారు. ఆరు వేల మందికిపైగా గాయపడ్డారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఉగ్రదాడిగా ఇది చరిత్రలో నిలిచిపోయింది. 9/11 దాడులకు 18 ఏండ్లు పూర్తయిన నేపథ్యంలో.. పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు మనం సురక్షిత ప్రపంచంలోనే నివసిస్తున్నామా? ఉగ్ర ఘటనలు తగ్గాయా?.. ఉగ్రదాడులకు సంబంధించిన అంతర్జాతీయ గణాంకాలను పరిశీలిస్తే కాదు అనే సమాధానం వస్తుంది. గ్లోబల్ టెర్రర్ డేటాబేస్ (జీటీడీ) గణాంకాల ప్రకా రం.. 1970-2017 మధ్య ప్రపంచవ్యాప్తం గా 1,81,691 ఉగ్రదాడులు జరగ్గా, 59.7 శాతం 9/11 దాడుల తర్వాతే చోటుచేసుకున్నాయి. 2001 సెప్టెంబర్ 12-2017 డిసెంబర్ 31 మధ్య సగటున రోజుకు 19 ఉగ్రదాడులు జరిగాయి. 9/11 దాడులకు 31 ఏండ్లముందు (1971-2000 మధ్య) సగటున రోజుకు ఆరు ఉగ్రదాడులు జరిగాయి. 2001లో ప్రపంచవ్యాప్తంగా 1906 ఉగ్ర దాడులు చోటుచేసుకోగా, 2008 నాటికి 4,805కు పెరిగింది. 2014లో అత్యధికంగా 16,903 ఉగ్రదాడులు జరిగాయి. అయితే 2014-17 మధ్య కాస్త తగ్గాయి. 2015లో 14,694, 2016లో 13,592, 2017లో 10,897 ఉగ్రదాడులు జరిగాయి.
Twin-Towers1

పెరిగిన ప్రాణనష్టం

జీటీడీ గణాంకాల ప్రకారం.. 9/11 దాడుల తర్వాత చోటుచేసుకున్న ఉగ్రదాడుల్లో ప్రాణనష్టం భారీగా పెరిగింది. 1970-2017 మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా ఉగ్ర సంబంధిత ఘటనల్లో 4,11,868 మంది ప్రాణాలు కోల్పోయారు. 9/11 దాడులకు ముందు ఉగ్రవాదం కారణంగా సగటున రోజుకు 13 మంది ప్రాణాలు కోల్పోగా, 9/11 దాడుల తర్వాత సగటున రోజుకు 45 మంది మృత్యువాతపడడం గమనార్హం.

అమెరికా పరిస్థితి ఏంటి?

రెండో ప్రపంచ యుద్ధంలో పెరల్ హార్బర్‌పై జపాన్ దాడి తర్వాత అమెరికాలో చోటుచేసుకున్న అతిపెద్ద దాడులు 9/11 ఘటనే. 2001 తర్వాత అమెరికాలో అంత భారీస్థాయిలో మరే దాడీ జరుగలేదు. 1970-2017 మధ్య ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకున్న ఉగ్రదాడుల్లో 5,391 మంది అమెరికా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ మరణాలను 9/11 దాడులకు ముందు, తర్వాతగా విభజిస్తే.. 79 శాతం మరణాలు 9/11 దాడులకు ముందే సంభవించడం గమనార్హం. 9/11 ఉగ్రదాడుల అనంతరం ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలు యుద్ధం ప్రకటించినా.. ఉగ్రదాడులు, వాటిలో సంభవిస్తున్న ప్రాణనష్టం ప్రమాదకర స్థాయిలో పెరుగడం ఆందోళన కలిగిస్తున్నది.
Twin-Towers2

పాశ్చాత్య దేశాలపై దాడులు చేయండి

- ముస్లింలకు అల్‌ఖైదా అధిపతి జవహరి పిలుపు
కైరో/వాషింగ్టన్: అమెరికా, యూరోపియన్ యూనియన్, ఇజ్రాయెల్, రష్యాలపై దాడులకు పూనుకోవాలని ముస్లింలకు అల్‌ఖైదా అధిపతి ఆయ్మన్ అల్ జవ్‌హరి పిలుపునిచ్చాడు. 9/11 ఉగ్రదాడికి 18 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇస్లాం వ్యతిరేకులపై పోరాడాలంటే తూర్పు నుంచి పశ్చిమం వరకు ప్రపంచ వ్యాప్తంగా అమెరికా మిలిటరీ స్థావరాలను లక్ష్యంగా చేసుకోవాలన్నారు.
ayman

తాలిబన్లకు భారీ నష్టం ఖాయం: ట్రంప్

తాలిబన్లకు గతంలో ఎన్నడు లేనంత భారీ నష్టాన్ని కలుగజేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. 9/11 దాడుల సంస్మరణలో భాగంగా పెంటగాన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ 2001లో ఉగ్రవాదులు తమ బలాన్ని చాటేందుకు ఈ దాడులు చేశారని, కానీ అది వారి బలహీనతను బయటపెట్టిందన్నారు. మళ్లీ అమెరికా గడ్డపై ఉగ్రవాదులు దాడి చేస్తే.. గతంలో ఎన్నడు లేని విధంగా ప్రతిస్పందిస్తామన్నారు.

1162
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles