మహా హరితకుడ్యం!

Thu,October 10, 2019 03:17 AM

- 1400 కి.మీ. పొడవు, 5 కి.మీ. వెడల్పుతో ఏర్పాటు
- గుజరాత్‌ నుంచి ఢిల్లీ-హర్యానా సరిహద్దు వరకు గ్రీన్‌బెల్ట్‌ను నిర్మించేందుకు కేంద్రం కసరత్తు
- పర్యావరణ మార్పులు, ఎడారీకరణను ఎదుర్కొనేందుకు బృహత్‌ ప్రణాళిక

న్యూఢిల్లీ: పర్యావరణ మార్పులు, ఎడారీకరణను ఎదుర్కొనేందుకు కేంద్రం బృహత్‌ ప్రణాళికను రచిస్తున్నది. ఆఫ్రికాలో సెనెగల్‌ నుంచి జిబౌతీ వరకు నిర్మించనున్న మహా హరితకుడ్యం (గ్రేట్‌ గ్రీన్‌ వాల్‌) తరహాలో గుజరాత్‌ నుంచి ఢిల్లీ-హర్యానా సరిహద్దుల వరకు 1,400 కి.మీ. పొడవు, 5 కి.మీ. వెడల్పుతో ‘గ్రీన్‌ బెల్ట్‌' ఏర్పాటుచేసేందుకు కసరత్తు చేస్తున్నది. ప్రస్తుతం ఇది ప్రాథమిక దశలోనే ఉన్నప్పటికీ, వివిధ మంత్రిత్వ శాఖల అధికారుల్లో ఇది తీవ్ర ఆసక్తిని కలిగిస్తున్నది. పోర్‌బందర్‌ (గుజరాత్‌) నుంచి పానిపట్‌ (హర్యానా) వరకు గ్రీన్‌ బెల్ట్‌ ఏర్పాటుచేయడం ద్వారా నిస్సార భూములను పునరుజ్జీవింపజేయడంతోపాటు.. పశ్చిమ భారతం, పాకిస్థాన్‌ ఎడారుల నుంచి వచ్చే దుమ్ము, ధూళిని అడ్డుకోవచ్చని అధికారులు చెప్తున్నారు. ఇందులో భాగంగా గుజరాత్‌, రాజస్థాన్‌, హర్యానా, ఢిల్లీ వరకు విస్తరించిన ఆరావళి పర్వత శ్రేణుల గుండా అడవులను పెంచనున్నారు.

ఆరావళి శ్రేణి గుండా..

‘భారత్‌లో ఇటీవల నిర్వహించిన యూఎన్‌సీసీడీ (ఎడారీకరణను ఎదుర్కొనేందుకు ఐక్యరాజ్యసమితి సమ్మేళనం- కాప్‌14) సదస్సు ఎజెండాలో భాగమే గ్రీన్‌ బెల్ట్‌ ఏర్పాటు యోచన. అయితే ఇందుకు ఇంకా తుది అనుమతి రాలేదు’ అని ఒక అధికారి వెల్లడించారు. 2030 నాటికి 26 మిలియన్‌ హెక్టార్ల నిస్సార భూములను సారవంతం చేయాలన్న లక్ష్యానికి అనుగుణంగా జాతీయ ప్రాధాన్యత కింద భారత్‌ గ్రీన్‌ బెల్ట్‌ ఏర్పాటు చేసేందుకు యోచిస్తున్నది. ప్రాజెక్టుకు ఆమోదం లభించగానే, రైతులను, ఇతర ప్రైవేట్‌ భూముల యజమానులను కలుపుకొని నిస్సారమైన అటవీ భూముల్లో అటవీకరణ చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. 26 మిలియన్‌ హెక్టార్ల నిస్సార భూమిని సారవంతం చేయాలన్న భారత లక్ష్యసాధనలో ఆరావళి జోన్‌ ప్రధానమైనది. దేశంలో ప్రస్తుతం 96.4 మిలియన్‌ హెక్టార్ల నిస్సార భూమి ఉన్నది. దేశం మొత్తం భూభాగంలో ఇది 29.3 శాతం. 2016లో ఇస్రో రూపొందించిన ఎడారీకరణ అట్లాస్‌ ప్రకారం.. దేశంలోని మొత్తం నిస్సార భూమిలో 50 శాతం భూభాగం గుజరాత్‌, రాజస్థాన్‌, ఢిల్లీలోనే ఉన్నట్లు వెల్లడైంది.
Greenwall1

ఉత్తర, దక్షిణ కొరియాలు కూడా..

గ్రేట్‌ గ్రీన్‌ వాల్‌ను సాకారం చేసేందుకు సహకరించాలని కాప్‌14 సందర్భంగా ఆఫ్రికన్‌ దేశాలు అంతర్జాతీయ సమాజాన్ని కోరాయి. యూఎన్‌సీసీడీ, ప్రపంచబ్యాంకు, యూరోపియన్‌ కమిషన్‌ సహకారంతో దశాబ్దం కిందట ఆఫ్రికన్‌ యూనియన్‌ ఈ ప్రాజెక్టును చేపట్టింది. అయితే ఇప్పటివరకు 15% మాత్రమే పూర్తయింది. గ్రేట్‌ గ్రీన్‌ వాల్‌ తరహాలో ఉత్తరకొరియా, దక్షిణకొరియాలు సైనిక రహిత జోన్‌ సహా ఇరు దేశాల ఘర్షణాత్మక ప్రాంతాల్లో పీస్‌ ఫారెస్ట్‌ ఇనిషియేటివ్‌(పీఎఫ్‌ఐ) పేరిట అడవులను అభివృద్ధి చేయాలని నిర్ణయించాయి. పెరు, ఈక్వెడార్‌ కూడా పీస్‌ పార్క్‌ను ఏర్పాటుచేయాలని యోచిస్తున్నాయి.

1252
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles