పెద్దలకు 1,800 కోట్లు


Sat,March 23, 2019 03:38 AM

BS Yeddyurappa paid rs 1800 crore to top BJP leaders and judges

-బీజేపీ అధిష్ఠానానికి కోట్లలో ముడుపులు సమర్పించుకున్న యడ్యూరప్ప
-అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కరీకి ఒక్కొక్కరికి150 కోట్లు
-రాజ్‌నాథ్‌సింగ్‌కు100 కోట్లు
-అద్వానీ, మురళీ మనోహర్ జోషీలకు ఒక్కొక్కరికి 50 కోట్లు
-గడ్కరీ కొడుకు పెండ్లికి రూ.10 కోట్లు
-న్యాయమూర్తులకు రూ.250 కోట్లు
-న్యాయవాదులకు రూ.50 కోట్లు
-సంచలనం సృష్టిస్తున్న యడ్యూరప్ప డైరీ
-కారవాన్ మ్యాగజైన్ కథనంతో రాజకీయ ప్రకంపనలు
న్యూఢిల్లీ, మార్చి 22: లోక్‌సభ ఎన్నికళ వేళ కమలనాథులకు గట్టి షాక్ తగిలింది. కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బీజేపీ పెద్దలకు రూ.1,800 కోట్లు ఇచ్చారన్న వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. యెడ్డీ డైరీస్ పేరుతో ది కారవాన్ మంత్లీ మ్యాగజైన్ ప్రచురించిన కథనం దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నది. బీజేపీ కేంద్ర కమిటీకి రూ.1,000 కోట్లు, అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కరీకి ఒక్కొక్కరికి రూ.150 కోట్ల చొప్పున, రాజ్‌నాథ్‌సింగ్‌కు రూ.100 కోట్లు, అలాగే బీజేపీ సీనియర్ నేతలైన ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీలకు ఒక్కొక్కరికి రూ.50 కోట్ల చొప్పున యడ్యూరప్ప అందజేసినట్లు డైరీలో రాసి ఉన్నది అని కారవాన్ మ్యాగజైన్ ప్రచురించింది. ఈ కథనం అటు కర్ణాటకలో, ఇటు దేశ రాజధానిలో పెనుదుమారం సృష్టించింది.

ఆరోపణలు అవాస్తవం: యడ్యూరప్ప

కారవాన్ మ్యాగజైన్ కథనం పూర్తిగా కల్పితమని, అవాస్తమని యడ్యూరప్ప అన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధి కోసమే కాంగ్రెస్ నేతలు తనపై తప్పుడు కథనాలు అల్లుతున్నారని విమర్శించారు. కారవాన్ మ్యాగజైన్ కథనం అవాస్తవం. వారు పేర్కొంటున్న పత్రాలు ఫోర్జరీ చేసినవని, నకిలీవని గతంలోనే ఐటీ అధికారులు ప్రకటించారు. ఆ డైరీలు, అందులోని చేతిరాత నాది కాదు. ఎవరో ఫోర్జరీ చేశారు. మోదీకి ఉన్న ప్రజాదరణను చూసి తట్టుకోలేకే కాంగ్రెస్ ఈ కుట్రకు తెరలేపింది. నాపై చేసిన ఆరోపణలు పూర్తిగా కల్పితం, అవాస్తవం. తప్పుడు కథనం ప్రచురించి నా ప్రతిష్ఠను దిగజార్చిన వ్యక్తులపై పరువునష్టం దావా వేస్తా అని పేర్కొన్నారు. యడ్యూరప్పపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు ఆ పార్టీ దయనీయ స్థితికి అద్దంపడుతున్నాయని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా విమర్శించారు. బీజేపీపై ఏం ఆరోపణలు చేయాలో తెలియక చివరకు ఫోర్జరీ అంశాన్ని తెరపైకి తెచ్చారు. కాంగ్రెస్ ప్రచారం గందరగోళంగా మారింది. వారిని ఫోర్జరీ కూడా కాపాడలేదు అని ఎద్దేవా చేశారు.

డైరీల్లో ఏమున్నది?

2009లో కర్ణాటక సీఎంగా యడ్యూరప్ప ఉన్నప్పుడు ఈ డైరీలను ఆయన స్వహస్తాలతో కన్నడ భాషలో రాసినట్లు కారవాన్ పేర్కొన్నది. ఇందులో బీజేపీ అగ్రనేతలకు రూ.1,800 కోట్లు ఇచ్చినట్లు తెలిపింది. అలాగే నితిన్ గడ్కరీ కుమారుడి వివాహం సందర్భంగా రూ. 10 కోట్లు చెల్లించినట్లు వెల్లడించింది. న్యాయమూర్తులకు రూ. 250 కోట్లు, వివిధ కేసుల్లో ఫీజుల నిమిత్తం న్యాయవాదులకు రూ. 50 కోట్లు అందజేసినట్లు వివరించింది. అయితే, ఇందులో న్యాయమూర్తులు, న్యాయవాదుల పేర్లు మాత్రం పేర్కొనలేదు. యడ్యూరప్ప నివాసంపై నిర్వహించిన ఐటీ దాడుల్లో ఈ డైరీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, 2017, ఆగస్టు నుంచి ఈ డైరీ ఐటీ విభాగం వద్ద ఉన్నప్పటికీ అటు ఐటీ అధికారులు, ఇటు బీజేపీ ప్రభుత్వం యడ్యూరప్పపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని కారవాన్ ప్రశ్నించింది.

లోక్‌పాల్‌తో విచారణ జరిపించాలి: కాంగ్రెస్


randeep
కారవాన్ కథనంపై కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు. బీజేపీ పెద్దలకు రూ.1,800 కోట్లు లంచం అందజేసిన వ్యవహారంలో లోక్‌పాల్‌తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బీజేపీ పెద్దలు రూ.1,800 కోట్లు తీసుకున్నారా? లేదా? అనే విషయాన్ని ప్రధాని మోదీ బహిరంగపర్చాలని కాంగ్రెస్ ముఖ్య అధికారప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా కోరారు. యడ్యూరప్ప నివాసంలో గతంలో జరిగిన ఐటీ దాడుల్లో అధికారులకు ఈ డైరీ దొరికింది. ఇందులో బీజేపీ పెద్దలకు కోట్లాది రూపాయలు చెల్లించినట్లు ఆయన రాశారు. డైరీలోని ప్రతి పేజీలో యడ్యూరప్ప సంతకం ఉన్నట్లు మ్యాగజైన్ తెలిపింది. ఇందులో ప్రతి ఒక్కరి పాత్రపై దర్యాప్తు చేపట్టాలి. ప్రధాని మోదీ నుంచి కింది స్థాయి నేత వరకూ అందరిపైనా అభియోగాలు నమోదు చేయాలి.

ఈ వ్యవహారంపై దేశ తొలి లోక్‌పాల్‌తో సమగ్ర విచారణ చేపట్టాలి అని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా యడ్యూరప్ప, కేంద్ర మాజీ మంత్రి అనంత్‌కుమార్‌ల మధ్య 2017, పిబ్రవరి 14న జరిగినట్లుగా చెబుతున్న సంభాషణను మీడియా సమావేశంలో రణ్‌దీప్ చదివి వినిపించారు. రూ.1000 కోట్ల లంచం విషయాన్ని వారిద్దరూ అప్పట్లో చర్చించారని పేర్కొన్నారు. డైరీని ప్రాథమిక సాక్ష్యంగా పరిగణించి బీజేపీ నేతలపై కేసులు నమోదు చేయాలని కోరారు. మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ట్విట్టర్‌లో స్పందిస్తూ.. బీజేపీ నేతలందరూ అవినీతి పరులే. బీజేపీ చౌకీదారులందరూ దొంగలే. నరేంద్రమోదీ, అరుణ్‌జైట్లీ, రాజ్‌నాథ్‌సింగ్‌తో సహా.. అంటూ విమర్శలు గుప్పించారు. యడ్యూరప్ప డైరీల్లోని నిజాల్ని నిగ్గుదేల్చాలని కర్ణాటక సీఎం కుమారస్వామి డిమాండ్ చేశారు.

1298
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles