పాస్‌పోర్ట్ తప్పనిసరి.. కాదు!

Fri,November 8, 2019 03:08 AM

-కర్తార్‌పూర్ కారిడార్‌పై పాక్ గందరగోళ ప్రకటనలు
-భారత సిక్కు యాత్రికులకు పాస్‌పోర్టు తప్పనిసరన్న పాక్ సైన్యం
-అవసరంలేదన్న ఆ దేశ విదేశాంగ కార్యాలయం
-నవంబర్ 9, 12 తేదీల్లో ఫీజు కూడా వసూలు చేయబోమని వెల్లడి

న్యూఢిల్లీ, నవంబర్ 7: కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి ఇంకా ఒక రోజు సమయం మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో పాకిస్థాన్ కర్తార్‌పూర్‌లోని గురుద్వారా దర్బార్ సాహిబ్ సందర్శనకు వచ్చే భారత సిక్కు యాత్రికుల పాస్‌పోర్టు విషయమై గందరగోళ పరిస్థితులను సృష్టించింది. భారత యాత్రికులు పాస్‌పోర్టు లేకుండానే కర్తార్‌పూర్ సందర్శించవచ్చని గత శుక్రవారం పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ పేర్కొనగా, భారత సిక్కు యాత్రికులు కచ్చితంగా పాస్‌పోర్టుతోనే రావాలని పాక్ సైన్యం గురువారం చెప్పింది. దీంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే, కర్తార్‌పూర్ సందర్శనకు వచ్చే భారత సిక్కు యాత్రికులకు సంవత్సరంపాటు పాస్ పోర్టు అవసరంలేదని పాక్ విదేశీ మంత్రిత్వ శాఖ గురువారం మరో ప్రకటనలో స్పష్టం చేసింది. మరోవైపు, కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ హాజరయ్యేందుకు రాజకీయ అనుమతినిస్తున్నట్టు గురువారం ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. కర్తార్‌పూర్ సందర్శన విషయమై ఓ స్థానిక చానల్‌తో పాక్ ఆర్మీ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ మాట్లాడుతూ.. భద్రతా కారణాల రీత్యా.. కర్తార్‌పూర్ సందర్శనకు వచ్చే భారత సిక్కు యాత్రికులు తప్పనిసరిగా పాస్‌పోర్టును తీసుకురావాలి అని అన్నారు. ఈ క్రమంలో కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి వెళ్లే భారత సిక్కు యాత్రికులు పాస్‌పోర్టును తప్పనిసరిగా తమ వెంట తీసుకువెళ్లాలని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ(ఎంఈఏ) గురువారం స్పష్టం చేసింది. ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం.. భారత సిక్కు యాత్రికులు పాస్‌పోర్టు తీసుకెళ్లడం ఉత్తమం అని ఎంఈఏ ప్రధాన ప్రతినిధి రవీశ్ కుమార్ తెలియజేశారు. కర్తార్‌పూర్ ప్రారంభోత్సవానికి భారత్ నుంచి హాజరయ్యే 550 మంది ప్రముఖుల జాబితాను పాక్ ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు.

నో పాస్‌పోర్టు.. నో ఫీజు..

కర్తార్‌పూర్ సందర్శనపై పాక్ సైన్యం ఇచ్చిన ప్రకటనకు విరుద్ధంగా పాక్ విదేశీ మంత్రిత్వ శాఖ కార్యాలయం గురువారం మరో ప్రకటన చేసింది. కర్తార్‌పూర్ సందర్శనకు వచ్చే భారత సిక్కు యాత్రికులకు సంవత్సరం పాటు పాస్‌పోర్టు అవసరం లేదని ప్రకటించింది. గురునానక్ 550వ జన్మదినోత్సవం సందర్భంగా సంవత్సర కాలంపాటు భారత సిక్కు యాత్రికులు పాస్‌పోర్టు లేకుండానే కర్తార్‌పూర్‌ను సందర్శించవచ్చు. అలాగే, కర్తార్‌పూర్‌కు వచ్చే భారత యాత్రికుల వివరాల్ని 10 రోజుల ముందుగానే మాకు భారత్ తెలియజేయాలన్న నిబంధనను కూడా సడలిస్తున్నాం. దీంతోపాటు నవంబర్ 9, 12 తేదీల్లో కర్తార్‌పూర్ సందర్శనకు భారత యాత్రికులు చెల్లించాల్సిన 20 డాలర్ల ఫీజును కూడా వసూలు చేయం అని పాక్ విదేశీ కార్యాలయం ప్రతినిధి మహమ్మద్ ఫైజల్ తెలిపారు. కర్తార్‌పూర్ ప్రారంభోత్సవానికి భారత్ నుంచి హాజరయ్యే ప్రముఖులకు పటిష్ఠ భద్రతను కల్పించాలన్న భారత్ అభ్యర్థనను పాక్ పెడచెవిన పెట్టినట్టు అధికార వర్గాలు తెలిపాయి. పంజాబ్‌లో వేర్పాటువాదం సృష్టించి, హిందూ, సిక్కుల మధ్య చీలికను తెచ్చేందుకే పాక్ ఈ ప్రారంభోత్సవాన్ని ఉపయోగించుకుంటూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. పాకిస్థాన్ ఇటీవల విడుదల చేసిన ఖలిస్థాన్ వేర్పాటువాదులతో ఉన్న వీడియోను ఈ సందర్భంగా భారత్ ఖండించింది. ప్రారంభోత్సవంలో పాల్గొనే సిక్కుల ఉత్సాహాన్ని సదరు వీడియో నీరుగారుస్తున్నదని అభ్యంతరం వ్యక్తం చేసింది.

సిద్ధూకు గ్రీన్ సిగ్నల్

కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పంజాబ్ కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ హాజరయ్యేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కర్తార్‌పూర్ కార్యక్రమానికి రావాలని సిద్ధూను పాకిస్థాన్ ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పాక్ గురువారం ఆయనకు వీసా జారీచేసింది. కాగా, కర్తార్‌పూర్ సందర్శనకు వెళ్తున్న తొలి 550 మంది బృందంలో బీజేపీ ఎంపీ, సినీ నటుడు సన్నీ డియోల్ కూడా ఉన్నారు. ఇందులో మాజీ ప్రధాని మన్మోహన్, పంజాబ్ సీఎం అమరీందర్ కూడా ఉన్నారు.

854
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles