అనిల్, నీరవ్ మాటే వేదం!


Fri,March 15, 2019 11:13 AM

Anil Ambani and Nirav are Modis bhais

-సామాన్యుల గోడు మీకు పట్టదు
-ప్రధాని మోదీపై రాహుల్ ధ్వజం
-కేవలం 15 మందికి రూ.3.5 లక్షల కోట్లు దోచిపెట్టారని మండిపాటు

న్యూఢిల్లీ/త్రిసూర్ (కేరళ), మార్చి 14: రైతులు, మత్స్యకారులు, చిరు వ్యాపారుల వెతల్ని ప్రధాని నరేంద్రమోదీ అస్సలు పట్టించుకోరని, ఆయన కేవలం అనిల్ అంబానీ, నీరవ్‌మోదీ వంటి పారిశ్రామికవేత్తల మాటలు మాత్రమే వింటారని రాహుల్ విమర్శించారు. కేరళలోని త్రిసూర్ సమీపంలో ఉన్న త్రిప్రయార్‌లో అఖిల భారత మత్స్యకారుల కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన జాతీయ మత్స్యకారుల పార్లమెంట్ కార్యక్రమంలో, తర్వాత జరిగిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్ మాట్లాడుతూ.. ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వంలో అనిల్ అంబానీ, నీరవ్‌మోదీ మాటలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంది. తమకేదైనా కావాలని వారు ప్రధాని మోదీ అడిగిన 10 సెకండ్లలోనే వారి పనులు జరిగిపోతున్నాయి. కానీ రైతులు, మత్స్యకారులు, చిరు వ్యాపారులు గొంతు చించుకున్నా కూడా ఈ సర్కార్ పట్టించుకోవడం లేదు. మోదీ చుట్టూ ఉన్న వ్యక్తులందరూ అవినీతిపరులే. వారితోనే ఆయన దోస్తీ చేస్తారు అని ధ్వజమెత్తారు. తానెప్పుడూ అనిల్, నీరవ్‌మోదీ, మెహుల్ చోక్సీలను భాయీ అని సంబోధించలేదని పరోక్షంగా మోదీని ఎద్దేవాచేశారు. మోదీలా తాను నకిలీ వాగ్దానాలు చేయనన్నా రు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మత్స్యకారులకు ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు.

బ్యాంకులతో కేవలం 30-40 మందికే లబ్ధి

బీజేపీ హయాంలో భారత బ్యాంకింగ్ రంగం నుంచి కేవలం 30-40 మంది బడా పారిశ్రామికవేత్తలకే లబ్ధి చేకూరిందని రాహుల్ విమర్శించారు. కొద్దిమంది చేతిలో ప్రధాని పావు లా మారారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే యువ పారిశ్రామిక వేత్తలకు రుణాలు అందజేస్తామని హామీనిచ్చారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల్లో రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్‌దేనని అన్నారు. మోదీ తన ఐదేండ్ల పాలనలో దేశంలో అత్యంత ధనవంతులైన 15 మందికి చెందిన రూ.3.5 లక్షల కోట్ల రుణాల్ని రద్దు చేశారు. వీరిలో అనిల్ అంబానీ, నీరవ్ మోదీ ఉన్నారు. మరి, రైతుల రుణాల్ని మీరెందుకు మాఫీ చేయరు అంటూ ప్రధానిని ప్రశ్నించారు. బడా పారిశ్రామికవేత్తలు బ్యాంకుల్ని దోచుకుంటున్నారని రాహుల్ ఆరోపించారు. అనిల్ అంబానీ రూ.45వేల కోట్లు, నీరవ్‌మోదీ రూ.35వేల కోట్లు, విజయ్ మాల్యా రూ.10వేల కోట్లను బ్యాంకుల నుంచి రుణంగా పొందారు. ఈ సొమ్ముతో వారు ఎందరికి ఉపాధి కల్పించారు అని ప్రశ్నించారు. ఈ మొత్తాన్ని నిరుద్యోగులైన యువ పారిశ్రామికవేత్తలకు అందజేస్తే వారు అద్భుతాలు సృష్టిస్తారని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కనీస ఆదాయ హామీ పథకాన్ని అమలుచేస్తామని రాహుల్ చెప్పారు.

rahul2

అమరుల కుటుంబాలకు పరామర్శ

సీపీఎం కార్యకర్తల చేతిలో దారుణహత్యకు గురైనట్లుగా భావిస్తున్న ముగ్గురు యూత్ కాంగ్రెస్ సభ్యుల కుటుంబాలను రాహుల్ పరామర్శించారు. కేరళ పర్యటనలో ఉన్న రాహుల్ కాసర్‌గోడ్‌లో ఇటీవల హత్యకు గురైన కృపేశ్, శరత్‌లాల్ కుటుంబాలను కలిసి ఓదార్చారు. దోషులను కఠినంగా శిక్షించాలని, జంట హత్యలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. గత ఏడాది దారుణహత్యకు గురైన కన్నూర్‌కు చెందిన యూత్ కాంగ్రెస్ నేత సుహేబ్ కుటుంబసభ్యులతోనూ రాహుల్ భేటీ అయ్యారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీనిచ్చారు. అధికార ఎల్డీఎఫ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాహుల్ వెంట కేరళ కాంగ్రెస్ నేతలు రమేశ్ చెన్నితల, మూలపల్లి రామచంద్రన్ తదితరులు ఉన్నారు.

464
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles