కీలకంగా యాత్రాచరిత్రలు!

Mon,November 11, 2019 02:23 AM

- అయోధ్య తీర్పులో పరిగణనలోకి..
- పలువురు చరిత్రకారులు, యాత్రికుల రచనలను విశ్లేషించిన సుప్రీం

న్యూఢిల్లీ: దశాబ్దాలపాటు రగిలిన అయోధ్య వివాదానికి సుప్రీంకోర్టు తీర్పుతో తెరపడింది. 17-19వ శతాబ్దాల మధ్య భారత్‌లో పర్యటించిన పలువురు యాత్రికులు, చరిత్రకారులు రచించిన ట్రావెలాగ్‌లు (యాత్రా చరిత్రలు), గజెటీర్‌లను తీర్పులో ప్రస్తావించిన సుప్రీంకోర్టు.. అయోధ్యలోని వివాదాస్పద కట్టడానికి సంబంధించి ‘చరిత్ర విస్మరించిన అతి చిన్న అంశాలను’ కూడా సమతుల దృష్టితో విశ్లేషించినట్లు పేర్కొంది. జోసఫ్‌ టైపెంథ్లార్‌, రాబర్ట్‌ మాంట్‌గోమరీ మార్టిన్‌, పీ కార్నెగీ, ఎడ్వర్డ్‌ థోర్న్‌టన్‌, విలియం ఫించ్‌ తదితరుల ట్రావెలాగ్‌లను కోర్టు పరిశీలించింది. మొఘల్‌ చక్రవర్తి జౌరంగజేబు మరణించిన సుమారు మూడు దశాబ్దాల తర్వాత 1740లో అయోధ్యలో పర్యటించిన ఆస్ట్రేలియాకు చెందిన క్రైస్తవ మతబోధకుడు జోసఫ్‌ టైపెంథ్లార్‌.. శ్రీరాముడి జన్మస్థలంగా పరిగణిస్తున్న స్థలంలో ఆలయం కూల్చివేత, మసీదు నిర్మాణం గురించి తన పుస్తకంలో ప్రస్తావించారు. సీతా రసోయి, స్వర్గ్‌ద్వార్‌ వంటి ప్రదేశాలతోపాటు హిందూ పండుగల గురించి కూడా పేర్కొన్నారు. ఆలయాన్ని కూల్చి, మసీదును నిర్మించినప్పటికీ హిందూ భక్తులు అక్కడ పూజలు నిర్వహించేవారని వివరించారు.

ఆంగ్లో-ఐరిష్‌ రచయిత రాబర్ట్‌ మాంట్‌గోమరీ మార్టిన్‌ రచించిన ‘హిస్టరీ, యాంటిక్విటీస్‌, టోపోగ్రఫీ అండ్‌ స్టాటిస్టిక్స్‌ ఆఫ్‌ ఈస్టర్న్‌ ఇండియా’ పుస్తకంలో ఆలయాల కూల్చివేత, మసీదుల నిర్మాణం గురించి ప్రస్తావించారు. నల్లరాతితో నిర్మితమైన మసీదు స్తంభాలను ఆయన గుర్తించారని, వాటిపై ఉన్న చిత్రాలను బట్టి వాటిని హిందూ కట్టడం నుంచి సేకరించినట్లు నిర్ధారణకు వచ్చారని కోర్టు అభిప్రాయపడింది. ఫైజాబాద్‌లో నాడు అసిస్టెంట్‌ కమిషనర్‌గా పనిచేసిన పీ కార్నెగీ ‘హిస్టారికల్‌ స్కెచ్‌ ఆఫ్‌ ఫైజాబాద్‌' పేరిట ఒక పుస్తకాన్ని రచించారు. 1528లో మొఘల్‌ చక్రవర్తి బాబర్‌.. బాబ్రీ మసీదును నిర్మించినట్లు ఆయన అందులో పేర్కొన్నారు. అంతకుముందు అక్కడ ఉన్న ఆలయానికి సంబంధించిన చాలా స్తంభాలను మసీదు నిర్మాణంలో వినియోగించినట్లు ఆయన అందులో అభిప్రాయం వ్యక్తంచేశారు. హనుమాన్‌ గఢీ, జన్మస్థానం స్వాధీనం విషయంలో 1855లో హిందువులు, ముస్లింల మధ్య ఘర్షణలు తలెత్తినట్లు వివరించారు. ఘటనకు ముందువరకు కూడా హిందువులు, ముస్లింలూ అక్కడ ప్రార్థనలు నిర్వహించేవారని పేర్కొన్నారు. వివాదాలను అడ్డుకునేందుకు బ్రిటిష్‌ పాలనలో అక్కడ ఒక అడ్డుగోడ నిర్మించినట్లు తెలిపారు.

229
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles