అయోధ్యలో సందడి

Mon,November 11, 2019 02:48 AM

- దేవాలయాలకు భక్తుల క్యూ
- భద్రత కట్టుదిట్టం

అయోధ్య, నవంబర్‌ 10: రామజన్మభూమి- బాబ్రీ మసీదు స్థల వివాదంపై సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు నేపథ్యంలో అయోధ్యలో సందడి నెలకొంది. పటిష్ఠ భద్రతా ఏర్పాట్ల నడుమ భక్తులు వివిధ దేవాలయాలకు వెళ్లి పూజలు నిర్వహించారు. హనుమాన్‌గఢీ, నయా ఘాట్‌ ప్రాంతాల్లో ఉదయం నుంచే సందడి నెలకొంది. పెద్ద సంఖ్యలో భక్తులు రాముడిని, హనుమంతుడిని దర్శించుకున్నారు. సాయంత్రం సమయంలో భజనలు, కీర్తనలు నిర్వహించారు. మరోవైపు, కోర్టు తీర్పు నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ఠ భద్రతను సోమవారం కూడా కొనసాగించారు. భద్రతా సిబ్బంది ముమ్మర తనిఖీలు నిర్వహించారు. రామలల్లా పురోహితులు ఆచార్య సత్యేంద్రదాస్‌ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీర్పు వెల్లడైన చారిత్రక దినానికి గుర్తుగా ఒక భక్తుడు అందజేసిన నూతన వస్ర్తాలను శ్రీరాముడికి అలంకరించినట్లు చెప్పారు. అయోధ్యపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మీద దేశంలోని ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు రికబ్‌గంజ్‌తోపాటు నగరంలోని వివిధ ప్రాంతాల ప్రజలు దినపత్రికలను ఆసక్తిగా పరిశీలించారు. అయోధ్యలో హోటల్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న సందీప్‌ సింగ్‌ అనే వ్యక్తి మాట్లాడుతూ.. ఈ ఆదివారం తమకు చాలా ప్రత్యేకమైనదని, అయోధ్య వివాదానికి ముగింపు లభించడంతో తమకు ఉపశమనం లభించిందని పేర్కొన్నారు. స్థానిక ముస్లిం నేత బబ్లూఖాన్‌ మాట్లాడుతూ.. ఇది రాముడి నగరమని, సుప్రీంకోర్టు తీర్పును తాము స్వాగతిస్తున్నామన్నారు.

మిలాద్‌ ఉన్‌ నబీ వేడుకలు రద్దు

మహమ్మద్‌ ప్రవక్త జయంతి ‘మిలాద్‌ ఉన్‌ నబీ’ సందర్భంగా నిర్వహించే సంప్రదాయ ‘బారా రబీవుల్‌ అవ్వాల్‌' వేడుకలను ఈసారి అయోధ్యలో రద్దు చేసినట్లు ముస్లిం నేతలు ప్రకటించారు. ఇందుకు రెండు కారణాలున్నాయని చెప్పారు. ఒకటి, నగరంలో శాంతియుత పరిస్థితులకు భంగం కలుగకుండా ముందు జాగ్రత్త చర్యగా వీటిని రద్దు చేసినట్లు తెలిపారు. ఇక రెండోది, సుప్రీంకోర్టు తీర్పుపై ముస్లింలలో కొంచెం అసంతృప్తి ఉన్న కారణంగా వేడుకలకు దూరంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

1831
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles