జైట్లీకి కన్నీటి వీడ్కోలు


Mon,August 26, 2019 01:57 AM

Arun Jaitley cremated at Nigambodh Ghat with full state honours

-ఢిల్లీలోని నిగమ్‌బోధ్‌ ఘాట్‌లో అంత్యక్రియలు పూర్తి
-అధికారిక లాంఛనాల మధ్య దహన సంస్కారాలు
-అంతిమయాత్రకు నేతలు, కార్యకర్తలు, అభిమానులు హాజరు
-తీవ్ర భావోద్వేగానికి గురైన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

న్యూఢిల్లీ, ఆగస్టు 25: కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్‌ నేత అరుణ్‌ జైట్లీ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆదివారం ఢిల్లీలోని యమునానది ఒడ్డున ఉన్న నిగమ్‌ బోధ్‌ ఘాట్‌లో అధికారిక లాంఛనాల మధ్య దహనసంస్కారాలు నిర్వహించారు. ఆయన చితికి కుమారుడు రోహన్‌ నిప్పంటించారు. కుటుంబసభ్యులతోపాటు బంధువులు, పలు పార్టీల నేతలు, కార్యకర్తలు, అభిమానులు వందల మంది అంతిమయాత్రలో పాల్గొన్నారు. తమ ప్రియతమ నేతకు తుది వీడ్కోలు పలికారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌కే అద్వానీ, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా, కేంద్రమంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, నిర్మలా సీతారామన్‌, స్మృతి ఇరానీ, అనురాగ్‌ ఠాకూర్‌, కాంగ్రెస్‌ నేతలు గులాం నబీ ఆజాద్‌, జ్యోతిరాదిత్య సింధియా, కపిల్‌ సిబల్‌, ఎన్సీపీ నేత ప్రఫుల్‌ పటేల్‌, పలు రాష్ర్టాల సీఎంలు కేజ్రివాల్‌, దేవేంద్ర ఫడ్నవీస్‌, విజయ్‌ రూపానీ, యెడియూరప్ప, నితీశ్‌కుమార్‌, త్రివేంద్ర సింగ్‌ రావత్‌తోపాటు పలువురు ఎంపీలు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
Rohan-Jaitley
ఓవైపు వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా తమ ప్రియతమ నేతకు తుది వీడ్కోలు పలికేందుకు ఎదురుచూశారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ విదేశీ పర్యటనలో ఉండటం, అంత్యక్రియల కోసం పర్యటనను రద్దు చేసుకోవద్దని జైట్లీ కుటుంబ సభ్యులు సూచించడంతో ఆయన హాజరుకాలేకపోయారు. ఈ సందర్భంగా చిరకాల మిత్రుడి పార్థివ దేహాన్ని చూసి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కొన్ని నిమిషాలపాటు జైట్లీ చేతిని పట్టుకొని అక్కడే నిలబడ్డారు. అంతకుముందు ఉదయం 11 గంటలకు జైట్లీ మృతదేహాన్ని ఆయన నివాసం నుంచి దీన్‌దయాల్‌ ఉపాధ్యాయ మార్గ్‌లోని బీజేపీ కేంద్ర కార్యాలయానికి తరలించారు. వేల మంది బీజేపీ కార్యకర్తలు, సామాన్య పౌరులు, పలు పాఠశాలల విద్యార్థులు తరలివచ్చి ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. రెండున్నర గంటల అనంతరం అక్కడి నుంచి నిగమ్‌బోధ్‌ ఘాట్‌కు తరలించారు.
Arun
jaitly-deadbody

1038
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles