అబ్దుల్లాలు, ముఫ్తీలతో కశ్మీర్ సర్వనాశనం


Mon,April 15, 2019 02:02 AM

Abdullah family and Mufti family destroyed lives of 3 generations of J and K

-ఆ రెండు పార్టీలను అంతమొందిస్తేనే కశ్మీర్ ప్రగతి సాధ్యం
-దేశ విభజనకు ఎన్సీ, పీడీపీ, కాంగ్రెస్ డిమాండ్ బట్టబయలు
-40 స్థానాలైన పోటీచేయని ఎస్పీ, బీఎస్పీ దేశానికి నూతన ప్రధానిని ఇస్తాయా
-కాంగ్రెస్ విషబీజాల వల్లే కశ్మీరీ పండిట్ల వలసలు..
-అధికారం ఆ పార్టీకి పగటి కలే
-జమ్ముకశ్మీర్, ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో మోదీ విసుర్లు

కథువా/ అలీగఢ్, ఏప్రిల్ 14: ప్రధాని నరేంద్రమోదీ విపక్ష పార్టీల మహా కూటమిపై నిప్పులు చెరిగారు. జమ్ముకశ్మీర్‌ను నాశనం చేసిన అబ్దుల్లా, ముఫ్తీ కుటుంబాలను దేశాన్ని విభజించేందుకు అనుమతించబోనన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో 40 స్థానాలకైనా పోటీ చేయని ఎస్పీ, బీఎస్పీ దేశానికి నూతన ప్రధానిని అందిస్తాయా? అని నిలదీశారు. ఉద్ధంపూర్ నుంచి పోటీలో ఉన్న కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌కు మద్దతుగా ఆదివారం జమ్ముకశ్మీర్‌లోని కథువా, ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆలీగఢ్‌లో బీజేపీ అభ్యర్థి సతీశ్ కుమార్ గౌతంకు మద్దతుగా జరిగిన ఎన్నికల సభల్లో మోదీ మాట్లాడారు. కొంత మంది వ్యక్తుల చేతుల్లో కశ్మీరీలను కట్టుబానిసలుగా ఉండనివ్వబోనని ప్రతీన బూనారు. కశ్మీరీల భవిష్యత్ కోసం అబ్దుల్లా, ముఫ్తీ కుటుంబాలను ఓడించాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. వారు (నేషనల్ కాన్ఫరెన్స్ ఎన్సీ, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ - పీడీపీ) మనకు దో ప్రధాన్ (ఇద్దరు ప్రధానులు.. జమ్ముకశ్మీర్, భారత్‌లకు చెరో ప్రధాని) కావాలని బెదిరిస్తున్నారు. వారికి జమ్ముకశ్మీర్‌ను వారసత్వంగా రాసివ్వలేదని నేను స్పష్టం చేయదలుచుకున్నా. భారత్‌లో కశ్మీర్ అంతర్భాగం అని అన్నారు. ఉగ్రవాదం నుంచి విముక్తి ప్రసాదించాలని ప్రజలు కోరుకుంటూ ఉంటే.. విపక్షాల మహా కల్తీ కూటమి మోదీని తొలిగించాలని కోరుకుంటున్నదని పేర్కొన్నారు. కాంగ్రెస్, ఎన్సీ, పీడీపీలది పూర్తిగా కల్తీ కూటమి అని అభివర్ణించారు. భారత్ నుంచి కశ్మీర్‌ను విభజిస్తామని, ప్రత్యేక ప్రధాని కోసం రక్తపాతం కూడా జరుగుతుందని ఆ పార్టీలు హెచ్చరిస్తున్నాయన్నారు.

దేశాన్ని విభజించాలన్న కాంగ్రెస్, ఎన్సీ, పీడీపీల డిమాండ్ బహిర్గతమైందన్నారు. ప్రజల్లో విషబీజాలు నాటుతున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సైన్యం ఆత్మైస్థెర్యాన్ని దెబ్బ తీసేందుకు సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టం (ఏఎఫ్‌ఎస్పీఏ)ను తొలిగిస్తామని హామీ ఇచ్చిందన్నారు. బెదిరింపులతో కేంద్ర ప్రభుత్వాన్ని లొంగదీసుకునే రోజులు పోయాయి. పొరుగు దేశం (పాకిస్థాన్)లోకి వెళ్లి ఉగ్రవాదులను అంతమొందించి వారి మద్దతుదారులను బహిర్గతం చేసే నవ్య భారతం ఇది అని మోదీ చెప్పారు. అణ్వస్ర్తాల సామర్థ్యంతో భారత్‌ను బెదిరిస్తున్న పాక్‌ను తరిమి వేయాలా? వద్దా? అంటే ప్రజలు ఔనని సమాధానం ఇచ్చారు. తర్వాత ప్రధాని మోదీ పంజాబ్‌లో బీఆర్ అంబేద్కర్ ప్రసంగాన్ని గుర్తు చేస్తూ ప్రజాస్వామ్యానికి (రాజకీయ) వారసత్వం శత్రువు. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా ఓటేద్దాం అని పిలుపునిచ్చారు. జలియన్ వాలాబాగ్ స్మారక కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి హాజరై నివాళులర్పిస్తే పంజాబ్‌లోని కాంగ్రెస్ సీఎం హాజరు కాలేదన్నారు. ఏండ్ల తరబడి సైన్యంలో కెప్టెన్‌గా పని చేసిన అమరీందర్‌సింగ్ దేశభక్తిని తాను శంకించడం లేదని, ఆయనపై గల ఒత్తిళ్లను అర్థం చేసుకోగలనన్నారు. 2016 లక్షిత దాడులు, బాలాకోట్‌లో వాయుసేన దాడులకు ఆధారాలు అడిగిన కాంగ్రెస్ పార్టీ ఏనాడూ సైన్యాన్ని విశ్వసించలేదన్నారు. కశ్మీరీ లోయ నుంచి పండిట్లు వలస వెళ్లడానికి కాంగ్రెస్ పార్టీ కారణం కాదా? అని ప్రశ్నించారు.

ఎస్పీ, బీఎస్పీ కుల రాజకీయాలకు చరమగీతం పాడుదాం

ఎస్పీ, బీఎస్పీల కుల రాజకీయాలకు చరమగీతం పాడుదామని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఉత్తర ప్రదేశ్‌లోని ఆలీగఢ్‌లో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. 2014లో తాము కుల రాజకీయాలను కోరుకోవడం లేదని ఓటర్లు తెలిపారు. 2017లోనూ అదే సందేశం ఇచ్చారు. కానీ నిజాన్ని వారు (ఎస్పీ, బీఎస్పీ) ఆమోదించలేదు అని ఎద్దేవా చేశారు. ఇంతకుముందు ఉత్తర యూపీలో అక్రమ కార్యకలాపాలు సాగడానికి ఈ రెండు పార్టీలదే బాధ్యత అన్నారు. ముజఫర్‌నగర్ దాడుల నిందితులను కాపాడుతున్న వారెవ్వరు? పశ్చిమ యూపీలోని రాజకీయ నేతల వైఖరిని ప్రజలు అర్ధం చేసుకున్నారు. కానీ మహా కూటమి వాస్తవాలకు దూరమైందన్నారు. మోదీని దుర్భాషలాడేందుకు ఏర్పాటైన కల్తీ (విపక్ష) కూటమికి తొలి దశ పోలింగ్‌తోనే వారు ఓడిపోతున్నారని అర్ధమైంది అని అన్నారు. బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే చాయ్‌వాలా ప్రధాని కాగలిగారని, అణగారిన వర్గాలకు చెందిన వ్యక్తి రాష్ట్రపతి, రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి ఉప రాష్ట్రపతి అయ్యారని మోదీ గుర్తు చేశారు.

771
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles