కేంద్ర ఉద్యోగులకు డీఏ 5%

Thu,October 10, 2019 01:24 AM

- జూలై ఒకటి నుంచి పెంపు అమలు
- 17 శాతానికి చేరనున్న కరువు భత్యం
- 49.93 లక్షల మంది ఉద్యోగులకు, 65.26 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి
- కశ్మీర్‌ నిర్వాసితులకు రూ.5.5 లక్షల చొప్పున పునరావాస ప్యాకేజీ
- కేంద్ర మంత్రివర్గ నిర్ణయం

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 9: దీపావళి పండుగను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు తియ్యటి కబురును అందించింది. కరువు భత్యాన్ని (డీఏ) ఐదు శాతం పెంచుతున్నట్టు ప్రకటించింది. దీంతో సుమారు 49.93 లక్షల మంది ఉద్యోగులకు, 65.26 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. తాజా పెంపుతో కేంద్ర ఉద్యోగుల డీఏ ప్రస్తుతమున్న 12 శాతం నుంచి 17 శాతానికి పెరుగనుంది. ఈ పెంపుతో ప్రభుత్వ ఖజానాపై రూ.16వేల కోట్ల భారం పడనుంది. కేంద్ర ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్‌ (డియర్‌నెస్‌ రిలీఫ్‌)ను విడుదల చేయాలని ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం నిర్ణయించిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ తెలిపారు. ఈ పెంపుదల ఈ ఏడాది జూలై ఒకటో తేదీ నుంచి వర్తిస్తుందని చెప్పారు. నిత్యావసర ధరల పెంపును దృష్టిలో ఉంచుకొని, 7వ పే కమిషన్‌ సిఫారసులకు అనుగుణంగా ఈ కరువు భత్యాన్ని పెంచినట్టు పేర్కొన్నారు. ఒకేసారి ఐదు శాతం పాయింట్లు పెంచడం ఇదే మొదటిసారి అని మంత్రి చెప్పారు. ఈ ఏడాది జనవరిలో డీఏ/డీఆర్‌ను తొమ్మిది నుంచి 12 శాతానికి పెంచామని ఆయన గుర్తు చేశారు. మరోవైపు, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే) నుంచి వలస వచ్చిన 5,300 నిర్వాసిత కుటుంబాలలో ఒక్కొక్క కుటుంబానికి రూ.5.5 లక్షల చొప్పున పునరావాస ప్యాకేజీని వర్తింపజేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. పీవోకే నుంచి వచ్చి దేశంలోని పలు ప్రాంతాల్లో స్థిరపడిన ఆ కుటుంబాలకు ప్రభుత్వం జమ్ముకశ్మీర్‌లో పునరావాసం కల్పించింది. నిర్వాసిత కుటుంబాల కోసం అమలు చేస్తున్న పథకంలో భాగంగా ఈ కుటుంబాలకు రూ.5.5 లక్షల ఆర్థిక సాయం అందుతుందని మంత్రి జవదేకర్‌ తెలిపారు.

1947లో పాకిస్థాన్‌ దురాక్రమణ సందర్భంగా పీవోకే నుంచి 31,619 కుటుంబాలు జమ్ముకశ్మీర్‌కు వలస వచ్చాయి. వీటిలో 26,319 కుటుంబాలు జమ్ముకశ్మీర్‌లో స్థిరపడగా, ఇతర కుటుంబాలు దేశంలోని వివిధ ప్రాంతాలకు వలస వెళ్లాయి. ఆ తరువాత 1965, 1971లో జరిగిన భారత్‌-పాక్‌ యుద్ధం సందర్భంగా ఛాంబ్‌-నియాబత్‌ ప్రాంతానికి చెందిన 10,065 కుటుంబాలు నిర్వాసితులయ్యాయి. మొత్తంగా 36,384 నిర్వాసిత కుటుంబాలకు కేంద్ర క్యాబినెట్‌ 2016, నవంబర్‌ 30న ఒక ప్యాకేజీని ప్రకటించింది. జమ్ముకశ్మీర్‌లో స్థిరపడిన ఈ కుటుంబాలకు మాత్రమే ఆ ప్యాకేజీని అమలు చేసింది. దేశంలోని ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన 5,300 కుటుంబాలను మాత్రం ఈ ప్యాకేజీలో చేర్చలేదు. కాగా తాజాగా ఆ కుటుంబాలకు కూడా కేంద్ర ప్రభుత్వ ప్యాకేజీని వర్తింపజేయాలని నిర్ణయించినట్టు జవదేకర్‌ తెలిపారు.

పీఎం కిసాన్‌ ఆధార్‌ అనుసంధానానికి నవంబర్‌ 30వరకు గడువు

ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం ద్వారా లబ్ధి పొందేందుకు రైతులు తమ ఆధార్‌ను అనుసంధానం చేసే గడువును ప్రభుత్వం నవంబర్‌ 30వ తేదీ వరకు పొడిగించింది. రైతులకు అవసరమైన వ్యవసాయ పెట్టుబడుల కోసం ప్రభుత్వం పీఎం కిసాన్‌ పథకం కింద రూ.6,000 నగదును అందజేస్తున్న సంగతి తెలిసిందే. దేశంలోని 14 కోట్ల మంది రైతులకు ప్రభుత్వం మూడు విడుతలుగా నగదు మొత్తాన్ని విడుదల చేస్తున్నది. ఈ ఏడాది ఆగస్టు అనంతరం పీఎం కిసాన్‌ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకున్న రైతులు తప్పనిసరిగా తమ ఆధార్‌ను అనుసంధానం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. నవంబర్‌ 30వ తేదీలోగా ఆధార్‌ను అనుసంధానించాలని ప్రభుత్వం తాజాగా గడువు విధించింది.

208
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles