వాయు గండం


Wed,June 12, 2019 02:24 AM

Cyclone Vayu to intensify into severe cyclonic storm NDRF deployed

-అరేబియాలో ఏర్పడిన తుఫాన్
-గుజరాత్ దిశగా పయనం
-రేపు తీరాన్ని తాకే అవకాశం
-అప్రమత్తమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
-సురక్షిత ప్రాంతాలకు తీర ప్రాంత ప్రజల తరలింపు
-రంగంలోకి దిగిన సైన్యం, ఎన్డీఆర్‌ఎఫ్, తీర ప్రాంత రక్షణ దళాలు

న్యూఢిల్లీ, జూన్ 11:అరేబియా సముద్రంలో రెండు రోజుల క్రితం ఏర్పడిన అల్ప పీడనం క్రమంగా బలపడుతూ తుఫాన్ రూపాన్ని సంతరించుకున్నది. ఈ తుఫాన్‌కు వాయు అని నామకరణం చేశారు. గుజరాత్‌లోని వెరావాల్ తీరానికి 650 కి.మీ. దూరంలో ఉన్న వాయు తుఫాన్ గురువారం ఉదయం తీరాన్ని తాకవచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేస్తున్నది. ఈ తుఫాను బుధవారం ఉదయానికి పెను తుఫాన్‌గా మారే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర దిశగా కదులుతున్న వాయు గుజరాత్‌లోని పోర్‌బందర్, మహువా మధ్య వెరావల్ వద్ద తీరాన్ని తాకవచ్చని పేర్కొంది. ఈ తుఫాన్ కారణంగా 110 నుంచి 120 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. తుఫాన్ తీరాన్ని తాకే సమయంలో గుజరాత్‌లోని సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడవచ్చని హెచ్చరించింది. ప్రభుత్వం ఇప్పటికే సౌరాష్ట్ర, కచ్‌లోని తీర ప్రాంతాల్లో జాతీయ విపత్తు సహాయ సిబ్బంది(ఎన్డీఆర్‌ఎఫ్)ను మోహరించింది. మత్స్యకారులను సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించిన అధికారులు నౌకాశ్రయాల్లో రెండో ప్రమాద సంకేతాన్ని ఎగురవేశారు. రాజ్‌కోట్‌లో ఈ నెల 13న స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. సముద్రంలో అలలు మీటరున్నర ఎత్తువరకు ఎగిసిపడవచ్చని అధికారులు తెలిపారు. దీంతో గుజరాత్‌లోని తీర ప్రాంతాలైన కచ్, దేవభూమి ద్వారక, పోర్‌బందర్, జునాగఢ్, డయ్యూ, గిర్ సోమ్‌నాథ్, అమ్రేలీ, భావ్‌నగర్ జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు నీటమునగవచ్చని భావిస్తున్నారు. లక్షద్వీప్, కేరళ, కర్ణాటక, దక్షిణ మహారాష్ట్రలో వాయు ప్రభావం స్వల్పంగా ఉండవచ్చని తెలిపారు. గత నెలలో సంభవించిన ఫొని తుఫాన్ 60 మందిని బలితీసుకొని ఒడిశా రాష్ర్టాన్ని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే.

అప్రమత్తమైన ప్రభుత్వం

వాయు తుఫాన్‌తో ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం అప్రమత్తమైంది. తీర ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎం విజయ్ రూపాణి అధికారులను ఆదేశించారు. విపత్తు సమయంలో ప్రాణనష్టం, ఆస్తి నష్టాన్ని నివారించేందుకు తమ ప్రభుత్వ అధికారులు.. ఈ విషయంలో నైపుణ్యం ఉన్న ఒడిశా ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నారని చెప్పారు. సంబంధిత ప్రభుత్వ విభాగాల్లోని ఉద్యోగుల సెలవులను రద్దు చేశామని తెలిపారు. బుధవారం క్యాబినెట్ భేటీ అనంతరం మంత్రులు ఆయా జిల్లాలకు వెళ్లి సహాయ, పునరావాస చర్యలను పర్యవేక్షిస్తారని చెప్పారు. మరోవైపు కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ పీకే సిన్హా, గుజరాత్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జేఎన్ సింగ్ వేర్వేరుగా సమీక్షలు నిర్వహించారు.
ndrf-camp

అమిత్ షా ఉన్నతస్థాయి సమీక్ష

వాయు తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు గుజరాత్ ప్రభుత్వ సంసిద్ధతపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఢిల్లీలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 45 మంది సభ్యుల చొప్పున ఉన్న 25 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను ఇప్పటికే తీరప్రాంతాల్లో మోహరించామని అధికారులు తెలిపారు. వారికి పడవలను, చెట్టు కొమ్మలను కత్తిరించే పరికరాలను, టెలికాం వ్యవస్థను అందుబాటులో ఉంచినట్టు పేర్కొన్నారు. రాష్ర్టానికి చెందిన 11 ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలను కూడా మోహరిస్తామని చెప్పారు. విద్యుత్, టెలికం, వైద్యం, తాగునీరు వంటి అత్యవసర సదుపాయాలను నిత్యం అందుబాటులో ఉంచాలని అమిత్‌షా అధికారులకు సూచించారు. వాయు తుఫాన్‌తో ప్రభావితమవుతాయని భావిస్తున్న గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, డామన్ డయ్యూ ప్రభుత్వాలతో నిత్యం మాట్లాడుతున్నామని చెప్పారు.

ఐదు భయానకమైన తుఫాన్లు

ఒడిశాను ఫొని తుఫాను కుదిపివేసి నెల రోజులు కూడా గడువకముందే వాయు తుఫాన్ గుజరాత్‌వైపు దూసుకొస్తున్నది. ఫొని కారణంగా ఒడిశాలో 60మందికి పైగా మరణించగా, వాయు ఎటువంటి విధ్వంసం సృష్టిస్తుందోనని అధికారులు ఆందోళన చెందుతున్నారు. భారీ స్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిన ప్రపంచంలోనే ఐదు అత్యంత భయానకమైన తుఫాన్ల వివరాలు ఇలా ఉన్నాయి.

హుగ్లీ నది తఫాన్

ఇప్పటివరకూ సంభవించిన అత్యంత భయానకమైన ప్రకృతి విపత్తుగా పేర్కొనే బెంగాల్‌లోని హుగ్లీ నది తుఫాన్ 1737వ సంవత్సరంలో వచ్చింది. ఆ ఏడాది అక్టోబర్ 11న తీరాన్ని తాకిన తుఫాన్ కారణంగా మూడు లక్షల నుంచి మూడున్నర లక్షల మంది మరణించినట్టు రికార్డులు తెలుపుతున్నాయి.

ఫిలిప్పీన్స్ హైఫాంగ్ టైఫూన్

1881లో వచ్చిన ఈ తుఫాన్ వియత్నాంలోని హైఫాంగ్‌లో విధ్వంసం సృష్టించింది. తుఫాన్ కారణంగా మూడు లక్షల మంది మరణించగా, అంటువ్యాధులు ప్రబలి, ఆకలిదప్పులతో మరికొన్ని వేల మంది మృత్యువాత పడ్డారు.

బార్బడోస్ గ్రేట్ హరీకేన్

కేప్ వర్డీ దీవుల్లో 1780లో ఏర్పడిన తుఫాను సెయింట్ లూసియాలోని మార్టినిక్‌లో 1780 అక్టోబర్ 9న తీరాన్ని దాటింది. ఈ తుఫాన్ కారణంగా 22- 27 వేల మంది మరణించారు.

ది గ్రేట్ భోలా సైక్లోన్

బంగ్లాదేశ్‌లో 1970లో వచ్చిన భోలా తుఫాన్ సుమారు 3 లక్షల మందిని బలితీసుకుంది. ఆ సమయంలో గంటకు 220 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచాయి. మృతుల సంఖ్యను కొందరు 5లక్షల మందిగా కూడా పేర్కొన్నారు. ఇప్పటివరకు సంభవించిన అత్యంత ప్రాణాంతకమైన ప్రకృతి విపత్తుగాను, భయానకమైన ఉష్ణమండల తుఫాన్‌గాను ఇది రికార్డులకెక్కింది.

నర్గీస్ తుఫాన్: నర్గీస్ తుఫాన్ కారణంగా ఆసియాలోని భారత్, థాయ్‌లాండ్, మయన్మార్, శ్రీలంక, లావోస్, బంగ్లాదేశ్ దేశాలు ప్రభావితమయ్యాయి. 2008, ఏప్రిల్ నెలాఖరులో ఈ తుఫాన్ వచ్చింది. నర్గీస్‌ను నాలుగో క్యాటగిరీలో చేర్చారు. ఈ తుఫాన్ కారణంగా ఆయా దేశాల్లో మొత్తం కలిపి 1.4 లక్షల మంది మరణించారని అధికారిక లెక్కలు చెప్తున్నాయి. కాగా మృతుల సంఖ్య అంతకంటే భారీగా ఉంటుందని అనధికార వర్గాలు పేర్కొన్నాయి.

1591
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles