అమిత్‌షా రోడ్‌షోలో హింస


Wed,May 15, 2019 02:12 AM

BJP National President Shri Amit Shahs Roadshow in North Kolkata West Bengal

- కోల్‌కతాలో రాళ్లు, కర్రలతో కొట్టుకున్న బీజేపీ, తృణమూల్ కార్యకర్తలు
- ఈశ్వర్‌చంద్ర విద్యాసాగర్ విగ్రహం ధ్వంసం
- బీజేపీ అధ్యక్షుడిని గూండా అని విమర్శించిన మమత
- ఆమెనే హింసను రెచ్చగొట్టిందని ఆరోపించిన అమిత్‌షా


కోల్‌కతా, మే 14: బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా కోల్‌కతా వీధుల్లో జరిపిన రోడ్‌షో రణరంగంగా మారింది. బీజేపీ, తృణమూల్ కార్యకర్తలు పరస్పరం ఘర్షణకు దిగడంతో హింస ప్రజ్వరిల్లింది. దీంతో రోడ్‌షోను మధ్యలోనే నిలిపివేసిన పోలీసులు అమిత్‌షాను సురక్షిత ప్రదేశానికి తరలించారు. చివరి విడుత ఎన్నికల్లో భాగంగా ఈ నెల 19న పశ్చిమ బెంగాల్‌లో మిగిలిన 9 సీట్లకు పోలింగ్ జరుగనుండగా, కోల్‌కతాలో మంగళవారం బీజేపీ బలప్రదర్శనకు దిగింది. ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా జరిపిన రోడ్‌షోకు భారీగా జనాన్ని సమీకరించారు. ఎస్‌ప్లనేడ్ నుంచి స్వామి వివేకానంద పూర్వీకుల ఇంటి వరకు రోడ్‌షో జరుగాలి. విద్యాసాగర్ కాలేజీ వద్దకు ప్రదర్శన చేరుకోగానే ఘర్షణ మొదలైంది. కాలేజీ హాస్టల్‌లో ఉన్న కొందరు తృణమూల్ కాంగ్రెస్ మద్దతుదారులు అమిత్‌షా కాన్వాయ్‌పైకి రాళ్లు రువ్వినట్టు తెలిసింది. దీంతో ఆగ్రహం తో ఊగిపోయిన బీజేపీ కార్యకర్తలు విధ్వంసానికి దిగారు. కాలేజీ వెలుపల పార్కింగ్ చేసి ఉన్న మోటార్‌సైకిళ్లకు నిప్పు పెట్టారు. కర్రలు, రాళ్లతో హాస్టల్‌లో ఉన్న వారిపై దాడికి దిగారు. కాలేజీ లాబీలోనిఈశ్వర్‌చంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు.

ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పడంతో.. అమిత్‌షా ర్యాలీకి భద్రతగా ఉన్న పోలీసులు అల్లరిమూకలను తరిమివేసేందుకు ప్రయత్నించారు. అంతకుముందు కూడా కలకత్తా యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. అమిత్‌షాకు కొందరు నల్లజెండాలు చూపి, ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వెంటనే పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కోల్‌కతాలో మంగళవారం మధ్యాహ్నం నుంచే ఉద్రిక్తత నెలకొంది. రోడ్లపై అతికించిన బీజేపీ పోస్టర్లను పోలీసులు తొలిగించడాన్ని నిరసిస్తూ బీజేపీ నేతలు కైలాశ్ విజయ వర్గీయ, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బైఠాయించారు. మహిళలు సంప్రదాయ బెంగాలీ దుస్తుల్లో, గిరిజనులు బాణాలు, విల్లంబులతో వచ్చారు. మరికొంద రు రాముడు, హనుమంతుడు తదితర వేషాలతో పాల్గొన్నారు. ఆ మార్గమంతా జై శ్రీరాం, మోదీ మోదీ నినాదాలతో దద్దరిల్లింది. కొందరు భవనాలపై నుంచి అమిత్‌షాపై పూల వర్షం కురిపించారు. రోడ్‌షో విజయవంతం కావడంతో అమిత్‌షా హర్షం వ్యక్తం చేస్తూ, ఈసారి 282 కన్నా ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందన్నారు.
BJP

తృణమూల్ గూండాలు నాపై దాడికి యత్నించారు: అమిత్‌షా

తృణమూల్ గూండాలు తనపై దాడి చేసేందుకు ప్రయత్నించారని అమిత్‌షా ఓ హిందీ టీవీ చానెల్‌తో చెప్పారు. మమతా బెనర్జీ (బెంగాల్ సీఎం) హింసను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారని, కానీ తాను సురక్షితంగా బయటపడ్డానన్నారు. ఘర్షణ సమయంలో పోలీసులు మౌన ప్రేక్షకులుగా ఉన్నారన్నారు. రోడ్‌షోలో హింసపై కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ స్పందిస్తూ, బెంగాల్లో గూండాలు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా అని విమర్శించారు.
BJP1

గూండాఅనిగాక ఏమనాలి?: మమత

అమిత్‌షా ఆరోపణలను పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ వెంటనే తిప్పి కొట్టారు. బీజేపీ అధ్యక్షుడిని ఆమె గూండా అని విమర్శించారు. ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ (విగ్రహం)పై చేయి వేసిన (ధ్వంసం చేసిన) నిన్ను గూండా అని కాక ఏమని పిలవాలి? అని ఆమె నిలదీశారు. మీ భావజాలాన్ని, విధానాలను నేను ద్వేషిస్తాను అని ధ్వజమెత్తారు. విద్యాసాగర్ విగ్రహం ధ్వంసానికి నిరసనగా గురువారం ప్రదర్శనకు పిలుపునిచ్చారు. బీజేపీ కార్యకర్తలు పార్టీ జెండాలతో కాలేజీలోకి వచ్చి తమను దూషించారని, ఆఫీసును, ఇతర గదులను ధ్వంసం చేశారని, గేట్లకు తాళం వేసి వాహనాలకు నిప్పు పెట్టారని విద్యాసాగర్ కళాశాల ప్రిన్సిపాల్ గౌతం కుందూ చెప్పారు.

892
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles