అమిత్‌లో అద్వానీని చూస్తారా?


Mon,April 15, 2019 01:53 AM

Amit Shah to hold roadshow in Gandhinagar today

మొత్తం ఓటర్లు 17,33,972
దేశ రాజకీయాల్లో అత్యంత కీలకపాత్రను పోషిస్తున్న కొన్ని ముఖ్యమైన పార్లమెంట్ నియోజకవర్గాల్లో గుజరాత్‌లోని గాంధీనగర్ ఒకటి. ఈ నియోజకవర్గం పేరు చెబితేనే రాజకీయ అభిమానులకు బీజేపీ అగ్రనాయకుడు, లాల్‌కృష్ణ అద్వానీయే గుర్తుకువస్తారు. ఇది బీజేపీకి ఎంతగా చెక్కుచెదరని కంచుకోటనో ప్రత్యేకించి అద్వానీకి వ్యక్తిగతంగానూ అంతే పెట్టని స్థానం. ఈ సార్వత్రిక ఎన్నికల్లో అద్వానీకి ఈ స్థానాన్ని కేటాయించని బీజేపీ.. పార్టీ అధ్యక్షుడు అమిత్‌షాను ఇక్కడ్నించి
పోటీ చేయిస్తున్నది.


ఎలక్షన్ డెస్క్: భారతీయ జనతా పార్టీ ఒకనాటి అధికార పథ నిర్దేశకుడిగా లాల్‌కృష్ణ అద్వానీకి ఎనలేని పేరున్నది. ఈ నియోజకవర్గంలో తొలి ఎన్నికలు 1967లో జరగ్గా, అప్పుడు సోమచంద్రభాయ్ సోలంకి కాంగ్రెస్ తరఫున ఎన్నికయ్యారు. తర్వాతి ఎన్నికల్లో (1971)లోనూ ఆయనే గెలుపొందారు. 1977లో జనతా పార్టీకి చెందిన పురుషోత్తమ్ మావలంకార్ ఎన్నికయ్యారు. ఈయన మన దేశతొలి లోక్‌సభ స్పీకర్ గణేశ్ వాసుదేవ్ మావ్లంకార్ కుమారుడు. 1980 ఎన్నికల్లో పురుషోత్తమ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అమృత్ మోహన్‌లాల్ పటేల్ చేతిలో ఓడిపోయారు. 1984లో పటేల్ తిరిగి గెలుపొందగా, 1989లో బీజేపీ తొలిసారిగా ఇక్కడ విజయం సాధించింది. శంకర్‌సిన్హ్ వాఘేలా అప్పుడు గెలుపొందగా, ఆయన తర్వాత 1991లో ఎల్‌కే అద్వానీ తన విజయ పరంపరను మొదలుపెట్టారు. అయితే మధ్యలో 1996- 1998లో బీజేపీ నుంచే అటల్ బిహారీ వాజ్‌పేయి, విజయ్‌భాయ్ పటేల్ ఎంపీలుగా గెలుపొందారు.

అద్వానీ శకం మొదలు

1991లో మొట్టమొదటిసారి అద్వానీ గాంధీనగర్ నుంచి పోటీచేసి గెలుపొందారు. ఆ తరువాత హవాలా కుంభకోణం వెలుగులోకి రావడంతో అనేకమంది రాజకీయ నాయకులతోపాటు ఆయనకు కూడా ముడుపులు ముట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. తనపై మచ్చ తొలగిపోయేంత వరకూ మళ్లీ ఎన్నికల్లో పోటీచేసేది లేదని అద్వానీ అప్పట్లో ప్రతిజ్ఞకూడా చేశారు. తదనంతరం ఆ ఆరోపణ దూదిపింజలా తేలిపోయింది. ఈ కేసులో నిందితులుగా పేర్కొన్న రాజకీయ నాయకులెవరిపైనా ఆ ఆరోపణలు నిరూపితం కాలేదు. కేసు విచారణ కారణంగా, అద్వానీ పోటీ చేయకపోవడంతో ఆ నియోజకవర్గం నుంచి దివంగత నేత అటల్ బిహారీ వాజపేయి పోటీచేసి గెలుపొందారు.

ఆయన సొంత నియోజకవర్గం లక్నోనుంచి కూడా విజయం సాధించడంతో గాంధీనగర్ ప్రాతినిథ్యాన్ని వదులుకున్నారు. తర్వాత జరిగిన ఉపఎన్నికలో కాంగ్రెస్ పక్షాన ప్రముఖ హిందీ నటుడు రాజేశ్‌ఖన్నా బరిలోకి దిగినప్పటికీ ఆయన సినిమా గ్లామర్ బీజేపీ విజయాన్ని నిలువరించలేకపోయింది. బిజెపి అభ్యర్థి విజయ్‌పటేల్ ఆయనపై మంచి మెజార్టీతో గెలిచారు. 1998లో అద్వానీ పోటీకి విముఖత వ్యక్తం చేసినా పార్టీ నేతలు ఆయన్ను ఒప్పించి గాంధీనగర్ నుంచే మళ్లీ బరిలోకి దింపారు. 1999లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో సైతం ఆయనే మరోసారి ఈ నియోజకవర్గం నుంచి గెలిచారు.

అద్వానీ ప్రాతినిధ్యానికి ముగింపు

2004, 2009 నుంచి 2014 వరకు కూడా మూడు పర్యాయాలూ గాంధీనగర్ ఎంపీగా అద్వానీయే అప్రతిహతంగా కొనసాగారు. నియోజకవర్గ ప్రజలతో ఆయన అంతగా మమేకమై పోయారు. ఇప్పుడు మాత్రం వయసు కారణంగా చూపుతూ ఆయనకు బీజేపీ టికెట్ ఇవ్వలేదు. ఆ స్థానంలో బీజేపీ అమిత్‌షాకు ఈ స్థానాన్ని కేటాయించింది. పార్టీ పరంగా గత 30 ఏండ్లుగా బీజేపీకి ఇక్కడ తిరుగులేదు. ఏప్రిల్ 23న జరిగే ఎన్నికల్లో వ్యక్తిగత ప్రతిష్ఠలు, చరిష్మా వంటివేవీ పనిచేయకుండా, ప్రజలు పార్టీని మాత్రమే దృష్టిలో పెట్టుకొని ఓటు వేస్తే మళ్లీ బీజేపీ విజయం ఖాయం కావచ్చు.
advani-amit2

1075
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles