నమో సునామీ


Fri,May 24, 2019 03:55 AM

BJP Big Win In National Elections

-ఫిర్ ఏక్‌బార్ మోదీ సర్కార్
-సొంత రికార్డు బద్దలుకొట్టిన కమలనాథులు
-303 స్థానాల్లో బీజేపీ జయకేతనం
-మిత్రులతో కలిసి 349 స్థానాల్లో గెలుపు
-బీజేపీ హవా ముందు చిత్తయిన విపక్షాలు
-52 సీట్లకు పరిమితమైన కాంగ్రెస్
-అమేథీలో ఓడిపోయిన రాహుల్‌గాంధీ
-వయనాడులో 4.31 లక్షల మెజార్టీతో గెలుపు
-పెద్ద నోట్ల రద్దును పట్టించుకోని ఓటర్లు
-మోదీ జాతీయవాదానికి జై
-ఓటర్లను ఆకర్షించని రాహుల్ న్యాయ్
-చౌకీదార్ చోర్ నినాదానికి స్పందన కరువు
-తిరుగులేని విజయం సాధించిన బీజేపీ

మోదీ.. మోదీ.. మోదీ..!! రెండుమూడు రాష్ర్టాలు మినహా దేశమంతటా ఇదే నినాదం! హిందీయేతర రాష్ర్టాల్లోనూ అదే హవా! గత ఎన్నికల్లో భారీ సంఖ్యలో సీట్లు సాధించి అధికారంలోకి వచ్చిన బీజేపీ.. తన రికార్డును తానే బద్దలు కొట్టుకుంటూ రెండోసారి అధికార పగ్గాలు స్వీకరించనున్నది. బీజేపీ సొంతంగా 303 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. ఎన్డీయే మిత్రులతో కలుపుకొంటే ఆ స్థానాలు 349కి చేరుకున్నాయి. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న జాతీయపార్టీ కాంగ్రెస్.. 52 సీట్లతో సరిపెట్టుకున్నది. కాంగ్రెస్, మిత్రపక్షాలు 93 స్థానాల్లో గెలువగా, ఇతరులు వంద స్థానాల్లో విజయం సాధించారు. పెద్ద నోట్ల రద్దు కష్టాలు, జీఎస్టీతో పడిన ఇబ్బందులు, నిరుద్యోగ సమస్య, వ్యవసాయ సంక్షోభం పూర్వపక్షమైపోయాయి. జాతీయ భద్రత, జాతీయవాదం, హిందూత్వ నినాదాలు.. ముందువరుసకు వచ్చాయి. రాహుల్ చేసిన చౌకీదార్ చోర్ హై నినాదాలు, రాఫెల్ స్కాం ఆరోపణలు పనిచేయలేదు. న్యాయ్ పేరుతో న్యాయం చేస్తానన్న వాగ్దానాలూ జనాన్ని మెప్పించలేదు. గత ఎన్నికల్లో ఒక శిఖరం అధిరోహించిన బీజేపీ.. నేడు మరో శిఖరాన్ని అవలీలగా అధిరోహించింది. నెహ్రూ, ఇందిర తర్వాత వరుసగా రెండోసారి పూర్తి మెజార్టీతో గెలుపొందిన మూడో ప్రధానిగా, తొలి కాంగ్రెసేతర ప్రధానిగా మోదీ రికార్డు నెలకొల్పారు. సరైన, సమర్థ నాయకుడు, మోదీ తరహాలో ప్రధాని అభ్యర్థి లేని ప్రతిపక్షం చతికిలపడింది. ప్రతిపక్షాల్లోనూ ఐక్యత లేకపోవడం బీజేపీకి మరో సానుకూల అంశంగా మారింది. అవకాశాలు వచ్చినా ఉపయోగించుకోలేని కాంగ్రెస్ నాయకత్వ లోపం మరోసారి కొట్టొచ్చినట్టు కనిపించింది. కాంగ్రెసేతర, బీజేపీయేతర విపక్షాలతో కూడిన ప్రాంతీయ పార్టీల సమాఖ్య కూటమి ఏర్పాటు ఆవశ్యకతను ఫలితాలు నొక్కిచెప్పాయి. అదేసమయంలో వివిధ రాష్ర్టాల్లో ప్రాంతీయ పార్టీలు తమ సత్తా చాటాయి. తమిళనాడులో మొత్తం 38 స్థానాలకుగాను డీఎంకే 23 విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ 22 స్థానాల్లో గెలుపొందింది. కేరళ, పంజాబ్‌లలో కాం గ్రెస్ మెరుగనిపించుకుంది. తెలంగాణలోటీఆర్‌ఎస్ తొమ్మిది స్థానాల్లో విజయం సాధించింది.
PM--Modi5
న్యూఢిల్లీ, మే 23: దేశమంతా మోదీ నినాదం మారుమోగింది. తిరుగులేని విజయం సాధించిన బీజేపీ.. రెండోసారి అధికార పగ్గాలు చేపట్టబోతున్నది. ప్రధాని నరేంద్రమోదీ జాతీయవాదం, జాతీయభద్రత, హిందూత్వ నినాదాలు దేశవ్యాప్తంగా ఓటర్లను ఆకర్షించాయి. సమకాలీన భారతదేశ చరిత్రలో తిరుగులేని నాయకుడిగా మోదీని నిలబెట్టాయి. పూర్తిస్థాయి మెజార్టీతో రెండోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించబోతున్న ఘనతను నరేంద్రమోదీ ఈ ఎన్నికల్లో సాధించారు. అబ్‌కీ బార్ తీన్‌సౌ పార్ అన్న మోదీ నినాదం ముందు కాంగ్రెస్ అధ్యక్షుడి చౌకీదార్ చోర్‌హై నినాదం నిలువలేకపోయింది. మొత్తం 542 స్థానాలకు ఎన్నికలు జరుగగా, బీజేపీ సొంతంగా 303 స్థానాల్లో విజయం సాధించి చరిత్ర సృష్టించింది. ప్రతిపక్షాలను ఛిన్నాభిన్నం చేసింది. కాంగ్రెస్ ఆశలపై నీళ్లు కుమ్మరించింది. ఆ పార్టీని 52 సీట్లకు పరిమితంచేసింది. గత ఎన్నికల్లో బీజేపీ 282 స్థానాలు సాధించింది. భాగస్వామ్య పక్షాలతో కలుపుకొని 336 స్థానాల్లో గెలుపొందగా, ఈసారి ఆ రికార్డును తిరగరాస్తూ 349 స్థానాల్లో ఎన్డీయే జయకేతనం ఎగురవేసింది. మరోసారి మోదీ ప్రధాని కానున్నారని తొలి ఫలితాల్లోనే వెల్లడికావడంతో వివిధ రాష్ర్టాల్లో బీజేపీ శ్రేణులు పండుగచేసుకున్నాయి. పార్టీ కార్యకర్తలు, నేతలు పటాకులు కాల్చుతూ, నృత్యాలు చేస్తూ, మిఠాయిలు తినిపించుకున్నారు. మోదీ తాను పోటీచేసిన వారణాసి నియోజకవర్గంలో 4.79 లక్షల మెజార్టీతో గెలుపొందగా, పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా గాంధీనగర్‌లో 5.5 లక్షల పైచిలుకు మెజార్టీ సాధించారు. ఎన్నికల ఫలితాలతో స్టాక్‌మార్కెట్లు ఎగిసిపడ్డాయి. సెన్సెక్స్ తొలిసారి 40వేలను దాటగా, నిఫ్టీ 12వేల మార్కును అధిగమించింది. అటు డాలరుతో రూపాయి మారకం విలువ 14 పైసలు పెరిగి.. రూ.69.51కి చేరుకున్నది.

హిందీయేతర రాష్ర్టాల్లోనూ బీజేపీ హవా

మోదీ హవా ఊహించిన విధంగా కేవలం హిందీ రాష్ర్టాలు, గుజరాత్‌లోనే కాకుండా పశ్చిమబెంగాల్, ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటకల్లోనూ తీవ్రంగానే ఉన్నది. దక్షిణాదిలో కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఇందుకు మినహాయింపు. తెలంగాణలో ఏమీ రావనుకున్నప్పటికీ నాలుగు స్థానాల్లో విజయం సాధించింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలోనూ బీజేపీ గణనీయమైన ఫలితాలు రాబట్టింది. మధ్యప్రదేశ్‌లో 29కిగాను 28 స్థానాల్లో, రాజస్థాన్‌లో 25 సీట్లకుగాను 24 స్థానాల్లో జయభేరి మోగించింది. ఛత్తీస్‌గఢ్‌లో 11కుగాను 9 స్థానాల్లో బీజేపీ, రెండింటిలో కాంగ్రెస్ గెలుపొందాయి. హర్యానాలో పది సీట్లకుగాను తొమ్మిదింటిలో బీజేపీ అభ్యర్థులు గెలిచారు. ఒడిశాలో, బీహార్, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమబెంగాల్‌లోనూ బీజేపీ ఇదే తరహాలో విజయాలు సాధించింది.
Rahul--Cong
మెజార్టీ అసెంబ్లీ స్థానాలు గెలిచి ప్రతిపక్షంలో కూర్చొన్న కర్ణాటకలో మొత్తం 28 స్థానాలకుగాను 25 సీట్లను గెలుచుకున్నది. ఒకప్పుడు కమ్యూనిస్టులకు కంచుకోటగా భాసిల్లిన బెంగాల్‌లో వామపక్షాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. మొట్టమొదటిసారి లోక్‌సభలో బెంగాల్ నుంచి లెఫ్ట్ పార్టీలకు ప్రాతినిధ్యం లేకుండాపోయింది. ఏపీలో 22 సీట్లలో వైసీపీ విజయం సాధించింది. టీడీపీ మూడు సీట్లతో సరిపెట్టుకున్నది. తమిళనాడులో డీఎంకే తనకు తిరుగులేదని నిరూపించుకున్నది. ఇక్కడ 38స్థానాలకు గాను 23 సీట్లలో డీఎంకే, 8 స్థానాల్లో కాంగ్రెస్, 3 స్థానాల్లో లెఫ్ట్ పార్టీలు గెలిచాయి. కేరళలో కాంగ్రెస్‌కు కాస్తంత ఊరటనిచ్చే ఫలితాలు వెలువడ్డాయి. ఇక్కడ 20 సీట్లకుగాను కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్ 18 స్థానాలు కైవసంచేసుకున్నది. ఈ ఎన్నికల ఫలితాలు రాహుల్‌గాంధీ నాయకత్వంపై ప్రశ్నలు రేకెత్తించాయి. ఒక దశలో ఆయన పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారని, ఆయనను తల్లి సోనియాగాంధీ అనునయించారని వార్తలు వచ్చాయి. ఈ విషయంపై మీడియా సమావేశంలో మాట్లాడేందుకు రాహుల్‌గాంధీ తిరస్కరించారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు శుక్రవారం పార్టీ నాయకత్వం సమావేశం కానున్నదని వెల్లడించారు.

యూపీలో పట్టు నిలబెట్టుకొన్న బీజేపీ

రాజకీయంగా అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ, బీఎస్పీలు మహాకూటమి పేరుతో గట్టిపోటీనిచ్చినా.. అక్కడ బీజేపీ తన ప్రాభవాన్ని కాపాడుకున్నది. గత ఎన్నికల్లో యూపీలో 80 స్థానాలకు గాను 71 సీట్లు గెలిచిన బీజేపీ.. ప్రస్తుతం 62 స్థానాల్లో పట్టు నిలబెట్టుకోగలిగింది. వాస్తవానికి ఎగ్జిట్‌పోల్స్‌లో బీజేపీకి కేవలం 30-40 మధ్య సీట్లు లభిస్తాయని అంచనావేసినా.. మెరుగైన ఫలితాలు రాబట్టింది. ఎస్పీ 8, బీఎస్పీ 11 స్థానాలతో సరిపెట్టుకున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ తీవ్ర పరాభవానికి గురైంది. ఒక్క సోనియాగాంధీ తప్ప ఆ పార్టీ నుంచి ఎవరూ యూపీలో గెలువలేదు. ఆఖరుకు పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఘోరపరాజయం పాలయ్యారు. అయితే.. కేరళలోని వయనాడులో మాత్రం రికార్డుస్థాయి మెజార్టీతో గెలువడంతో పరువు దక్కినట్టయింది. మొత్తంగా 13 రాష్ర్టాల్లో కాంగ్రెస్‌కు ఒక్క స్థానం కూడా లభించలేదు.

జాతీయభద్రతకు జై

గత ఐదేండ్లలో పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వంటి నిర్ణయాలతో సాధారణ ప్రజలు, వ్యాపారస్థులు తీవ్ర ఇబ్బందులకు గురైనా.. తన పరిపాలనాకాలంలో చేపట్టిన కార్యక్రమాలు, ప్రత్యేకించి ఎన్నికల ముందు పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదుల దాడి, దానికి ప్రతీకారంగా భారత సైనిక దళాలు పీవోకేలోని బాలాకోట్‌లోని ఉగ్రశిబిరాలపై నిర్వహించిన మెరుపుదాడులు బీజేపీకి బాగా కలిసివచ్చాయి. ఈ దాడుల నేపథ్యంలో జాతీయభద్రత, జాతీయవాదం, హిందూత్వ కీలక అంశాలుగా మోదీ నిర్వహించిన సుదీర్ఘ ఎన్నికల ప్రచారం ప్రజల్లో ఆయన పట్ల సంపూర్ణ సానుకూలతను తీసుకొచ్చింది. కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలపై తరచూ నిప్పులు చెరగటంతోపాటు.. దేశం ఎదుర్కొంటున్న కష్టాలకు, అంతులేని అవినీతికి దశాబ్దాల తరబడి పాలించిన కాంగ్రెస్ పార్టీయే కారణమంటూ మోదీ చేసిన విమర్శలు జనంలోకి వెళ్లాయి. బీజేపీ విభజన రాజకీయాలకు పాల్పడుతున్నదని, జాతీయవాదాన్ని రెచ్చగొడుతున్నదని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శలు గుప్పించినా.. ఫలితాలనివ్వలేకపోయాయి.
PM--Modi1

29న మోదీ ప్రమాణం!

-తన ట్విట్టర్ ఖాతాలో పేరుకుముందున్నచౌకీదార్ పదం తొలిగింపు
-అది శరీరంలో ఓ భాగమైపోయిందన్న మోదీ

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఇప్పుడు అందరి చూపు ప్రధానిగా మోదీ ఎప్పుడు ప్రమాణం చేస్తారన్నదానిపై పడింది. ఆయన ఈ నెల 29న రెండోసారి భారత ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. మరోవైపు ఈ ఎన్నికల్లో విస్తృత ప్రచారం పొందిన చౌకీదార్ అనే పదాన్ని ప్రధాని మోదీ తన ట్విట్టర్ ఖాతా నుంచి తొలిగించారు. కానీ ఈ పదం తన శరీరంలో ఓ భాగంగా మారిపోయిందని, ఇకపై తనతోనే కొనసాగుతుందని మోదీ చెప్పారు. చౌకీదార్ చోర్ హై అంటూ ప్రతిపక్షాలు తరుచుగా విమర్శిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ మై బీ చౌకీదార్ (నేను కూడా కాపలాదారుడినే) అనే నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు. తన ట్విట్టర్ ఖాతాలో పేరుకుముందు చౌకీదార్ అనే పదాన్ని జత చేశారు. ఆయనను చూసి పలువురు మంత్రులు, బీజేపీ నాయకులు కూడా ట్విట్టర్ ఖాతాలో తమ పేరుకుముందు చౌకీదార్ అనే పదాన్ని జత చేసుకున్నారు. ప్రధాని మోదీ తన ట్విట్టర్ ఖాతాలో స్పందిస్తూ దేశాన్ని మరింత అభివృద్ధి పథంలో నడించి చౌకీదార్ స్ఫూర్తిని విస్తృతం చేసే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు.

మిత్రమా.. నరేంద్రమోదీ, ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు అభినందనలు. ఈ ఎన్నికల ఫలితాలు ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని నడిపించిన మీ నాయకత్వానికి మరో ఆమోదంగా నిలుస్తాయి. భారత్-ఇజ్రాయెల్ మధ్య మన స్నేహ బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు కలిసికట్టుగా కృషిచేద్దాం. వెలడన్ మై ఫ్రెండ్..
-బెంజమిన్ నెతన్యాహు, ప్రధానమంత్రి, ఇజ్రాయెల్

మీ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో విజయం సాధిస్తున్న నేపథ్యంలో నా హృదయ పూర్వక అభినందనలు తెలుపుతున్నాను. ప్రధాన పొరుగుదేశాలైన చైనా-భారత్ ప్రపంచంలో ఆర్థికంగా ఎదుగుతున్న రెండు అతిపెద్ద దేశాలు. ఇటీవలి కాలంలో ఇరుదేశాల సంబంధాల అభివృద్ధికి రెండు వైపుల నుంచి గట్టి చర్యలు కొనసాగుతున్నాయి. ప్రధాన సమస్యలపై ఇరుదేశాల మధ్య మంచి సహకారం కొనసాగుతున్నది. చైనా-భారత్ బంధం బలోపేతాన్ని కోరుకుంటూ ద్వైపాక్షిక సంబంధాలు, రాజకీయ పరస్పర విశ్వాసానికి, రెండు దేశాల అభివృద్ధిని నూతన శిఖరాలకు చేర్చేందుకు మీతో కలిసి పనిచేయాలని ఉంది. మీ ఆరోగ్యానికి, అన్ని విజయాలకు నా శుభాకాంక్షలు..
-జిన్‌పింగ్, చైనా అధ్యక్షుడు

రష్యా-భారత దేశాల ప్రజల మధ్య ఉన్న శతాబ్దాల స్నేహ బంధాన్ని కొనసాగిస్తూ, వ్యూహాత్మక భాగస్వామ్యంతో ఇరు దేశాల సర్వతోముఖాభివృద్ధికి భారత ప్రధానిగా మీరు మరింతగా పాటుపడుతారని నేను విశ్వసిస్తున్నాను. అంతర్జాతీయ వ్యవహారాలను చక్కబెట్టేందుకు ఫలవంతమైన వ్యక్తిగత సంబంధాలను కొనసాగిస్తూ మోదీతో కలిసి పనిచేసేందుకు సిద్ధం.
-వ్లాదిమిర్ పుతిన్, రష్యా అధ్యక్షుడు

ప్రజాస్వామ్యంలో ప్రజామోదమే శక్తిమంతమైందని మేం నమ్ముతున్నాం. దేశ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నాం.. బీజేపీ గెలుపును అభినందిస్తున్నాం. రానున్న పదవీకాలానికి ప్రధాని మోదీకి మా శుభాకాంక్షలు.. ప్రధాని ముందుముందు మంచి పనులు చేస్తారని విశ్వసిస్తున్నాం.
-సౌరభ్ భర్వాజ్, ఆప్ అధికారప్రతినిధి

గౌరవనీయ ప్రియమైన నరేంద్రమోదీజీ.. హృదయ పూర్వక అభినందనలు.. మీరు సాధించి చూపారు! గాడ్ బ్లెస్..
-రజనీకాంత్, సూపర్‌స్టార్

కలిసి పనిచేస్తాం

-భారత్‌లో ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగాయి: అమెరికా
భారత్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన వారితో కలిసి పనిచేస్తామని అమెరికా ప్రకటించింది. లోక్‌సభ ఎన్నికలు స్వేచ్ఛగా, సమగ్రంగా జరిగాయన్న విశ్వాసంలో మేము ఉన్నాం. అధికారంలోకి వచ్చే ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం అని అమెరికా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి మోర్గాన్ ఓర్టగస్ చెప్పారు. భారత్, అమెరికా మధ్య దృఢమైన సంబంధాలున్నాయి. చాలా అంశాల్లో ఇరుదేశాలు సహకరించుకోవడం, కలిసి పనిచేయడం జరుగుతున్నది. మేము భారత్‌కు నిజమైన వ్యూహాత్మక మిత్రులమని మా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో కూడా చాలా సార్లు చెప్పారు అని మోర్గాన్ పేర్కొన్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో భారత ప్రజలు ఎంతో ఓర్పుగా, శాంతియుతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారని, వారి సహనం అద్భుతమని కొనియాడారు. మరోవైపు అమెరికాలోని వాషింగ్టన్ పోస్ట్ పత్రిక కూడా భారత ఎన్నికల నిర్వహణపై ప్రశంసలు కురిపించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో 90 కోట్ల మంది ఓటర్లు ఉండటం, వారిలో దాదాపు 55 కోట్లకుపైగా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవడం గొప్ప విషయమని పేర్కొంది.

బీజేపీ జాతీయవాదం పనిచేసింది: సురవరం

లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బీజేపీ చెప్పిన జాతీయవాద వృత్తాతం దాని గెలుపులో కీలక పాత్ర పోషించిందని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. కర్ణాటక, ఉత్తరాది రాష్ర్టాల్లో బీజేపీ జాతీయవాదం బాగా పనిచేసినట్టుగా అనిపిస్తున్నదని అభిప్రాయపడ్డారు. గురువారం ఎన్నికల ఫలితాల సందర్భంగా ఆయన పీటీఐతో మాట్లాడుతూ.. బీజేపీకి జాతీయవాదం పనిచేసింది. బీజేపీపై ప్రతిపక్షాలు చేసిన నిరుద్యోగం, ధరల పెరుగుదల, హామీలు అమలుచేయకపోవడం, కమీషన్లు తీసుకోవడం వంటి ఆరోపణలు ముఖ్యంగా ఉత్తరాది రాష్ర్టాల్లో జాతీయవాదం ముందు నిలువలేకపోయాయి అని అన్నారు. లెఫ్ట్ పార్టీలు, కాంగ్రెస్ మధ్య అవగాహన లేమి పశ్చిమబెంగాల్‌లో బీజేపీ బాగా పుంజుకోవడానికి దోహదం చేసిందని పేర్కొన్నారు.
PM--Modi2

1697
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles