పట్నాయక్‌కే పట్టం


Fri,May 24, 2019 03:18 AM

CM Naveen Patnaik thanks Odisha people for fifth Assembly poll victory

-ఒడిశాలో బీజేడీ ప్రభంజనం
- 113 స్థానాల్లో ఆధిక్యం
-వరుసగా ఐదోసారి అధికారం
-22 చోట్ల ఆధిక్యంతో రెండోస్థానంలో నిలిచిన బీజేపీ
-కాంగ్రెస్‌కు 10 చోట్ల ఆధిక్యం.. విపక్ష హోదా గల్లంతు!

భువనేశ్వర్: ఒడిశాలో మరోసారి బిజూ జనతాదళ్ (బీజేడీ) ప్రభంజనం సృష్టించింది. ముఖ్యమంత్రి నవీన్‌పట్నాయక్ పనితీరుకు ముగ్ధులైన ఆ రాష్ట్ర ప్రజలు.. వరుసగా ఐదోసారి అధికారం అప్పగించారు. మరోవైపు కమలం గత ఎన్నికలతో పోల్చితే వికసించి, ప్రతిపక్ష హోదా దక్కించుకున్నది. దాదాపు రెండు దశాబ్దాలుగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ కుదేలైంది. ఒడిశా అసెంబ్లీలో 147 స్థానాలు ఉండగా బీజేడీకి ఏకంగా 113 స్థానాల్లో ఆధిక్యం కట్టబెట్టారు. 22 సీట్లలో గెలుపుబాటలో ఉన్న బీజేపీకి ప్రతిపక్ష హోదా దక్కనున్నది. కాంగ్రెస్ కేవలం 10 స్థానాలకు పరిమితమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇతరులు ఓ చోట ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 73.1 శాతం పోలింగ్ నమోదైంది. నవీన్ పట్నాయక్ పశ్చిమ ఒడిశాలోని బీజేపూర్, తీరప్రాంతంలోని హింజ్లి నియోజకవర్గాల నుంచి బరిలో నిలిచారు. రెండు స్థానాల్లోనూ విజయదుందుభి మోగించారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నిరంజన్ పట్నాయక్ ఘసిపుర, భండారిపోఖరి నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగగా.. రెండుచోట్లా బీజేడీ అభ్యర్థుల చేతిలో ఓటమిపాలయ్యారు.

తరగని ప్రజాదరణ

నవీన్ పట్నాయక్ ఒడిశా సీఎంగా 2000 సంవత్సరం నుంచి కొనసాగుతున్నారు. అప్పటినుంచి ఆయన ప్రజాదరణలో దూసుకుపోతున్నారు. 2000లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన నేతృత్వంలోని బీజేడీ 68 స్థానాలు గెలుచుకొని అధికారంలోకి వచ్చింది. 2004 ఎన్నికల్లో 61 స్థానాలకే పరిమితమైనా, 2009 ఎన్నికల్లో 103 స్థానాల్లో విజయం సాధించింది. 2014 ఎన్నికల్లో ఏకంగా 117 సీట్లు గెలుచుకొని వరుసగా నాలుగోసారి నవీన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
naveen1

పక్కా వ్యూహంతో కమల వికాసం

ఒడిశాలో బీజేపీ దీర్ఘకాలిక వ్యూహాన్ని అమలు చేస్తున్నది. ఒకప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రస్థాయిలో నిరసన ప్రదర్శనలు చేపట్టిన బీజేపీ.. కొన్నేండ్లుగా గ్రామ, మండల స్థాయిలో ధర్నాలు చేస్తున్నది. ఫలితంగా 2012లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 851 జెడ్పీటీసీలకుగానూ బీజేపీ 36 గెలుచుకోగా, 2017 నాటికి ఏకంగా 297 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ 128 స్థానాల నుంచి 60కి పడిపోయింది. బీజేడీ ఆధిక్యం ప్రదర్శించినా.. 2012లో 651 స్థానాలు గెలుచుకోగా 2017 నాటికి 473కు తగ్గింది. అదే సమయంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా తరుచూ ఒడిశాలో పర్యటించారు. కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. ఫలితంగా 2014 ఎన్నికల్లో 10 సీట్లు మాత్రమే సాధించిన బీజేపీ.. ప్రతిపక్ష హోదా దక్కించుకున్నది.

502
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles