కర్ణాటకలో కమల వికాసం


Fri,May 24, 2019 03:03 AM

BJP wins 25 of 28 seats in Karnataka

- 25 స్థానాల్లో బీజేపీ విజయం
- 2 సీట్లకే కాంగ్రెస్-జేడీఎస్ కూటమి పరిమితం
- మండ్యలో సుమలత గెలుపు
- ఓటమిపాలైన దేవెగౌడ, ఖర్గే


బెంగళూరు, మే 23: కర్ణాటక లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయదుందుభి మోగించింది. రాష్ట్రంలోని మొత్తం 28 లోక్‌సభ స్థానాల్లో కాషాయ పార్టీ 25 స్థానాల్లో ఘనం విజయం సాధించింది. అధికార జేడీఎస్-కాంగ్రెస్ కూటమి కేవలం రెండు స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్, జేడీఎస్ చెరో స్థానంలో గెలుపొందాయి. మండ్య నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి సుమలత విజయం సాధించారు. బీజేపీ ఘన విజయం నేపథ్యంలో కర్ణాటక సంకీర్ణ సర్కారు మనుగడపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల ఫలితాల సరళిని బట్టి చూస్తే క్షేత్రస్థాయిలో జేడీఎస్-కాంగ్రెస్ మధ్య పొత్తు బెడిసికొట్టినట్లు స్పష్టమవుతున్నది. ఇప్పటివరకు ఎన్నికల్లో ఓటమి ఎరుగని కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత ఖర్గే.. గుల్బర్గా లోక్‌సభ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఉమేశ్ జాదవ్ చేతిలో ఓటమి చవిచూశారు. మరోవైపు తుమకూరు నుంచి పోటీచేసిన దేవేగౌడ.. బీజేపీ అభ్యర్థి జీఎస్ బసవరాజ్ చేతిలో పరాజయం పాలయ్యారు. దేవేగౌడ మనవడు, సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడపై స్వతంత్ర అభ్యర్థి, దివంగత నేత అంబరీశ్ భార్య సుమలత విజయం సాధించారు. హసన్ లోక్‌సభ నుంచి పోటీచేసిన దేవేగౌడ మరో మనవడు, మంత్రి హెచ్‌డీ రేవన్న కుమారుడు ప్రజ్వల్ రేవన్న బీజేపీ అభ్యర్థి ఏ మజ్నుపై గెలుపొందారు. తన మనవడి కోసం దేవేగౌడ ఈసారి హసన్ నుంచి తుమకూరుకు మారారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు వీరప్ప మొయిలీ(చిక్కబళ్లాపూర్), కేహెచ్ మునియప్ప (కోలార్) ఓటమిపాలయ్యారు.

మరోవైపు కేంద్ర మంత్రులు డీవీ సదానంద గౌడ (బెంగళూర్ నార్త్), అనంత కుమార్ హెగ్డే (ఉత్తర కన్నడ), రమేశ్ జిగజినగి(బీజాపూర్) విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థులు బచే గౌడ (చిక్‌బళ్లాపూర్), అన్నాసాహెబ్ జొల్లే (చిక్కోడి), తేజస్వి సూర్య(బెంగళూరు సౌత్), భగవంత్ ఖుబా(బీదర్), నారాయణస్వామి (చిత్రదుర్గ), నళిన్ కుమార్ కతిల్ (దక్షిణ కన్నడ), జీఎం సిద్దేశ్వర్ (దావనగెరె), పీసీ మోహన్ (బెంగళూరు సెంట్రల్), ప్రతాప్ సింహా (మైసూర్), ప్రహ్లాద్ జోషి (ధార్వాడ్), ఉదాసి (హవేరీ), మునిస్వామి (కోలార్), కరాడి స్నగన్న (కొప్పల్), రాఘవేంద్ర (శివమొగ్గ), చందనగౌడ (బాగల్‌కోట్), సురేశ్ అన్గడి (బెల్గాం), దేవేంద్రప్ప (బళ్లారి), శ్రీనివాస్ ప్రసాద్(చామరాజనగర్) విజయం సాధించారు. బెంగళూరు రూరల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి డీకే సురేశ్ బీజేపీ అభ్యర్థి అశ్వర్థనారాయణ గౌడ్‌పై గెలుపొందారు.
Bengaluru1

295
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles