- సున్నీ వక్ఫ్ బోర్డుకు ఇవ్వాల్సిన స్థలంపై మల్లగుల్లాలు
- అయోధ్యలో పెరుగుతున్న జనాభా.. దొరకని ఖాళీ స్థలం
- ఆలయం పరిధిలో ఇవ్వొద్దంటున్న హిందూ వర్గీయులు
- ఆ 67 ఎకరాల్లోనే ఇవ్వాలంటున్న ముస్లిం పెద్దలు
న్యూఢిల్లీ/అయోధ్య: సుప్రీంకోర్టు తీర్పు మేరకు అయోధ్యలో మసీదు నిర్మాణం కోసం సున్నీ వక్ఫ్ బోర్డుకు ఐదెకరాల స్థలాన్ని కేంద్రంగానీ, యూపీ ప్రభుత్వంగానీ కేటాయించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మసీదుకు అయోధ్యలో ఎక్కడ స్థలం కేటాయిస్తారన్నది ఆసక్తిగా మారింది. అయితే, రామజన్మభూమి ఉన్న స్థలం(బాబ్రీ మసీదు విధ్వంసం జరిగిన స్థలం) సమీపంలో ఇవ్వడానికి సాధ్యపడకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. జనసాంద్రత అధికంగా ఉన్న అయోధ్య నగరంలో ప్రస్తుత పరిస్థితుల్లో ఐదెకరాల ఖాళీ స్థలాన్ని సేకరించడం సాధ్యపడకపోవచ్చని అధికారులు చెప్తున్నారు. ‘సున్నీ వక్ఫ్ బోర్డుకు ఇవ్వాల్సిన స్థలం అయోధ్య మున్సిపల్ పరిధిలోపల, సరయూ నది సమీపాన కేటాయించడం సాధ్యం కాకపోవచ్చు’ అని అధికార వర్గాలు తెలిపాయి.
రామజన్మభూమి చుట్టూ 2 కి. మీ. వ్యాసార్ధంతో 15 కి. మీ. వృత్తం(పంచకోశి వృత్తం) సరిహద్దు లోపల గల భూమిని ‘శాస్త్రీయ పరిధి(పవిత్ర వృత్తం)’గా మందిరం వర్గీయులు భావిస్తున్నారు. ఈ స్థలం అవతలనే మసీదు నిర్మాణానికి ప్రభుత్వం భూమిని కేటాయించాలని వాళ్లు చెబుతున్నారు. మరోవైపు, పంచకోశి వృత్తానికి బయట ఉన్న అయోధ్య- ఫైజాబాద్ మార్గంలో సున్నీ వక్ఫ్ బోర్డుకు స్థలం కేటాయించే అవకాశం ఉన్నది’ అని అధికార వర్గాలు పేర్కొన్నాయి. బాబర్ సైన్యాధ్యక్షుడు, బాబ్రీ మసీదును నిర్మించినట్టు చెబుతున్న బాఖీ సమాధి ఉన్న షాజ్వానా గ్రామంలో మసీదు నిర్మాణానికి స్థలం కేటాయిస్తే బాగుంటుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే ఆ గ్రామం పంచకోశి వృత్తంలోపలకి వస్తున్నది.
అక్కడైతేనే తీసుకుంటాం
‘ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సేకరించిన 67 ఎకరాల్లోనే మాకు స్థలం కేటాయించాలి. అలాకాని పక్షంలో మాకు ఎలాంటి స్థలం వద్దు’ అని అయోధ్య మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ హాజీ అసద్ అహ్మద్ పేర్కొన్నారు. తామేమీ ప్రభుత్వంపై ఆధారపడిలేమని, తామే మసీదు నిర్మాణానికి కావాల్సిన భూమిని కొనుగోలు చేస్తామని స్థానిక మత పెద్ద జలాల్ అష్రాఫ్ చెప్పారు. ప్రభుత్వం తమను సంతృప్తిపర్చాలనుకుంటే యూపీ సర్కారు సేకరించిన భూమిలో తమకు స్థలాన్ని కేటాయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.