మోదీ నీచుడే!


Wed,May 15, 2019 01:56 AM

Abuses A Gift Says PM As Mani Shankar Aiyar Justifies Neech Slur

- 2017లో నేను చేసిన వ్యాఖ్యలు నిజమని ఇప్పుడు రుజువవుతున్నాయి
- మోదీ గురించి అప్పుడే ఊహించా
- దేశ చరిత్రలో ఆయనంతటి అబద్ధాలకోరు మరొకరు లేరు
- కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలు
- మండిపడ్డ బీజేపీ.. ఖండించిన కాంగ్రెస్


న్యూఢిల్లీ/సిమ్లా, మే 14: కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ మరోసారి వార్తల్లో నిలిచారు. 2017లో మోదీ నీచుడు అంటూ తాను చేసిన వ్యాఖ్యలను తాజాగా సమర్థించుకున్నారు. మోదీని అబద్ధాల గనిగా అభివర్ణించారు. అయ్యర్ ఇటీవల రైజింగ్ కశ్మీర్, ప్రింట్ పత్రికలకు రాసిన వ్యాసంలో ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలు మరోసారి దుమారం రేపాయి. అయ్యర్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడగా.. కాంగ్రెస్ మోదీపై ఎదురుదాడికి దిగింది. మణిశంకర్ తన వ్యాసంలో.. మోదీకి మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ అంటే ఎందుకు ఇష్టంలేదో నాకు తెలిసిపోయింది. నెహ్రూకు కేంబ్రిడ్జి యూనివర్సిటీ నుంచి సైన్స్‌లో డిగ్రీ పట్టా ఉంది. ఆయన ప్రజల్లో శాస్త్రీయ ధృక్పథాన్ని పెంచి మూఢనమ్మకాలను పారదోలాలని భావించారు. కానీ ప్రస్తుత ప్రధాని చదువు మధ్యలోనే ఆగిపోయింది. డిగ్రీ ఓసారి ఢిల్లీ వర్సిటీలో, మరోసారి గుజరాత్ వర్సిటీలో చేశానంటూ అబద్ధాలు చెప్తున్నారు. సాంకేతిక పరిజ్ఙానంపై కనీస అవగాహన లేకుండా మాట్లాడుతూ నవ్వులపాలవుతున్నారు. ఆయన మద్దతుదారులైతే ప్లాస్టిక్ సర్జరీ నుంచి ఎఫ్-16 (అత్యాధునిక యుద్ధ విమానం) వరకు ప్రతీ అంశాన్ని హిందుత్వానికి ముడిపెడుతున్నారు అని పేర్కొన్నారు.

బాలాకోట్ దాడి సమయంలో మేఘాలు ఉన్నప్పుడు దాడికి వెళ్తే పాకిస్థాన్ రాడార్లు గుర్తించలేవని మన సైనికులకు సలహా ఇచ్చానని ఇటీవల ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను అయ్యర్ ఉటంకించారు. ఇది మన వాయుసేన అధిపతికి, వీరసైనికులకు అవమానకరం. మేఘాలు అడ్డం వచ్చినంత మాత్రాన గుర్తించకపోవడానికి అవి టెలిస్కోప్‌లు కాదు.. రాడార్లు. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా రాడార్లు శత్రు విమానాలను గుర్తించగలవు అని విమర్శించారు. కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడి వాయుసేన అధిపతిని, సిబ్బందిని మోదీ తీవ్రంగా అవమానించారని మండిపడ్డారు. అమరుల త్యాగాలను ఓటు రాజకీయాల కోసం వినియోగిస్తున్నందుకు, తన అజ్ఞానపు వ్యాఖ్యలతో వాయుసేన పరువు తీసినందుకు మోదీ సిగ్గుపడాలని ధ్వజమెత్తారు. మోదీ భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద అబద్ధాల కోరు అని, జాతి వ్యతిరేకి అని ఆరోపించారు. 2017 డిసెంబర్ 7న తాను చేసిన వ్యాఖ్యలు (నీచపు వ్యక్తి) ఇప్పుడు నిజమవుతున్నాయని చెప్పారు. మోదీ గురించి తాను ముందే ఊహించానని చెప్తూ తననో ప్రవక్తగా మణిశంకర్ అయ్యర్ అభివర్ణించుకున్నారు. మరో పది రోజుల్లో బీజేపీ ప్రభుత్వం పడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు.

క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం: కాంగ్రెస్

మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలను తొలుత వ్యక్తిగతమని పేర్కొన్న కాంగ్రెస్‌పార్టీ ఆ తరువాత ఆ వ్యాఖ్యలను ఖండించింది. అయ్యర్‌పై తగిన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపింది. మరోవైపు రాహుల్‌గాంధీ, రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ద్వారా మోదీ ప్రధానమంత్రి పదవి పరువును దిగజార్చారని కాంగ్రెస్ మండిపడింది. ఇందుకు మోదీ సిగ్గుపడాలని ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా పేర్కొన్నారు.
gvl-narasimha-rao

ఇతరులను అవమానించడంలో ఘనుడివి: జీవీఎల్

అయ్యర్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు స్పందిస్తూ నువ్వు ఇతరులను అవమానించడంలో ఘనుడివి. 2017లో చేసిన వ్యాఖ్యలకు అప్పట్లో బహిరంగ క్షమాపణ చెప్పావ్. ఇప్పుడేమో నిన్ను నువ్వు ప్రవక్తగా చెప్పుకొంటున్నావు. మోదీ దేశభక్తి గురించి ప్రతి ఒక్కరికీ తెలుసు. పాకిస్థాన్‌కు వంతపాడే నువ్వు చెప్పాల్సిన పనిలేదు. నీ రాజభక్తి (సోనియాగాంధీ కుటుంబం పట్ల) గురించి అందరికీ తెలుసు అని ఘాటుగా ట్వీట్ చేశారు. గాంధీ కుటుంబ అంతరంగీకులు మోదీని విమర్శించడం సహజమేనన్నారు. మోదీపై వ్యాఖ్యలు చేసినందుకు మణిశంకర్ అయ్యర్‌ను గతంలో కాంగ్రెస్ సస్పెండ్ చేసిందని, కొన్నాళ్లకు మళ్లీ చేర్చుకున్నదని, ఇది కాంగ్రెస్ రెండు నాల్కల ధోరణికి నిదర్శనమని ఆరోపించారు. బీజేపీ ఐటీ విభాగాధిపతి అమిత్ మాలవీయ సైతం అయ్యర్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. శామ్ పిట్రోడా ఇటీవల సిక్కుల ఊచకోతపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి దేశం దృష్టిని తనవైపునకు తిప్పుకొంటున్నారని అయ్యర్ బాధపడుతున్నారు. అందుకే మోదీపై నోరుపారేసుకొని తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారు అని విమర్శించారు.

442
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles