కమలంపై ఓట్ల వర్షం


Fri,May 24, 2019 03:03 AM

BJP vote share cross 40 per cent votes

-40 శాతానికిపైగా ఓట్లు సాధించిన బీజేపీ
-దేశ చరిత్రలో ఇది నాలుగోసారి మాత్రమే

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా రెండోసారి విజయం సాధించి అధికారానికి వచ్చిన బీజేపీ భారత రాజకీయాలలో తన ఆధిపత్యాన్ని చాటింది. 300 వరకు సీట్లు పొందిన బీజేపీ 40 శాతానికి మించి ఓట్లను సాధించినట్టు తెలుస్తున్నది. స్వాతంత్య్రానంతరం దేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఇలా అత్యధిక ఓటింగ్ శాతంతో ఒకే పార్టీ పూర్తి ఆధిపత్యం చాటడం ఇది నాలుగోసారి. అయితే 1984లో కాంగ్రెస్ పార్టీ పొందిన ఓట్ల శాతాన్ని మాత్రం ఇంతవరకు మరే ఇతర రాజకీయ పార్టీ అధిగమించలేదు. నాటి ప్రధాని ఇందిరాగాంధీని ఆమె భద్రతా సిబ్బంది కాల్చి చంపిన అనంతరం జరిగిన ఆ ఎన్నికల్లో ప్రజల సానుభూతి కాంగ్రెస్‌కు లాభించింది. నాటి ఎన్నికల్లో 48.1 శాతం ఓట్లు పొందిన కాంగ్రెస్.. లోక్‌సభలో 415 సీట్లను గెలుచుకుంది. 1977, 1980లో జరిగిన ఎన్నికలలో గెలిచిన పార్టీలు కూడా 40 శాతాన్ని మించి ఓట్లు సాధించాయి.

ఇందిరాగాంధీ దేశంలో విధించిన ఎమర్జెన్సీ అనంతరం 1977లో జరిగిన ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని తిరస్కరించి, జనతా పార్టీకి పట్టం గట్టారు. ఆ ఎన్నికల్లో జనతా పార్టీ 41.3 శాతం ఓట్లతో 295 సీట్లను గెలుపొందింది. అయితే అంతర్గత కలహాలతో జనతా పార్టీ ప్రభుత్వం మధ్యంతరంగానే కుప్పకూలడంతో 1980లో మళ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో పుంజుకున్న కాంగ్రెస్ భారీ విజయాన్ని నమోదు చేసింది. మొత్తం పోలైన ఓట్లలో 42.7 శాతం ఓట్లను తెచ్చుకున్న కాంగ్రెస్ 353 స్థానాలను గెలుచుకుంది. ఈ మూడు సందర్భాలలో మినహా కేంద్రంలో అధికారానికి వచ్చిన ఏ ఇతర పార్టీ 40 శాతాన్ని మించి ఓట్లను పొందలేదు. కానీ ఈసారి (2019లో) బీజేపీ ఆ మైలురాయిని దాటేలా కనిపిస్తున్నది. 1977లో దేశమంతా జనతా పార్టీ హవా సాగినా, ఏపీ (42లో 41), కర్ణాటక (28లో 26)లో అత్యధికసీట్లు గెలుచుకొని కాంగ్రెస్ ఆధిక్యతను చాటింది. 1980లో దేశమంతా కాంగ్రెస్ విజయ దుందుభి మోగించినా పశ్చిమ బెంగాల్‌లో మాత్రం వామపక్షాలను ఓడించలేకపోయింది.

ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ నాలుగు సీట్లు మాత్రమే గెలుచుకుంది. తిరిగి ఇప్పుడు బీజేపీ దక్షిణాదిలోని తమిళనాడు, ఏపీ మినహా దాదాపు అన్ని రాష్ర్టాలలో సీట్లను గెలుపొందింది. గత (2014) ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ (282) సీట్లను గెలుపొందినప్పటికీ ఆ పార్టీకి లభించింది 31 శాతం ఓట్లు మాత్రమే. ప్రస్తుత ఎన్నికల్లో వెలువడుతున్న ఫలితాలను బట్టి చూస్తే ఆ పార్టీ 40 శాతం మించి ఓట్లను పొందినట్టు తెలుస్తున్నది. కాంగ్రెస్ పార్టీ 2014తో పోలిస్తే 4 శాతం ఓట్లను అధికంగా పొందినా సీట్ల సంఖ్య లో మాత్రం గణనీయమైన మార్పు కనిపించడం లేదు. ముఖ్యంగా హిందీ రాష్ర్టాలైన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన కాంగ్రెస్.. లోక్‌సభ ఎన్నికలలో మాత్రం చతికిలబడింది.
New-Delhi-BJP1

293
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles