ప్రభావశీల మహిళల్లో మనోళ్లు ఏడుగురు

Thu,October 17, 2019 03:02 AM

- 100 మంది జాబితాను విడుదల చేసిన బీబీసీ


న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యంత ప్రభావశీల 100 మంది మహిళల జాబితాను బీబీసీ బుధవారం విడుదల చేసింది. ఇందులో ఏడుగురు భారతీయ మహిళలకు చోటు లభించింది. వీరిలో రచయితలు, మహిళల సాధికారత కోసం పోరాడిన వాళ్లు ఉన్నారు. వారి గురించి క్లుప్తంగా..

పర్వీనా అహంగర్‌: ‘కశ్మీర్‌ ఉక్కు మహిళ’గా ఈమెకు పేరుంది. కశ్మీర్‌లో మానవ హక్కుల కోసం పోరాడుతున్నారు. 90వ దశకంలో తన కుమారుడు అదృశ్యంకావడంతో అతడి కోసం చాలా కాలం వెతికారు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో చలించిపోయిన పర్వీనా ‘అదృశ్యమైన వ్యక్తుల తల్లిదండ్రుల సంస్థ’ (ఏపీడీపీ)ని స్థాపించారు. కశ్మీర్‌లో వ్యక్తుల అదృశ్యాలకు వ్యతిరేకంగా ఈ సంస్థ ప్రచారం నిర్వహిస్తున్నది.

వందనా శివ: చిప్కో ఉద్యమం స్ఫూర్తిగా పర్యావరణ పరిరక్షణ కోసం పనిచేస్తున్నారు. పరిశోధకురాలిగానూ, లింగసమానత్వం కోసం పోరాడుతున్న వ్యక్తిగానూ, రచయితగానూ వ్యవహరిస్తున్నారు. ఇప్పటి వరకు 20 పుస్తకాలను రాశారు. జీవవైవిధ్యం ద్వారా జీవ సంబంధ, ఆర్థిక సంబంధ సమస్యల పరిష్కారాన్ని కనుగొనేందుకు ఈమె ‘నవ్‌ధాన్య’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు.
అరణ్య జోహర్‌: ముంబైలోని షోపియా కాలేజీ విద్యార్థిని, రచయిత, వ్యాఖ్యాత అరణ్య జోహర్‌కు జాబితాలో అన్యూహంగా చోటుదక్కింది. ఈమె రాసిన కవిత ‘ఏ బ్రౌన్‌ గర్ల్స్‌ గైడ్‌ టు జెండర్‌' సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో 2017లో వెలుగులోకి వచ్చారు. లైంగిక వేధింపులు, లింగ అసమానత్వం తదితరాల గురించి తన కవితల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నారు.

సుస్మిత మొహంతి: దేశంలోనే ప్రైవేట్‌ రంగంలో తొలి అంతరిక్ష అంకుర సంస్థ (స్టార్టప్‌)ను ప్రారంభించిన యువతిగా సుస్మితా రికార్డు సృష్టించారు. అమెరికా అంతరిక్ష సంస్థ నాసాలోనూ పనిచేసిన సుస్మితా.. భారత అంతరిక్ష సంస్థ ఇస్రో, యురోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ లాంటి సంస్థలకు కన్సల్టెంట్‌గాను వ్యవహరిస్తున్నారు. 2008లో ‘ఎర్త్‌2ఆర్బిట్‌' అనే స్టార్టప్‌ను స్థాపించిన ఈమె వాతావరణ మార్పుల గురించి తెలుసుకోవడానికి అంతరిక్ష పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు.
సుబ్బలక్ష్మి నంది: ఆసియాలో లింగసమాన త్వం కోసం గత 15 ఏండ్లుగా పనిచేస్తున్నా రు. ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఆన్‌ ఉమెన్‌ సంస్థకు పాలసీ డైరెక్టర్‌గానూ వ్యవహరిస్తున్నారు. ఐక్యరాజ్యసమితికి చెందిన మహిళా ఆర్థిక సాధికారత విభాగానికి అధ్యక్షురాలిగానూ పనిచేశారు. మహిళా రైతుల అభ్యున్నతి, మహిళల విద్య కోసం కృషి చేస్తున్నారు.

నటాశా నోయల్‌: ముంబైలో జన్మించిన ఈమె తన మూడవ ఏటనే తల్లిని కోల్పోయారు. యుక్త వయసులో లైంగికవేధింపులకు గురయ్యారు. ప్రస్తుతం 26 ఏండ్ల వయసున్న నటాశా యోగా గురువుగా, వ్యక్తిత్వ వికాస నిపుణురాలిగా, సోషల్‌ మీడియాలో ప్రభావశీల మహిళగా పనిచేస్తున్నారు.

డాక్టర్‌ ప్రగతి సింగ్‌: తన దగ్గరకు చికిత్స కోసం వచ్చిన మహిళల్లో చాలా మంది తమకు శృంగార కోరికలు కలుగడం లేదని చెప్పడంతో ఈ అంశంపై డాక్టర్‌ ప్రగతి సింగ్‌ పరిశోధనలు చేపట్టారు. ఇలాంటి సమస్యలు ఉన్న మహిళలు, పురుషుల కోసం ఈమె ఓ ఆన్‌లైన్‌ కమ్యూనిటీ సంస్థను 2014లో స్థాపించారు. ప్రగతిసింగ్‌ రచయితగా కూడా వ్యవహరిస్తున్నారు.

872
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles